Kadiyam Srihari | తెలంగాణను దోచుకున్న కల్వకుంట్ల కుటుంబం : మాజీ మంత్రి కడియం

‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు కల్వకుంట్ల కుటుంబం ఆస్తులు ఎన్ని? ఇప్పుడు ఉన్న ఆస్తులు ఎన్నో ప్రజలకు చెప్పాలి’ అని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి డిమాండ్ చేశారు.

విధాత, వరంగల్ ప్రతినిధి :

‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు కల్వకుంట్ల కుటుంబం ఆస్తులు ఎన్ని? ఇప్పుడు ఉన్న ఆస్తులు ఎన్నో ప్రజలకు చెప్పాలి’ అని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి డిమాండ్ చేశారు. స్థానికంగా మంగళవారం ఆయన మాట్లాడుతూ ఉద్యమం చేసిన పార్టీ అని ప్రజలు రెండు సార్లు అధికారం ఇస్తే కల్వకుంట్ల కుటుంబం తెలంగాణపైన పడి దోచుకున్నారని ఆరోపించారు. కేటీఆర్ ముందుగా తన చెల్లి కవిత అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. ఇంట్లో కుటుంబ సభ్యులనే ఒప్పించలేని స్థితిలో కేటీఆర్ ఉన్నాడని ఎద్దేవా చేశారు. ముందు నీ ఇంటి వ్యవహారం చక్కదిద్దుకోని ఆ తర్వాత ఇతరులను విమర్శించాలని కేటీఆర్ కు కడియం సలహా ఇచ్చారు. కేటీఆర్ అధికారం కోల్పోయినా అహంకారం తగ్గలేదని, అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై, కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేటీఆర్ అహంభావంతో మాట్లాడటం సరికాదని సూచించారు. దేశానికే ఆదర్శవంతమైన పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. 200యూనిట్ల ఉచిత విద్యుత్, సన్న బియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇండ్లు, 21వేల కోట్ల రుణమాఫీ, సన్నాలకు 500బోనస్ వంటి పథకాలు కేటీఆర్ కళ్లకు కనిపించడం లేదా అని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శిరీష్ రెడ్డి, ఆర్డీవో, రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖ, ఆర్ అండ్ బి శాఖ అధికారులు, ఇతర శాఖల అధికారులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.