Reciprocal Tariffs : భారతదేశం విధిస్తున్న అధిక టారిఫ్‌లను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి టార్గెట్ చేశారు. ఎన్నిసార్లు చర్చించినా రెసిప్రోకల్ టారిఫ్ (పరస్పర సుంకాలు) విషయంలో ట్రేడ్ డీల్ కుదిరేందుకు అవకాశమే లేదని సంకేతాలిచ్చారు. రిసిప్రోకల్ టారిఫ్‌లు ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి రానున్న విషయం తెలిసిందే. ఆటో సెక్టర్‌లో భారత్ వంద శాతం పైగా టారిఫ్ విధిస్తున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఇండియా మనపై వందశాతం టారిఫ్ విధిస్తున్నది.
ఇది అమెరికాకు ఎంత మాత్రమూ ఆమోదయోగ్యం కాదు. ఏప్రిల్ 2 నుంచి రెసిప్రోకల్ టారిఫ్‌లు అమలవుతాయి. వాళ్లు ఎంత మేరకు ట్యాక్స్ విధిస్తారో.. మనం కూడా అంతే ట్యాక్స్ విధిస్తాం. వాళ్ల మార్కెట్‌ల నుంచి మనల్ని దూరం చేసేందుకు నాన్ మానిటరీ టారిఫ్‌లు విధిస్తే.. మనం కూడా వాళ్లు మన మార్కెట్‌లో ఉండకుండా అదే పద్ధతిని పాటిస్తాం.. అని అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ట్రంప్ తేల్చి చెప్పారు.
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అమెరికాలో పర్యటించిన వారాల వ్యవధిలోనే ట్రంప్ తాజాగా భారత టారిఫ్‌లను ప్రస్తావించడం గమనార్హం. మోదీ అమెరికా పర్యటన నేపథ్యంలో టారిఫ్‌ల విషయంలో కొంత రిలీఫ్ లభిస్తుందని భారత పరిశ్రమ వర్గాలు ఆశాభావంతో ఉన్నప్పటికీ.. తాజాగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఆ ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. బార్బన్ విస్కీ వంటి అనేక ఉత్పత్తులపై భారతదేశం చర్చలకు ముందే తనంతట తానే టారిఫ్‌లను తగ్గించినప్పటికీ ఉపయోగం లేకపోయిందని అర్థమవుతున్నది. అయినా టారిఫ్‌లపై చర్చల నిమిత్తం భారత విదేశాంగ శాఖ మంత్రి పీయూష్ గోయల్ సోమవారం నుంచి అమెరికాలో పర్యటిస్తున్నారు.
ఈ సందర్భంగా యునైటెడ్ స్టేట్స్ నూతన ట్రేడ్ రిప్రజెటేటివ్ (USTR) జెమిసన్ గ్రీర్‌ను కలువనున్నారు. ట్రంప్ తీసుకొచ్చిన కొత్త టారిఫ్ విధానం అమలు బాధ్యతలను గ్రీర్ చూస్తున్నారు. ఇతర దేశాలు అనేక సంవత్సరాలుగా అమెరికాపై టారిఫ్‌లు విధిస్తున్నాయని, ఇప్పుడు అటువంటి దేశాలపై అమెరికా టారిఫ్‌లు విధించే సమయం ఆసన్నమైందని ట్రంప్ తన ఉపన్యాసంలో పేర్కొన్నారు. యూరోపియన్ యూనియన్ దేశాలు, చైనా, బ్రెజిల్, భారత్ వంటి దేశాలు అమెరికా ఉత్పత్తులపై అధిక టారిఫ్‌లు విధిస్తున్నాయని అన్నారు. ఇది సహేతుకం కాదని చెప్పారు.