Site icon vidhaatha

అంకిత్ సెక్సేనా హత్య కేసులో ముగ్గురు దోషులకు జీవిత ఖైదు

న్యూఢిల్లీ : 2018లో జరిగిన అంకిత్ సక్సేనా హత్య కేసులో తీస్ హజారీ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసుకు సంబంధించిన ముగ్గురు దోషులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. మహమ్మద్ సలీం, అక్బర్ అలీ, అతని భార్య షహనాజ్ బేగంలకు కోర్టు శిక్ష విధించింది. దీంతోబాటు ముగ్గురు నిందితులకు రూ.50,000 చొప్పున జరిమానా కూడా విధించింది. ఈ కేసుపై తీర్పును వెలువరిస్తూ.. దోషుల వయస్సు, నేర చరిత్రను పరిగణలోకి తీసుకొని వారికి మరణశిక్ష విధించడం లేదని కోర్టు పేర్కొంది. ముగ్గురు దోషులకు విధించిన జరిమానా మొత్తాన్ని అంకిత్‌ సక్సేనా కుటుంబానికి ఇవ్వనున్నారు.

2018 ఫిబ్రవరి 1న అంకిత్ చివరిసారిగా తన ప్రియురాలితో ఫోన్‌లో మాట్లాడాడు. వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీనితో రాత్రి 8:30 గంటల సమయంలో అంకిత్‌ను కలవడానికి వెళ్ళింది. తన తల్లిదండ్రులను ఇంట్లో ఉంచి తాళం వేసి అంకిత్‌ను పెళ్లి చేసుకుంటానని చెప్పి వెళ్ళింది. అంకిత్ తన ప్రియురాలిని ఠాగూర్ గార్డెన్ మెట్రో స్టేషన్‌లో కలవాల్సి ఉండగా, నిర్ణీత సమయానికి అక్కడికి చేరుకోలేక పోయాడు.

ఇదిలా ఉంటే బాలిక తల్లిదండ్రులు ఇరుగుపొరుగు వారి సహాయంతో ఇంటి తలుపులు తెరిచారు. ఆ తర్వాత వారు అంకిత్ ఇంటికి వెళుతుండగా మార్గమధ్యలో అంకిత్ ఎవరితోనో మాట్లాడుతున్నట్లు గుర్తించి యువతి తల్లిదండ్రులు అంకిత్‌పై దాడి చేశారు. ఈ విషయాన్ని స్థానికులు అంకిత్‌ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే అంకిత్ కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకొని గొడవ ఆపేందుకు ప్రయత్నించగా వారిపై కూడా దాడి చేశారు. అంకిత్ తల్లిని కొడుతుండగా ఆపేందుకు ప్రయత్నించగా, అమ్మాయి తండ్రి అంకిత్ మెడపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో అంకిత్ అక్కడికక్కడే మృతి చెందాడు.

Exit mobile version