విధాత, హైదరాబాద్ : సినీ హీరో, నిర్మాత అక్కినేని నాగార్జున దంపతులు శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని కలిశారు. జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని అక్కినేని నాగార్జున, అమలలు కలిశారు. తమ కుమారుడు, హీరో అఖిల్ వివాహ వేడుకకు హాజరుకావాలని ఆహ్వాన పత్రాన్ని వారు సీఎం రేవంత్ రెడ్డికి అందించారు. అక్కినేని ఎన్ కన్వేన్షన్ ను హైడ్రా కూల్చడం..దీనిపై ప్రభుత్వ నిర్ణయాన్ని నాగార్జున హైకోర్టులో సవాల్ చేయడంతో రేవంత్ ప్రభుత్వంతో వివాదం మొదలైంది. అనంతరం బీఆర్ఎస్ నేత కేటీఆర్ ను విమర్శించే క్రమంలో మంత్రి కొండా సురేఖ అక్కినేని నాగ చైతన్య సమంత విడాకుల ఎపిసోడ్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
సురేఖ వ్యాఖ్యలతో పరువు నష్టం వాటల్లిందంటూ నాగార్జున కోర్టుకెక్కారు. ఆ వివాదాలతో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నాగార్జునకు మధ్య మరింత దూరం పెరిగింది. అయితే ఇటీవల మిస్ వరల్డ్ పోటీల్లో రేవంత్ రెడ్డితో కలిసి డిన్నర్ టేబుల్ షేర్ చేసుకోవడంతో వారి మధ్య సఖ్యత నెలకొందని అంతా భావించారు. ఇప్పుడు తమ కుమారుడి పెళ్లి వేడుకకు రావాలని సీఎం రేవంత్ రెడ్డిని నాగార్జున దంపతులు ఆహ్వానించడం విశేషం.