పెద్దపులితో అడవిదున్న యుద్ధం.. చివరి క్షణంలో అది జరిగి ఉండకపోతే!

ఆహారం దొరికితే వదలక పోవడం పులి నైజం! కానీ.. పులి నుంచి రక్షించుకోవడం సాధుజంతువుల రీతి! ఈ రీతి, నైజాల మధ్య పోరాటమే జీవజాతుల మనుగడకు ఆధారం! అడవిలో మనకు కనిపించకుండా ఈ మనుగడ పోరాటం సాగుతూ ఉంటుంది

  • Publish Date - April 17, 2024 / 04:19 PM IST

ఆహారం దొరికితే వదలక పోవడం పులి నైజం! కానీ.. పులి నుంచి రక్షించుకోవడం సాధుజంతువుల రీతి! ఈ రీతి, నైజాల మధ్య పోరాటమే జీవజాతుల మనుగడకు ఆధారం! అడవిలో మనకు కనిపించకుండా ఈ మనుగడ పోరాటం సాగుతూ ఉంటుంది. అప్పుడప్పుడు కొందరు ఔత్సాహికులు అడవి జంతువుల మధ్య యుద్ధాలను కెమెరాల్లో బంధించి.. ప్రపంచానికి చూపుతుంటారు. అటువంటిదే ఈ వీడియో కూడా. ఒక అడవి దున్నపై ఒక పెద్దపులి దాడి చేసి.. ఇక దాన్ని చంపేస్తుందనుకున్న సమయంలో అనుకోని ఘటన ఆ దున్న ప్రాణాలు నిలిపింది!

ఆఖరిలో ట్విస్ట్‌ ఉన్న ఈ వీడియోను ఇండియన్‌ ఫారెస్ట్‌ అధికారి సుశాంత నంద ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. మనవాళ్లు కష్టాల్లో ఉంటే ఆదుకోవాలనే సందేశాన్ని సైతం ఈ వీడియో ఇస్తున్నది. అవసరానికి అదుకునేవాళ్లే స్నేహితులు అంటారు. ఇక వీడియో విషయానికి వస్తే.. ఒక పెద్దపులి ఒక అడవి దున్నపై దాడి చేసి, మెడను తన కోరలతో పట్టుకుంటుంది.

పులి పట్టు నుంచి విడిపించుకునేందుకు ఆ దున్న పెనుగులాడుతుంది. ధైర్యం కోల్పోకుండా ప్రయత్నిస్తూనే ఉంటుంది. కొద్దిసేపటికే మరో అడవి దున్న రంకెలు వేస్తూ దూసుకురావడంతో ఆ పెద్దపులి.. దున్నను వదిలి పారిపోతుంది. ఆద్యంత ఉత్కంఠభరితంగా ఉన్న ఈ వీడియోను పోస్ట్‌ చేసిన సుశాంత నందపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

ఈ వీడియోకు ఏ ఫ్రెండ్‌ ఇన్‌ నీడ్‌ అని క్యాప్షన్‌ పెట్టారు. దీనిని తడోబా నేషనల్‌ పార్క్‌లో కెమెరాలో బంధించారు. ఈ వీడియో వైరల్‌ అయింది. అనేక మంది వన్యప్రాణుల సామ్రాజ్యంలో స్నేహం గొప్పదనాన్ని, శక్తిని చాటుతున్నదని పేర్కొన్నారు.

అడవి దున్న శక్తిమంతమైన జంతువు. దాదాపు వెయ్యి కిలోల బరువు మోయగలవు. అడవి దున్నలను వేటాడటం పెద్దపులికి కూడా ఎంతో కష్టమైన టాస్క్‌. అంతేకాదు.. అడవి దున్నలు ఎంతటి సవాలు విసరగలవో కూడా ఈ వీడియోలో తెలుస్తున్నది. 900 నుంచి వెయ్యి కిలోల బరువు ఉండే అడవి దున్నలు ఎంతటి గట్టి సవాలు విసరగలవో అర్థమవుతున్నదని ఐఎఫ్‌ఎస్‌ అధికారి రమేశ్‌ పాండే ఇదే వీడియోను షేర్‌ చేస్తూ కామెంట్‌ చేశారు.

అంత శక్తిమంతమైన అడవి దున్నను వెంటాడటం పెద్ద టాస్కేనని పేర్కొన్నారు. ఈ రెండు జంతువుల మధ్య పోరాటం భీకరంగానూ, ప్రమాదకరంగానూ సాగిందని వ్యాఖ్యానించారు. కొన్నిసార్లు పెద్ద పులులు పరారవక తప్పదని పేర్కొన్నారు.

Latest News