విధాత :
ప్రజల్లో అవగాహన వచ్చినప్పుడే పరిస్థితుల్లో మార్పు వస్తుందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. హైడ్రాను ఎందుకు ఏర్పాటు చేశారు.. హైడ్రా ఏం చేస్తుందనే విషయమై ఇప్పుడు అందరిలో అవగాహన వచ్చిందని అన్నారు. ఇంటర్నేషనల్ కమిషన్ ఆఫ్ కల్చర్ అండ్ డిప్లమాటిక్ రిలేషన్స్ (ICCDR) ఆధ్వర్యంలో యునైటెడ్ నేషన్స్ డే ను పురస్కరించుకుని “మారుతున్న ప్రపంచ పరిస్థితుల్లో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్‌లో సంస్కరణల అవసరం” అనే అంశంపై గ్రీన్ పార్కు హోటల్‌లో శుక్రవారం జరిగిన సదస్సులో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సాంస్కృతిక వారసత్వ పరిరక్షణతో పాటు.. పర్యావరణ పరిరక్షణకు ఐక్యరాజ్యసమితి పెద్ద పీట వేస్తుందని అన్నారు. ఆ దిశగా నగరంలో మెరుగైన జీవన విధానాలు పెంపొందించేందుకు హైడ్రా పని చేస్తోందని చెప్పారు. ఆ క్రమంలోనే ఆక్రమణల తొలగింపు.. చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాలను పెద్దయెత్తున చేపట్టామని అన్నారు. ఇటీవల హైడ్రా వార్షికోత్సవాలు సందర్భంగా ఏర్పాటు చేసిన విజ్ఞాన ప్రదర్శనలో నాలుగైదు తరగతు విద్యార్థులు కూడా చెరువు ఎఫ్‌టీఎల్(ఫుల్ ట్యాంక్ లెవెల్), బఫర్ జోన్ల గురించి వివరించిన తీరే హైడ్రా పట్ల ప్రజల్లో అవగాహన వచ్చిందనడానికి నిదర్శనమని తెలిపారు.
భారీ వర్షాలు పడినా.. వరదలు నివారించాం..
హైదరాబాద్‌లో చెరువులను పునరుద్ధరిస్తున్నామని.. ఆక్రమణలతో చెరువు ఆనవాళ్లు కోల్పోయిన బతుకమ్మ కుంటను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ చెప్పారు. త్వరలోనే మరో 5 చెరువులు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతాయన్నారు. అలాగే నాలాలను కూడా పరిరక్షించే పనిని చేపట్టామని చెప్పారు. ప్యాట్నీ నాలా విస్తరణతో 7 కాలనీలకు వరద ముప్పు తప్పించామన్నారు. నాలాల్లో పెద్దమొత్తంలో పూడికను తొలగించి ఈ ఏడాది వరద ముప్పును తగ్గించామన్నారు. చెరువులు.. వాటిని అనుసంధానం చేసే నాలాలను కాపాడుకోకపోతే.. నగరాలను వరదలు ముంచెత్తుతాయని హెచ్చరించారు. ఈ ఏడాది భారీ వర్షాలు కురిసినా.. నగరంలో వరద కష్టాలు లేకుండా జాగ్రత్త పడ్డామని చెప్పారు. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ నివేదిక ప్రకారం నగరంలో 61 శాతం చెరువులు మాయం అయ్యాయన్నారు. ఇప్పటికైనా అప్రమత్తం కాకపోతే మిగతా 39 శాతం కూడా కనుమరుగయ్యే ప్రమాదం ఉందని.. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ముందుచూపుతో హైడ్రాను ఏర్పాటు చేసి.. చెరువులు, నాలాల పరిరక్షణకు పెద్ద పీట వేస్తోందని కమిషనర్ వెల్లడించారు.
15 నెలల్లో వెయ్యి ఎకరాలు కాపాడాం..
ప్రభుత్వ భూములు, పార్కులు, రహదారులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను పరిరక్షించుకోవాల్సిన అవసరంపై ప్రజల్లో ఇప్పుడు పూర్తి అవగాహన వచ్చిందని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారుచెప్పారు. హైడ్రా ఏర్పాటు చేసి ఏడాది దాటి 3 నెలల వ్యవధిలో వెయ్యి ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడామన్నారు. దీని విలువ దాదాపు రూ. 60 వేల కోట్లు ఉంటుందన్నారు. రియర్ అడ్మిరల్ ఆర్. శ్రీనివాసరావు, మేజర్ ఎస్‌పిఎస్ ఓబెరాయ్ గౌరవ అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. ప్రపంచ శాంతి, అభివృద్ధి కోసం సమిష్టి కృషి అవసరమని పేర్కొన్నారు. హైడ్రా లక్ష్యాలు ఐక్యరాజ్యసమితి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ (SDGs) తో అనుసంధానంగా ఉన్నాయన్నారు. ఈ సదస్సుకు పద్మ కాంత హజారిక (OSD/మిషన్ డైరెక్టర్, APTDCL, అస్సాం), సర్సింగ్ ఎంగ్టి (చైర్మన్, డొరోతి వాలంటరీ అసోసియేషన్) ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. దేశాల మధ్య సాంస్కృతిక, దౌత్య సంబంధాలను బలపరచడమే ICCDR ధ్యేయమని ఆ సంస్థ సెక్రటరీ జనరల్, అంబాసిడర్ డా. శ్రీనివాస్ ఎలూరి పేర్కొన్నారు. వివిధ రంగాల్లో సేవలందించిన ప్రముఖులకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అవార్డులను ఈ సందర్భంగా అందజేశారు.
