Karnataka | విధాత: ఆమెకు ఆడపిల్లలంటే మహాఇష్టం. తనకు కచ్చితంగా అమ్మాయే పుడుతుందని ఆమె కలలు కన్నది. కానీ ఆ మహిళ మగ శిశువుకు జన్మనిచ్చింది. తాను కన్న కలలు ఆవిరయ్యాయనే ఆవేదనతో 11 రోజుల పసి బాలుడిని చంపేసింది తల్లి. ఈ దారుణ ఘటన కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలోని సుబ్రమణ్య పోలీసు స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది.
కూత్కుంజు గ్రామానికి చెందిన పవిత్ర నాలుగేండ్ల క్రితం బెంగళూరు వాసిని పెళ్లాడింది. కానీ వారు కొన్నాళ్లకే విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలో ఏడాది క్రితం ప్రకాశ్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. రెండు నెలల పాటు భర్తే వద్దే పవిత్ర ఉన్నది. ఆ తర్వాత ఆమె అనారోగ్యానికి గురైంది. దీంతో పుట్టింటికి వచ్చింది.
గర్భం దాల్చినట్లు తెలియడంతో.. ఆమె తనకు ఆడబిడ్డే పుట్టాలని కలలు కన్నది. తనకు కచ్చితంగా అమ్మాయే పుడుతుందని గంపెడు ఆశలు పెట్టుకున్నది. అయితే అక్టోబర్ 19వ తేదీన పురిటినొప్పులు రావడంతో ఆస్పత్రికి తరలించారు. పవిత్ర కల కన్నట్టు ఆడబిడ్డకు జన్మనివ్వలేదు. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక ఇంటికి చేరుకున్న పవిత్ర.. ఆ అబ్బాయికి పాలు కూడా సరిగా ఇవ్వలేదు.
తనకు అబ్బాయి ఇష్టం లేదని తన వదినతో చెప్పింది. ఇక 11 రోజుల పసికందును ఇంటి ముందున్న బావిలో పవిత్ర పడేసింది. ఆ తర్వాత ఇంట్లోకి పరుగెత్తుకొచ్చి తన భర్తకు విషయాన్ని చేరవేసింది. హుటాహుటిన ప్రకాశ్ బావి వద్దకు వెళ్లి, పసికందును తీసుకొని ఆస్పత్రికి వెళ్లాడు. కానీ అప్పటికే బాబు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.