Vaishnavi Chaitanya |
మన పక్కింటి పిల్లలా, చుట్టాలమ్మాయిలా కనిపించే వైష్ణవి చైతన్య.. తన కెరీర్‌ని చాలా కష్టపడి నిలబెట్టుకుంది. ఆమె నెమ్మదిగా ఒక్కోమెట్టూ ఎక్కుతూ ఇప్పుడు ఓవర్ నైట్‌లో సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ స్థాయికి వెళ్లిపోయింది. ఒక తెలుగు అమ్మాయి బోల్డ్ రోల్ చేయడం గురించి, ఆమె నటన గురించి ఇండస్ట్రీలో మారు మోగిపోయింది. ఈ ట్రైయాంగిల్ స్టోరీకి వైష్ణవి నటన ఊతంగా నిలిచింది. దర్శకుడు సాయి రాజేష్ తెరకెక్కించిన ‘బేబీ’ మూవీలో ఆనంద్ దేవరకొండ, విరాజ్ లు హీరోలుగా నటించారు.
అయితే హీరోయిన్‌గా నటించిన వైష్టవి ఈ ఇద్దరు హీరోల స్థానాన్ని దాటి నటనలో మంచి మార్కులు కొట్టేసింది. ‘బేబీ’ దాదాపు రూ. 80 కోట్లను కొల్లగొట్టింది. ఇప్పుడీ హిట్ హీరోయిన్‌కి వరుస ఆఫర్స్ వచ్చి పడుతున్నాయి. ఇప్పటికే వైష్ణవి అల్లు శిరీష్‌తో ఒక సినిమాలో చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
అయితే మరో మూడు సినిమా ఆఫర్స్ కూడా ఆమెకు సిద్ధంగా ఉన్నాయట. సాయి రాజేష్ కూడా ‘బేబీ’ సక్సెస్‌తో సంబంధం లేకుండానే.. మరో మూడు సినిమాల్లో అవకాశం ఇస్తానని ప్రామిస్ చేశాడట. ఇంకేముంది.. తంతే బూర్లె బుట్టలో పడ్డట్టయింది వైష్ణవి పని. అయితే విజయం అనేది అంత సులువుగా దక్కితే మనిషికి ఆ విజయం తాలూకూ కిక్ తెలీదు. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేని వైష్ణవి సినిమాల వైపు రావడానికి చాలా కష్టాలే పడింది.
ఇది ఒక్క రోజులో అందుకున్న విజయం కాదని ఆమె ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. చిన్నప్పటి నుంచే కష్టపడటం తెలిసిన వైష్ణవి.. పదోతరగతి నుంచే సంపాదన మొదలుపెట్టిందట. తనకు తెలిసిన డాన్స్ తోనే పెళ్ళిళ్ళు, బర్త్ డే ఫంక్షన్స్ లో డాన్స్ చేసేదట. అలా ఈవెంట్‌కి రూ. 700 వస్తే ఇంటి ఖర్చులకు ఇచ్చే దాన్నని చెప్పుకొచ్చింది వైష్ణవి.
ఇక బాత్ రూమ్‌లోనే కాస్ట్యూమ్స్ మార్చుకోవాల్సి వచ్చినప్పుడు వైష్ణవిని చూసి వాళ్ల అమ్మ చాలా బాధ పడేదట. ఇదంతా అవసరమా? యాక్టింగ్ అదీ వద్దు వెళ్లిపోదామని మాట్లాడినా వైష్ణవి ఇంకా కసిగా ఏదో సాధించాలనే తపనతో ఉండేదట. నీ వల్ల కాదు.. నువ్వు చేయలేవని వెనక్కు లాగినా కూడా ఆ మాటలను పట్టించుకోకుండా తను అనుకున్నది చేసి చూపించేదట వైష్ణవి. కొత్తగా అవకాశాలు వస్తున్న టైంలో ఓ హీరోయిన్‌ని తన కారవాన్ వాష్ రూమ్ కోసం వాడుకోవచ్చా అని అడిగినప్పుడు ఆమె చాలా కోప్పడిందట.
ఈ సంఘటనలన్నీ వైష్ణవిలో ఏదైనా సాధించాలనే కసిని పెంచాయట. ఆ కసే ఇప్పుడు ఇంతటి విజయాన్ని అందుకునేలా చేసిందని, తెలుగు పిల్ల ఇలా బోల్డ్ రోల్ చేయడంపై ఏమైనా విమర్శలు వస్తాయేమోనని సాయి రాజేష్ ఆలోచించిన సందర్భంలో కూడా వైష్ణవి తెగువతో ముందడుగు వేసానని చెప్పుకొచ్చింది. ఇదే పట్టుదలతో కెరీర్ ఫ్లాన్ చేసుకుంటే వైష్ణవి స్టార్ హీరోలందరి సరసనా హీరోయిన్‌గా చేసే అవకాశం అయితే ఉందని ఆమె ఇంటర్వ్యూ విన్నవారంతా అనుకుంటుండటం విశేషం.