farm sector । వ్యవసాయం, దాని అనుబంధ రంగాల సమగ్రాభివృద్ధికి 14వేల కోట్ల రూపాయలతో ఏడు భారీ కార్యక్రమాలను ప్రకటించింది. రైతుల ఆదాయాన్ని మెరుగుపర్చడమే వీటి లక్ష్యమని తెలిపింది. సోమవారం కేంద్ర క్యాబినెట్.. ప్రధాన నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైంది. ఇందులో వ్యవసాయరంగానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో 2817 కోట్లతో డిజిటల్ అగ్రికల్చర్ మిషన్, 3979 కోట్లతో క్రాప్ సైన్స్ పథకాలు కూడా ఉన్నాయ ని సమావేశం అనంతరం మేలు చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర మంత్రివర్గ సమావేశం అనంతరం కేంద్రమంత్రి వివరాలను తెలియజేశారు. రైతుల ఆదాయాన్ని పెంచడం కోసం ఈ సమగ్ర కార్యక్రమాలను ఉద్దేశించినట్లు తెలిపారు. పరిశోధన, అధ్యయనం, వాతావరణ మార్పులు, సహజ వనరుల నిర్వహణ, వ్యవసాయ రంగ డిజిటైజేషన్‌తోపాటు ఉద్యాన పంటలు, పాడి పరిశ్రమ అభివృద్ధిపై ఈ కార్యక్రమాలు ప్రధానంగా కేంద్రీకరిస్తాయని ఆయన వెల్లడించారు.
ఆహార, పోషకాహార భద్రత కార్యక్రమాల కోసం క్రాప్ సైన్స్‌ను కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. దీనికి 3,979 కోట్లు వెచ్చిస్తారు. 2047 నాటికి వాతావరణ మార్పులను తట్టుకునేలా రైతులను సిద్ధం చేసేందుకు, ఆహార భద్రతను సాధించేందుకు ఆరు కీలక అంశాలు ఈ కార్యక్రమంలో ఉంటాయి. ఆ ఆరు కీలక అంశాల్లో పరిశోధన, అధ్యయనం; ప్లాంట్ జెనెటిక్ రిసోర్స్ మేనేజ్‌మెంట్; ఆహారం, పశుగ్రాసంలో జెనెటిక్ ఇంప్రూవ్‌మెంట్, తృణధాన్యాలు, నూనె గింజల పంటల అభివృద్ధి; వాణిజ్య పంటల మెరుగుదల; చీడపీడలపై పరిశోధన ఉన్నాయి.
వ్యవసాయ విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు, నిర్వహణ, సోషల్ సెన్సెస్ కోసం రూ.2,291 కోట్లను వెచ్చించేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ కార్యక్రమాన్ని భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) కింద చేపడుతారు. 2020 నూతన విద్యా విధానానికి అనుగుణంగా వ్యవసాయ పరిశోధన, విద్యను ఆధునీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. డిజిటల్ డీపీఐ, ఏఐ, బిగ్ డాటా, రిమోట్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించనున్నారు. 2,817 కోట్లతో డిజిటల్ అగ్రికల్చర్ మిషన్‌ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఇందులో అగ్రిస్టాక్, కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ అనే రెండు కీలక అంశాలు ఉంటాయి. పశు సంపద ఆరోగ్యం, వాటి ఉత్పత్తికి 1702 కోట్లతో మరో కార్యక్రమాన్ని కేంద్రం తీసుకున్నది. రైతులకు పాడిపరిశ్రమ నుంచి ఆదాయం పెంచేందుకు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించారు. ఉద్యానవన పంటల సమగ్రాభివృద్ధికి 860 కోట్లతో మరో కార్యక్రమానికి కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. కృషి విజ్ఞాన కేంద్రాలను 1202 కోట్లతో బలోపేతం చేయనున్నారు. నేచురల్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ కోసం మరో 1115 కోట్లు ఖర్చు చేయనున్నారు. దేశవ్యాప్తంగా 700కు పైగా కృషి విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయి.