Amazon Forest
విధాత: పర్యావరణ విధ్వంసం మనం ఊహించిన దాని కన్నా ముందే ముంచుకు రావొచ్చని నూతన అధ్యయనం (Study) ఒకటి హెచ్చరించింది. వాతావరణ మార్పులను (Climate Changes) నియంత్రించడానికి తగిన చర్యలు కొరవడటంతో కేవలం 15 ఏళ్లలోనే భూమిపై కనివినీ ఎరగతి ప్రకృతి మార్పులు, విపత్తులు చోటుచేసుకోనున్నాయని తెలిపింది. సుమారు భూమిపై అయిదో వంతు ప్రాంతం భూ ఉష్ణోగ్రతల పెరుగుదల (Temperature Rising) కు బలి కావొచ్చని తెలిపింది.
ఆర్కిటిక్ మంచు కరిగిపోవడం, గ్రీన్‌ల్యాండ్ ఐస్ పలచబడటం, అమెజాన్ కీకారణ్యం (Amazon Forest) ఒక సవాన్నా గడ్డి భూమిగా మారిపోవడం వంటి ఘటనలు 2038కే జరిగిపోవచ్చని ఈ అధ్యయనం వెల్లడించింది. శాస్త్రవేత్తలు ఈ పరిస్థితినే టిప్పింగ్ పాయింట్ అని వ్యవహరిస్తారు. ఇక దీని తర్వాత మనం ఆ ప్రాంతంలో పరిస్థితిని మార్చడం సాధ్యం కాదు. ఉదాహరణకు ఒకసారి గానీ గ్రీన్‌ల్యాండ్ ఐస్‌షీట్ కరిగిపోతే.. భూ ఉత్తరార్థ గోళం హిమపాతం చాలా మేరకు తుడిచిపెట్టుకుపోయినట్టే.
నేచర్ జర్నల్ లో ప్రచురితమైన ఈ తాజా అధ్యయనం ఈ విపరీత మార్పులు ఎందుకు చోటు చేసుకుంటాయి? వాటిని ఎలా అడ్డుకోవాలనే విషయాలపై లోతైన పరిశోధన చేసింది. అయితే ఈ టిప్పింగ్ పాయింట్‌లపై పరిశోధన శైశవ దశలోనే ఉందని, కానీ తమకున్న అవగాహనతో పలు విషయాలు తెలుసుకున్నామని పరిశోధన బృంద నాయకుడు సైమన్ విల్‌కాక్ తెలిపారు.
పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు అమెజాన్, గ్రీన్ ల్యాండ్, ఆర్కిటిక్ (Arctic) వంటి ప్రాంతాల నమూనా లను కంప్యూటర్ సిమ్యులేషన్‌లో సృష్టించారు. అనంతరం భూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్లు సిమ్యులేష న్‌లోనూ పెంచి చూశారు. ఎక్కడైతే అక్కడి సాధారణ పరిస్థితులు అసాధారణంగా మారుతున్నాయో గమనించి నివేదికలో పొందు పరిచారు. ప్రకృతి పరంగా సున్నిత ప్రాంతాలు అన్నీ సగటున మరో 15 ఏళ్లలో టిప్పింగ్ పాయింట్‌కు చేరుకోనున్నాయని గుర్తించారు.
ఐక్యరాజ్య సమితికి చెందిన ఇంట్రా గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమాట్ ఛేంజ్ (ఐపీసీసీ) ఇటు వంటి అంచనాలు వేసినప్పటికీ వాటిని ఈ పరిశోధన తోసిపుచ్చింది. ఉదాహరణకు ఐపీసీసీ అమెజాన్ అడవి గడ్డిభూమిగా 2100 సంవత్సరం తర్వాత మారుతుందని పేర్కొంది. అయితే ఈ అంచనాల్లో ఐపీసీసీ కేవలం ఉష్ణోగ్రతల పెరుగుదలనే పరిగణనలోకి తీసుకుందని, ఇతర అంశాలను నిర్లక్ష్యం చేసిందని సైమన్ వెల్లడించారు.
అమెజాన్‌నే ఉదాహరణగా తీసుకుంటే అది కేవలం ఉష్ణోగ్రత పెరగడం వల్లే నష్టపోవట్లేదు. మృత్తికా క్షయం, వర్షాభావం, అడవుల నరికివేత వంటి ప్రమాదాలు దానికి పొంచి ఉన్నాయి. తాము ఇలాంటి అంశాలనూ పరిగణనలోకి తీసుకుని అధ్యయనం చేశామని కాబట్టి ఫలితాలు మరింత స్పష్టంగా వచ్చాయని ఆయన అభిప్రాయపడ్డారు.