Site icon vidhaatha

Adipurush | బాక్సాఫీస్ వ‌ద్ద చ‌తికిల‌ప‌డ్డ ఆదిపురుష్.. మొద‌టి సోమ‌వార‌మే డీలా..

Adipurush

విధాత‌: భారీ బ‌డ్జెట్‌తో రూపొందిన ఆదిపురుష్ (Adipurush) సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టిన‌ట్లు తెలుస్తోంది. ఓపెనింగ్ క‌లెక్ష‌న్ల‌తో దుమ్ము దులిపిన‌ప్ప‌టికీ వీకెండ్ త‌ర్వాత సోమ‌వారం థియేట‌ర్ల వైపు ఎవ‌రూ చూడ‌టం లేదు. వారాంతంతో పోలిస్తే క‌లెక్ష‌న్లు (Adipurush Collections) 75 శాతం కోసుకుపోవ‌డం గ‌మ‌నార్హం. నిర్మాతలు ఎంతో ఆశ పెట్టుకున్న హిందీ బెల్టులో సోమవారం రూ.8 నుంచి రూ.9 కోట్ల నెట్ వ‌సూలు చేసిన‌ట్లు బాక్సాఫీస్ ఇండియా క‌థ‌నం పేర్కొంది.

ఈ లెక్క‌న ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద కోలుకోవ‌డం క‌ష్ట‌మేన‌ని చెబుతున్నారు. మొత్త‌మ్మీద హిందీ ఆదిపురుష్ రూ.113 కోట్ల నెట్ వ‌సూలు చేసిన‌ట్లు స‌మాచారం. వారంతంలో ఖాళీగా ఉన్న జ‌నాలు త‌ప్పితే సినిమాని చూద్దాం అని వ‌చ్చే ప్రేక్ష‌కులు లేక‌పోవ‌డంతో ఈ సినిమా వ‌సూళ్ల ప‌రంగా ఫ్లాప్ అయ్యే అవ‌కాశాలున్నాయి. కార్తీక్ ఆర్య‌న్ భూల్ భుల‌యా 2 సాధించిన రూ.185 కోట్ల‌నూ ఈ చిత్రం వ‌సూలు చేయ‌లేద‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

బాలీవుడ్ ప‌రిశీల‌కుడు సాక్నిక్ తెలిపిన ప్ర‌కారం.. సోమ‌వారం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆదిపురుష్ వ‌సూళ్లు రూ.20 కోట్లు. అయితే వారంతంలో అన్ని భాష‌ల్లో క‌లిపి రూ.93 కోట్లు వ‌సూలు చేసింది. ప్రారంభ క‌లెక్ష‌న్ల‌లో ఆదిపురుష్.. షారుక్ ప‌ఠాన్ ఓపెనింగ్స్ (రూ.313 కోట్లు)ను బ‌ద్ద‌లు కొట్టినా.. లాంగ్ ర‌న్‌లో ప‌ఠాన్ రికార్డు రూ.1000 కోట్ల మార్కును అందుకోవ‌డం అసాధ్యం.

ప్రేక్ష‌కుల నెగ‌టివ్ టాక్ ఆదిపురుష్‌ను గ‌ట్టిగా దెబ్బ‌తీసింద‌ని ప్ర‌ముఖ సినిమా విశ్లేష‌కుడు త‌ర‌ణ్ ఆద‌ర్శ్ ట్వీట్ చేశాడు. నాసిర‌క‌మైన వీఎఫ్ఎక్స్‌, కారెక్ట‌ర్ డిజైనింగ్ లోపాలు కాంట్ర‌వ‌ర్సీల‌కు కార‌ణ‌మ‌య్యాయ‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు. ప్రేక్ష‌కుల విమ‌ర్శ‌ల‌కు భ‌య‌ప‌డి కొన్ని వివాదాస్ప‌ద సంభాష‌ణ‌ల‌ను మార్చిన‌ప్ప‌టికీ జ‌రగాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది.

సినిమా తీసిన విధానంపై వివిధ రాజ‌కీయ పార్టీలు, హిందుత్వ సంస్థ‌లు ద‌ర్శ‌కుడు ఓం రౌత్‌పై దుమ్మెత్తి పోస్తున్నాయి. కొంత‌మంది న‌టులు సైతం సినిమాపై త‌మ అసంతృప్తిని వెళ్ల‌గ‌క్కారు. తాను సినిమా మొత్తం మీద 4 వేల సంభాష‌ణ‌లు రాస్తే అందులో నాలుగు డైలాగ్స్ వివాదాస్పద‌కం కావ‌డం బాధాక‌ర‌మ‌ని మూడు సార్లు జాతీయ అవార్డు గ్ర‌హీత‌, ఆదిపురుష్ ర‌చ‌యిత ముంతాషిర్ వాపోవ‌డం విశేషం.

ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో రాఘ‌వ‌గా రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, జాన‌కి గా కృతిస‌న‌న్‌, రావ‌ణ్‌గా సైఫ్ ఆలీఖాన్ న‌టించారు. రూ.600 కోట్ల‌తో టీ సిరీస్ ఈ చిత్రాన్ని నిర్మించింది.

Exit mobile version