అమరావతి : ఏసీబీ(ACB) చరిత్రలో అతి పెద్ద ట్రాప్(Record Trap) ఏపీ(Andhra Pradesh) లో చోటుచేసుకుంది. రూ.5 కోట్లు లంచం డిమాండ్ చేసిన గిరిజన సంక్షేమ శాఖ(Tribal Welfare) చీఫ్ ఇంజనీర్(Chief Engineer Arrest) ఏసీబీకి చిక్కడం కలకలం రేపింది. ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్లో(tribal welfare department)చీఫ్ ఇంజనీర్ (ENC)గా పని చేస్తున్న సబ్బవరం శ్రీనివాస్(Sabbaram Srinivas) పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు 5 కోట్ల రూపాయల లంచం డిమాండ్ చేసి..బాధితుడి నుంచి రూ.25లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయాడు. ఇందుకు సంబంధించిన వివరాలలోకి వెళితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏజెన్సీ ప్రాంతాల్లో విద్యా, ఉపాధి, అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులను కేటాయిస్తున్నాయి. ఈ నిధులతో గిరిజన ప్రాంతాల్లో ఏకలవ్య మోడల్ స్కూల్ నిర్మించే కాంట్రాక్టును దక్కించుకున్న కృష్ణం రాజు (Contractor Krishnam Raju) వాటి నిర్మాణ పనులు నిబంధనల మేరకు కొన్ని పూర్తి చేయగా..మరికొన్ని నిర్మాణ దశల్లో ఉన్నాయి. నిర్మాణ పనులు పూర్తి చేసిన వాటికి ఇవ్వాల్సిన రూ.30.50కోట్ల బిల్లులు ఇవ్వాలని ట్రైబల్ వెల్ఫేర్ ఈఎన్సీగా ఉన్న శ్రీనివాస్ ను సంప్రదించాడు. ఎన్నిసార్లు అడిగినా..శ్రీనివాస్ ఏదో ఒక కొర్రి పెడుతూ కాంట్రాక్టర్ కృష్ణంరాజును తిప్పిస్తున్నాడు. చివరకు 30.50 కోట్ల బిల్లులు క్లియర్ చేసేందుకు రూ.5కోట్లు లంచం కావాలని కోరాడు. చేసేది లేక కాంట్రాక్టర్ కృష్ణంరాజు రూ.25లక్షలను శ్రీనివాస్ కు లంచంగా ఇచ్చాడు.
అయినా కూడా బిల్లులు మంజూరు చేయకుండా మరో రూ.25లక్షలు కావాలని డిమాండ్ చేశాడు. అది కూడా తన కార్యాలయంలోనే ఇవ్వాలని సూచించాడు. దీంతో విసుగెత్తిపోయిన బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. ఏసీబీ డీజీ అతుల్ సింగ్ వెంటనే ఈ వ్యవహారంపై చర్యలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విశాఖపట్నం, ఇటు విజయవాడ ఏసీబీ అధికారులు సంయుక్తంగా దాడి చేయాలని నిర్ణయించారు. ఏసీబీ అధికారుల పథకం మేరకు కాంట్రాక్టర్ కృష్ణం రాజు నుంచి ఈఎన్సీ శ్రీనివాస్ 25 లక్షల లంచం సొమ్ము తీసుకుంటుండగా తన కార్యాలయంలోనే ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం కెమికల్ టెస్టులు చేసి డబ్బును సీజ్ చేశారు.. శ్రీనివాస్ ను అరెస్టు చేసి.. రిమాండ్ కు పంపించారు. మరో మూడు వారాల్లో పదవీ విరమణ చేయాల్సిన శ్రీనివాస్ తన దురాశ కారణంగా చివరకు జైలు పాలయ్యాడు. విజయవాడ ఏసీబీ డీఎస్పీ సుబ్బారావు, శ్రీకాకుళం డీఎస్పీ రమణమూర్తి, ఇన్‌స్పెక్టర్లు భాస్కరరావు, నాగరాజులు ఈ దాడిలో పాల్గొన్నారు
ఏసీబీ కేసులలో హ్యాట్రిక్ కొట్టాడు
రూ.25లక్షల సొమ్ముతో పట్టుబడిన ఈఎన్సీ శ్రీనివాస్ గతంలోనూ 2001లో విశాఖపట్నం ఎస్‌ఈ కార్యాలయంలో ఏఈగా మొదటిసారి, శ్రీకాకుళం జిల్లా సీతంపేటలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేస్తూ 2014లో రెండో దఫా ఏసీబీకి పట్టుబడ్డారు. ఆయన ఈఎన్సీకి అనర్హుడని విజిలెన్స్ కమిషన్ సైతం గతంలో ప్రభుత్వానికి నివేదిక అందించింది. వైసీపీ హయాంలో పైరవీలతో ఆ పదవిలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీనివాస్ చివరకు మళ్లీ లంచం తీసుకుంటు మూడోసారి ఏసీబీకి పట్టుబడి అవినీతి అధికారిగా కటకటాల పాలయ్యాడు. శ్రీనివాస్ అవినీతి వ్యవహారాలు ఇప్పుడు ఒక్కోటి వెలుగు చూస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం లంబసింగిలో రూ.35 కోట్లతో నిర్మిస్తున్న గిరిజన మ్యూజియం నిర్మాణ కాంట్రాక్టర్ గా కూడా ఉన్న కృష్ణంరాజును మధ్యలోనే శ్రీనివాస్ తొలగించి మరో కాంట్రాక్టర్ కు పనులు అప్పగించాడు. దీనిపై కృష్ణంరాజు హైకోర్టును ఆశ్రయించగా..హైకోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. కోర్టు ఆదేశాలను అమలు చేయాలంటే మరో కోటి రూపాయాలు ఇవ్వాలని బాధితుడిని శ్రీనివాస్ డిమాండ్ చేసినట్లుగా వెలుగులోకి రావడంతో ఆయన వ్యవహారంపై ఏసీబీ మరింత లోతుగా విచారణ చేస్తుంది.