విధాత, హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు అవతవకలకు సంబంధించి విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు బీఆర్ఎస్ మాజీ మంత్రి టి.హరీశ్ రావు విచారణ ముగిసింది. దాదాపు గంటకు పైగా కాళేశ్వరం కమిషన్ హరీశ్ రావను విచారించింది. కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ అడిగిన అన్ని ప్రశ్నలకు మాజీ మంత్రి హరీష్ రావు సమాధానమిచ్చారు. తన వాదనకు సంబంధించిన ఆధారాలతో
సహా హరీష్ రావు సమాధానమిచ్చారు. కమిషన్ హరీశ్ రావును మొత్తం 20 ప్రశ్నలు, అనుబంధ ప్రశ్నలు అడిగింది. అడిగిన ప్రతి ప్రశ్నకు ఆధారాలు చూపిస్తూ హరీష్ రావు సమాధానం ఇచ్చారు. విచారణలో హరీశ్ రావు నిక్కచ్చిగా తన సమాధానాలిచ్చారు. ఇప్పటికే వందమందికిపైగా అధికారులు, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులను, ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాల నాయకులను విచారించింది. తాజాగా మాజీ మంత్రి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కూడా విచారణకు హాజరయ్యారు. ఇప్పటిదాక చేసిన విచారణకు సంబంధించి వచ్చిన సమాచారం అధారంగా కమిషన్ హరీశ్ రావుకు పలు ప్రశ్నలు సంధించినట్లుగా సమాచారం. ఈ నెల 11న మాజీ సీఎం కేసీఆర్ కూడా కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరుకాబోతున్నారు.
అన్ని ప్రశ్నలకు జవాబు చెప్పాను : హరీశ్ రావు
విధాత, హైదరాబాద్ : కాళేశ్వరం కమిషన్ అడిగిన అన్ని ప్రశ్నలకు ఆధారాలతో సహా సమాధానం చెప్పడం జరిగిందని మాజీ మంత్రి టి. హరీష్ రావు వెల్లడించారు. కమిషన్ విచారణ ముగిశాక ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయాల ఏమైనా ఉంటే తరువాత మాట్లాడుతానని..లోపల ఒకటి బయట ఒకటి నేను మాట్లాడనని హరీశ్ రావు అన్నారు. కాళేశ్వరం కమిషన్ ముందు ఏదీ నోటి మాటగా చెప్పలేదు..అన్నీ సాక్ష్యాధారాలతో సహా సమర్పించడం జరిగిందని హరీశ్ రావు స్పష్టం చేశారు.
మొట్టమొదట తమ్మిడి హట్టి నుండి మేడిగడ్డకు బ్యారేజ్ ను ఎందుకు మార్చారు అనేదానిపై చాలాసేపు డిస్కషన్ జరిగిందని హరీశ్ రావు తెలిపారు. దానికి నేను కొత్తగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం తమ్మిడి హట్టి దగ్గరే ప్రాజెక్టు కట్టడానికి అన్ని రకాల ప్రయత్నం చేశామని.. ఇరిగేషన్ మంత్రిగా రివ్యూ చేసినప్పుడు ప్రాణాహిత ప్రాజెక్టు 7 ప్యాకేజీలు 27 భాగాలుగా టెండర్లను పిలిచిందని.. గత కాంగ్రెస్ ప్రభుత్వం..తల భాగం పనులు స్టార్ట్ చేయకుండా తోక పనులను కాంగ్రెస్ ప్రభుత్వం తవ్విందని వివరించామని..మహారాష్ట్ర కాంగ్రెస్ ఇరిగేషన్ మంత్రి హసన్ ముష్రఫ్ ను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన నెలకే వెళ్లి కలవడం జరిగిందని తెలిపామన్నారు. తమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతి ఇవ్వండని అప్పటి మహారాష్ట్ర కాంగ్రెస్ మంత్రి హసన్ ముష్రఫ్ ను కోరడం జరిగిందని..ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి హాసన్ ముష్రఫ్.. చాలా రోజులుగా ముంపు గ్రామాల ప్రజలు మా ప్రభుత్వంపై నిరసన కార్యక్రమాలు చేస్తున్నారని..