Site icon vidhaatha

Telangana Assembly| తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..మాగంటికి సంతాప తీర్మానం

విధాత, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు సమావేశాల ప్రారంభం సందర్భంగా దివంగత జూబ్లిహీల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్(Maganti Gopinath) కు సంతాపం తెలుపుతూ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తీర్మానం(Condolence Resolution) ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై చర్చ అనంతరం సభ రేపటికి వాయిదా పడింది. అటు శాసన మండలిలో మాగంటికి సంతాపం తీర్మానం అనంతరం మండలి సమావేశాలను వాయిదా వేస్తున్నట్లుగా చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించారు.

శాసన సభలో సీఎం రేవంత్ రెడ్డి దివంగత మాగంటి గోపినాథ్ సంతాప తీర్మానం ప్రవేశ పెడుతూ గోపినాథ్ తో తనకు ఉన్న అనుబంధాన్ని, ఆయన చేసిన ప్రజాసేవను గుర్తు చేసుకున్నారు. విద్యార్థి దశ నుంచే గోపినాథ్ చురుకుగా ఉండేవారని, 1983లో తెలుగుదేశం పార్టీలో గోపీనాథ్ తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారని, 1985 నుంచి 1992 వరకు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి తెలుగు యువత అధ్యక్షుడిగా పని చేశారని తెలిపారు. 1987-88 లో హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ డైరెక్టర్‌గా, 1988-93 లో జిల్లా వినియోగదారుల ఫోరం సభ్యుడిగా పనిచేశారు. గోపీ ఎన్టీఆర్ కు గొప్ప భక్తుడు అని, సినీ రంగంలోనూ గోపీనాథ్ నిర్మాతగా రాణించారన్నారు. సినిమా రంగంపై అభిమానంతో ‘పాతబస్తీ’(1995), ‘రవన్న’(2000), ‘భద్రాద్రి రాముడు’ (2004), ‘నా స్టైలే వేరు’ (2009) వంటి నాలుగు సినిమాలకు గోపీనాథ్ నిర్మాతగా వ్యవహరించారన్నారు.

రాజకీయంగా పార్టీలు వేరైనా.. వ్యక్తిగతంగా నాకు మంచి మిత్రుడని, వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ఘనత సాధించిన వారిలో ఆయన ఒకరు అని కొనియాడారు. ఆయన మరణం వారి కుటుంబానికి తీరని లోటు అని, చూడటానికి ఆయన క్లాస్ గా కనిపించినా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఆయన మాస్ లీడర్ అని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నానన్నారు. అనంతరం బీఆర్ఎస్ నుంచి కేటీఆర్(KTR) గోపినాథ్ సంతాప తీర్మానంపై మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీలో ఆయన ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్నారు. మంత్రి శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వర్ రావు, పొన్నం ప్రభాకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, కేపీ వివేకానంద, వేముల ప్రశాంత్ రెడ్డిలు గోపినాథ్ సంతాప తీర్మానం చర్చలో పాల్గొన్నారు.

Exit mobile version