విధాత : బెజవాడ(Vijayawada) ఇంద్రకీలాద్రిపై(Indrakeeladri) వెలసిన కనదుర్గమ్మ(Kanaka DurgaTemple) దసరా(Dasara), శరన్నవరాత్రి(Sharan Navaratri Festival) వేడుకలకు సర్వం సిద్ధమైంది. ఆశ్వయుజ మాసం ప్రారంభం సోమవారం 22 వ తేదీన ఘట స్థాపనతో దేవి శరన్నవరాత్రులు మొదలై, అక్టోబర్ 2 గురువారం విజయ దశమి వేడుకలతో ముగుస్తాయి.ఈ సమయంలో తొమ్మిది రోజులు దుర్గాదేవి అవతారాలను శక్తి, జ్ఞానానికి సంబంధించిన దేవతగా పూజిస్తారు.
భారీ బందోబస్తు
ఇంద్రకీలాద్రి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు భారీ ఎత్తున చేస్తున్నట్లు సీపీ రాజశేఖర్ బాబు తెలిపారు. ఆపరేషన్ కమాండ్ కంట్రోల్ రూం ద్వారా పర్యవేక్షణ చేస్తున్నట్లు వివరించారు. అన్ని శాఖల సమన్వయంతో భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. 10లక్షల మంది భక్తులు ఈసారి దసరా ఉత్సవాలకు వస్తారని అంచనా వేస్తున్నామని..అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అమ్మవారి దర్శనంలో సామాన్య భక్తులకు పెద్ద పీట వేస్తామని,వీఐపీ దర్శనాలకు ప్రత్యేక టైమింగ్ స్లాట్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఆలయంలో డ్రెస్ కోడ్ అమలు అవుతుందని భక్తులకు గుర్తు చేశారు.
పోలీసులకు బందోబస్తు విధులు ‘ఈ-డిప్లాయ్‌మెంట్’ యాప్ ద్వారా కేటాయిస్తున్నామని.. 4,500 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాం అని తెలిపారు. ప్రత్యేకంగా ఏఐ కెమెరాలు, డ్రోన్లను వినియోగిస్తున్నామని తెలిపారు. విజయవాడ నగరం మొత్తం 12 వేల సీసీ కెమెరాలతో, 15 డ్రోన్లతో పర్యవేక్షణ జరుగుతుందని వివరించారు. ఆయా దృశ్యాలు చూసేందుకు 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్ సిద్ధం చేశామన్నారు.
విజయవాడ దుర్గమ్మ దసరా- 2025 ఉత్సవాలు..అమ్మవారి అలంకారాల వివరాలు
సెప్టెంబర్ 22 : సోమవారం, ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి: శ్రీ బాలా త్రిపురసుందరీ దేవి అలంకారం
సెప్టెంబర్ 23 : మంగళవారం, ఆశ్వయుజ శుద్ధ విదియ : శ్రీ గాయత్రీ దేవి అలంకారం
సెప్టెంబర్ 24 : బుధవారం, ఆశ్వయుజ శుద్ధ తదియ : శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం
సెప్టెంబర్ 25 : గురువారం, ఆశ్వయుజ శుద్ధ తదియ/ చవితి : శ్రీ కాత్యాయని దేవి అలంకారం
సెప్టెంబర్ 26 : శుక్రవారం, ఆశ్వయుజ శుద్ధ చవితి/ పంచమి: శ్రీ మహాలక్ష్మి దేవి అలంకారం
సెప్టెంబర్ 27 : శనివారం, ఆశ్వయుజ శుద్ధ పంచమి/ షష్ఠి : శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకారం
సెప్టెంబర్ 28 : ఆదివారం, ఆశ్వయుజ శుద్ధ షష్టి / సప్తమి : శ్రీ మహాచండి దేవి అలంకారం
సెప్టెంబర్ 29 : సోమవారం, ఆశ్వయుజ శుద్ధ సప్తమి / అష్టమి : మూలా నక్షత్రం శ్రీ సరస్వతి దేవి అలంకారం
సెప్టెంబర్ 30 : మంగళవారం, ఆశ్వయుజ శుద్ధ అష్టమి / నవమి : దుర్గాష్టమి, శ్రీ కనక దుర్గాదేవి అలంకారం
అక్టోబర్ 1 : బుధవారం, ఆశ్వయుజ శుద్ధ నవమి / దశమి : మహర్నవమి, శ్రీ మహిషాసుర మర్దిని అలంకారం
అక్టోబర్ 2 : గురువారం, ఆశ్వయుజ శుద్ధ దశమి విజయదశమి, శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారం
తెప్పోత్సవం: అక్టోబర్ 2న ఉదయం 9:30కి పూర్ణాహుతితో దసరా ఉత్సవాలు ముగుస్తాయి. అదే రోజు సాయంత్రం 5 గంటలకు కృష్ణా నదిలో హంస వాహనం, తెప్పోత్సవం నిర్వహించనున్నారు.