ఎట్టి పరిస్థితుల్లో మేము ప్రాజెక్టు 152 మీటర్ల ఎత్తులో నిర్మాణానికి ఒప్పుకోమని తేల్చి చెప్పారని కమిషన్ కు ఆనాటి చర్చలను ఆధారాలతో పాటు వివరించామన్నారు. ఇదే విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చౌహాన్ అప్పటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఈ ప్రాజెక్టు 152 మీటర్ల ఎత్తులో నిర్మించడానికి ఒప్పుకోమని తేల్చి చెప్పారని చెప్పడం జరిగిందని..ఈ విషయాన్ని కూడా కమిషన్ దృష్టికి తీసుకు వెళ్ళామని హరీష్ రావు వివరించారు. మహారాష్ట్ర, తెలంగాణ మధ్య తమ్మిడి హట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి ఐదారు మీటింగ్ లు జరిగాయని.. మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం పోయి బీజేపీ ప్రభుత్వం వచ్చినాక నీటిపారుదల మంత్రిని కలిసి మళ్లీ తమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించాలని, తెలంగాణకు నీటి అవసరం ఉందని కోరడం జరిగిందన్నారు. స్వయంగా కేసీఆర్ మహారాష్ట్ర వచ్చి అప్పటి గవర్నర్ విద్యాసాగర్ సమక్షంలో బీజేపీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ని కలిశారని..అనేక విధాలుగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ని కేసీఆర్ విజ్ఞప్తి చేశారన్న విషయాలను కమిషన్ కు తెలిపానని హరీశ్ రావు చెప్పారు. ఏడేండ్లు మాకంటే ముందు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ పార్టీ తరఫున ఈ ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకిస్తూ అనేక పోరాటాలు చేసింది తానేనని ఇప్పుడు ఆ ప్రాజెక్టుకు పర్మిషన్ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వలేమని పడ్నవీస్ తేల్చి చెప్పారని ఈ విషయాన్ని కమిషన్ కు తెలిపానని పేర్కొన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో జరిపిన చర్చల మినిట్స్ ను కమిషన్ కు అందించామని చెప్పారు.
కేంద్రంలో కాంగ్రెస్, మహారాష్ట్రలో కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ఏడు సంవత్సరాలు అధికారంలో ఉంటే ఒక్క అనుమతి కూడా సాధించలేదని..ఒక్క అంతర్రాష్ట్ర ఒప్పందం చేసుకోలేదు. ఒక గుంట భూమిని కూడా సేకరించలేదని..తమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని..తెలంగాణ ప్రాంతం నుంచి మంత్రులుగా ఉన్న కోమటిరెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డి ఆనాడు దానిని పట్టించుకోలేదని హరీశ్ రావు ఈ సందర్భంగా విమర్శించారు. .
సెంట్రల్ వాటర్ కమిషన్ తమ్మిడి హట్టి వద్ద నీటి లభ్యత లేదు అని ప్రాజెక్టు నిర్మాణానికి ప్రత్యామ్నాయం చూసుకోవాలని లేఖ రాసిందని..అదేవిధంగా సీడబ్ల్యుసీ తమ్మిడిహట్టి ప్రాజెక్టులో ప్రతిపాదించిన రిజర్వాయర్ల సామర్థ్యం కూడా సరిపోదని సామర్థ్యానికి సరిపోయే రిజర్వాయర్లను పెంచుకోవాలని ఉత్తరం రాసిందన్నారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ ని బ్యారేజ్ నిర్మాణ స్థల ఎంపిక చేయాలని కేసీఆర్ కోరడం జరిగిందని..కేంద్ర సంస్థ వాప్కోస్ లాడార్ సర్వే చేసి, ఎగ్జామిన్ చేసి మేడిగడ్డ వద్ద నీటి లభ్యత ఉంది అక్కడ ప్రాజెక్టు నిర్మాణం చేసుకోవచ్చని తెలిపిందని…వాప్కోస్, సెంట్రల్ వాటర్ కమిషన్, ఇంజనీర్ల సూచన మేరకు మేడిగడ్డ వద్ద ప్రాజెక్ట్ నిర్మాణం జరిగిందని కమిషన్ కు వివరించినట్లుగా హరీశ్ రావు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడేండ్లుగా పొరుగు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించలేదు. అదేవిధంగా మహారాష్ట్రలో ముంపుకు గురవుతున్న చోట చాప్రాల్ వైల్డ్ లైఫ్ ఉంది. వైల్డ్ లైఫ్ అనుమతులు లభించాలంటే కనీసం 10 సంవత్సరాలు సుప్రీంకోర్టులో కొట్లాడాల్సి వస్తుంది. నీళ్లు లేనిచోట కాంగ్రెస్ ప్రాజెక్ట్ ప్రతిపాదిస్తే నీళ్లు ఉన్నచోట ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించడం జరిగిందని..ఇందుకు సంబంధించిన అన్ని రకాల ఆధారాలు మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాసిన ఉత్తరాలు, జీవోలు అన్నీ కమిషన్ కు సమర్పించడం జరిగిందని హరీశ్ రావు తెలిపారు. క్యాబినెట్ నిర్ణయాలు, వాప్కోస్ రిపోర్టులు, సీడబ్ల్యూసీ లేఖలు అన్నీ సమర్పించడం జరిగిందని చెప్పారు.
ఇక రెండో ప్రశ్నగా కాళేశ్వరం కార్పొరేషన్ కి అనుమతి ఉందా అని కమిషన్ ప్రశ్నించిందని..కాళేశ్వరం కమిషన్ కు స్పష్టంగా అనుమతి ఉన్న విషయాన్ని అన్ని ఆధారాలతో సమర్పించడం జరిగిందని హరీశ్ రావు మీడియాకు వివరించారు. అలాగే అన్నారం, సుందిళ్ల బ్యారేజీ లోకేషన్ మార్పుల గురించి కమిషన్ అడిగారని..అది పూర్తిగా టెక్నికల్ నిర్ణయమని..ఇంజనీర్ల డీటెయిల్ సర్వే ఆధారంగా బ్యారేజ్ లొకేషన్ మారింది. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకునే నిర్ణయమని చెప్పడం జరిగిందని వెల్లడించారు. దేశంలో ఇలా అనేక ప్రాజెక్టుల నిర్మాణ విషయంలో జరుగుతుంది వాటికి సంబంధించిన ఆధారాలు కూడా కమిషన్ కి సమర్పించడం జరిగిందని హరీశ్ రావు తెలిపారు. మరో ప్రశ్నగా కాళేశ్వరం ప్రాజెక్టులో రిజర్వాయర్లకు కెపాసిటీ ఎంత అని అడిగారని..141 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్లు నిర్మించామని చెప్పడం జరిగిందని హరీశ్ రావు వెల్లడించారు.
కాళేశ్వరంపై పిచ్చికూతలు కూస్తూ కూలేశ్వరం అని మాట్లాడుతున్నారని..విఫల ప్రాజెక్టుగా కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తుందని హరీశ్ రావు మండిపడ్డారు. కాళేశ్వరంలో 100 భాగాలు ఉన్నాయని. కాళేశ్వరం ప్రాజెక్టులో 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు,19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌజ్ లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, 141 టిఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్, 240 టిఎంసీల నీటి వినియోగం..పూర్తిగా ఇవన్నీ ఇంటాక్ట్ ఉన్నాయని హరీశ్ రావు మరోసారి గుర్తు చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గంధమల్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని..గంధమల్ల ప్రాజెక్ట్ కు వచ్చే నీళ్లు ఎక్కడివో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా హరీశ్ రావు డిమాండ్ చేశారు. మూసీ నదిని సుందరీకరణ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతున్నారని..మల్లన్న సాగర్ నుంచి మూసీకి నీళ్లు తీసుకొస్తామని చెప్తున్నారని..మరి
మల్లన్న సాగర్ కు వచ్చే నీళ్లు ఎక్కడివో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఎప్పటికైనాతెలంగాణకు జీవధార కాళేశ్వరం ప్రాజెక్టు అని హరీశ్ రావు మరోసారి స్పష్టం చేశారు.