Akhil Mishra
- ఇంట్లోని బాల్కాని నుంచి కింద పడి దుర్మరణం
- సినిమాలతోపాటు టెలివిజన్ షోలలో ప్రఖ్యాతి
- మిశ్రా సతీమణి జర్మన్ నటి సుజాన్నే బెర్నర్
- బాలీవుడ్ సినీ పరిశ్రమలో మరో విషాదం
విధాత: బాలీవుడ్ నటుడు, త్రీ ఇడియట్స్, ఉత్తరణ్ సినిమాల ఫేమ్ అఖిల్ మిశ్రా (58) ఇక లేరు. ముంబైలోని తన ఇంట్లో ప్రమాదశాత్తు చనిపోయారు. గురువారం ఉదయం ఇంట్లోని బాల్కనీలో స్టూల్ వేసుకొని ఏదో పని చేస్తుండగా అది జారి కిందపడ్డారు. తలకు బలమైన గాయం కావడంతో రక్తశ్రావమ వడంతో హుటాహుటిన సమీప దవాఖానకు తరలించారు. వైద్యులు చికిత్స అందించినప్పటికీ ప్రాణాలు దక్కలేదు.
ఈ ఘటన జరిగినప్పుడు ఆయన భార్య, జర్మన్ నటి సుజాన్నే బెర్నర్ హైదరాబాద్‌లో షూటింగ్‌లో ఉన్నారు. భర్త మృతి విషయం తెలియగానే షాక్ గురయ్యారు. ‘నా గుండె పగిలింది.. నా సగభాగం వెళ్లిపోయింది’ అని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. హుటాహుటిన ముంబై బయలుదేరారు. అఖిల్ మిశ్రా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు.
త్రీ ఇడియట్స్ సినిమాలో లైబ్రేరియన్ దుబే పాత్రలో ప్రేక్షకులను మెప్పించారు. అఖిల్ మిశ్రా పలు సినిమాలతో పాటు టెలివిజన్ కార్యక్రమాల్లోనూ నటించారు. ఉత్తరాన్, ఉడాన్, సీఐడీ, శ్రీమాన్ శ్రీమతి, హతీమ్‌వంటి సినిమాలతోపాటు ప్రముఖ టెలివిజన్ షోలలో కూడా నటించారు. డాన్, గాంధీ, మై ఫాదర్, శిఖర్, కమ్లా కీ మౌత్, వెల్ డన్ అబ్బా వంటి చిత్రాలలో మిశ్రా కనిపించారు.
తన మొదటి ఫీచర్ ఫిలీంలో కలిసి పనిచేసిన మంజూ మిశ్రాను 1983లో అఖిల్ వివాహం చేసుకున్నారు. ఆమె 1996లో చనిపోయారు. ఆ తర్వాత జర్మన్ నటి సుజాన్నే బెర్నర్‌ను 2009 ఫిబ్రవరిలో పెండ్లి చేసుకున్నారు. క్రామ్, మేరా దిల్ దియానా వంటి షోలలో సుజాన్నే నటించారు.