Site icon vidhaatha

Assembly | వనమానా? జలగమా? సభకు హాజరయ్యేది ఎవరు?

Assembly |

విధాత: అసెంబ్లీ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం అవుతున్న నేపథ్యంలో కొత్తగూడెం నియోజకవర్గం నుంచి సభకు వనమా వెంకటేశ్వర రావు హాజరవుతారా? లేక జలగం వెంకట్రావు హాజరవుతారా? అన్న విషయంలో ఆసక్తికర చర్చ నడుస్తున్నది.

వనమా వెంకటేశ్వరరావు కాంగ్రెస్ అభ్యర్థిగా కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఆరెస్‌ అభ్యర్థి జలగం వెంకట్రావుపై గెలిచారు. ఆ తరువాత వనమా అధికార బీఆరెస్‌లో చేరారు. అయితే అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారని వనమాపై జలగం హైకోర్టులో కేసు వేశారు.

కేసును సుదీర్ఘంగా విచారించిన న్యాయస్థానం.. వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదని తీర్పు ఇచ్చింది. తీర్పుపై నెల రోజుల్లో సుప్రీం కోర్టులో అప్పీల్‌ చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. అయితే తీర్పు అమలును నిలిపి వేయాలని వనమా రివ్యూ పిటిషన్‌ వేయగా హైకోర్టు తిరస్కరించింది. దీంతో హైకోర్టు తీర్పును అమలు చేయాలని కోరుతూ జలగం వెంకట్రావు తీర్పు కాపీని ఎన్నికల కమిషన్‌ను, అసెంబ్లీ సెక్రటరీకి అందజేశారు.

వనమా ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు ఇచ్చిన మరుసటి రోజే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌ రాజ్‌ కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియజేశారు. ఈ మేరకు తీర్పు కాపీని కూడా పంపించారు. హైకోర్టు తీర్పు వచ్చి నాలుగైదు రోజులు అవుతున్నా ఇప్పటి వరకు అసెంబ్లీకి అధికారిక కాపీ అందలేదు.

దీంతో వనమా వెంకటేశ్వరరావుకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న సందిగ్ధంలో అసెంబ్లీ స్పీకర్‌, అధికారులు ఉన్నట్లు తెలుస్తున్నది. వాస్తవంగా హైకోర్టు తీర్పు కాపీ అధికారికంగా స్పీకర్‌కు చేరిన తర్వాత స్పీకర్‌ నోటిఫికేషన్‌ జారీ చేస్తారు. దానిని ఎన్నికల సంఘానికి పంపిస్తారు. ఎన్నికల సంఘం గెజిట్‌ విడుదల చేస్తుంది.

ఏపీలో ఏమి జరిగిందంటే..

ఆంధ్ర ప్రదేశ్‌లో 2014 అసెంబ్లీ ఎన్నికల్లో అనంతపురం జిల్లా మడకశిర నుంచి టీడీపీ అభ్యర్థిగా కే ఈరన్న 14,712 పైచిలుకు ఓట్లతో సమీప వైసీపీ అభ్యర్థి తిప్పేస్వామిపై గెలిచారు. అయితే గెలిచిన అభ్యర్థి ఈరన్న ఎన్నికల అఫిడవిట్‌లో తన భార్య అంగన్‌వాడీ టీచర్‌ అనే విషయాన్ని తెలియజేయలేదు. దీనిపై తిప్పేస్వామి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే ఈరన్న ఎన్నిక చెల్లదని తెలిపింది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం వైసీపీ అభ్యర్థి తిప్పేస్వామిని ఎమ్మెల్యేగా నిర్ణయిస్తూ గెజిట్‌ విడుదల చేసింది. దీనిని అసెంబ్లీ అమలు చేసింది.

Exit mobile version