కట్టుబడతారా? కట్టు తప్పుతారా? కాంగ్రెస్‌లో హిస్సా కుర్సీకా!

ఆలు లేదు.. చూలు లేదు కొడుకు పేరు సోమలింగం.. అని సామెత! ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలతో అధికార పీఠం కాంగ్రెస్‌దేనని సంకేతాలు రావడంతో.. ఆ పీఠంలో ఎవరు కూర్చోవాలన్న అంశంలో కాంగ్రెస్‌లో పీటముడే పడే అవకాశాలు కనిపిస్తున్నాయి

  • Publish Date - December 2, 2023 / 10:42 AM IST

  • అసలు ఫలితాలు ఇంకా రానేలేదు..
  • సీఎం పీఠంపై అప్పుడే మొదలైన పోరు
  • తెరపైకి అసలు కాంగ్రెస్‌, టీడీపీ కాంగ్రెస్‌!
  • తమకు కాదంటే రేవంత్‌కూ దక్కొద్దు!
  • రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కాకుండా
  • అడ్డుకునేందుకు సీనియర్ల వ్యూహాలు!
  • ఆజ్యం పోస్తున్న బక్క జడ్సన్ వ్యాఖ్యలు


విధాత: ఆలు లేదు.. చూలు లేదు కొడుకు పేరు సోమలింగం.. అని సామెత! ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలతో అధికార పీఠం కాంగ్రెస్‌దేనని సంకేతాలు రావడంతో.. ఆ పీఠంలో ఎవరు కూర్చోవాలన్న అంశంలో కాంగ్రెస్‌లో పీటముడే పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ ఢిల్లీ హైకమాండ్ వద్ద పలుకుబడి ఉన్న నాయకులు.. సీఎం అభ్యర్థి రేసులో తమ పేరు ఉండేలా, తమకు పోటీగా ఉన్న ప్రత్యర్థులను దెబ్బతీసే వ్యూహాలు రచించే పనిలో ఉన్నారని తెలుస్తున్నది.


ఎగ్జిట్‌పోల్స్‌ వాస్తవ రూపం దాల్చి.. కాంగ్రెస్‌కు మంచి మెజార్టీ వస్తే.. సహజంగానే అందరి చూపూ రేవంత్‌రెడ్డిపైనే ఉంటుంది. దానిని మళ్లించే వ్యూహాలు తెరపైకి వస్తున్నాయని జరుగుతున్న పరిణామాలు సంకేతాలనిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్‌లో పాత నేతలు, కొత్త నేతలు అన్న చీలిక వచ్చేసిందని తెలుస్తున్నది.


ఇందులో కొత్తగా కాంగ్రెస్‌లోకి వచ్చిన రేవంత్‌రెడ్డిని సీనియర్‌ నేతలు టార్గెట్‌ చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో అన్నీ తానై తిరిగినా.. కేసీఆర్‌ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్ర, కర్ణాటకలో విజయం, ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలతో ప్రజలు మార్పు కోరుకున్నారని, కానీ.. ఈ విజయాన్ని తన కష్టానికి ప్రతిఫలంగా చెప్పుకొని రేవంత్‌ సీఎం సీటును ఆశిస్తే ఊరుకునేది లేదని అంటున్నారు.


తెలుగు కాంగ్రెస్ వర్సెస్ అసలు కాంగ్రెస్‌


తెలుగు దేశం నుంచి వలసలు వచ్చిన రేవంత్ రెడ్డితో పాటు ఆయన మద్దతుదారులు కాంగ్రెస్‌లో రేవంత్ సీఎం కావాలంటూ కోరుకుంటున్నారు. ఇదే సమయంలో ఇన్నాళ్లుగా పార్టీని అంటిపెట్టుకుని, రేవంత్ వంటి వలస నేత, జూనియర్ సారథ్యంలో కూడా పార్టీ విజయం కోసం పనిచేశామని, సీఎంగా తమకే అవకాశం ఇవ్వాలంటూ సీనియర్లు అధిష్టానాన్ని ఒత్తిడి చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.


సీఎం అభ్యర్థులు డజన్‌


సీఎం కేసీఆర్‌ అన్నట్టు కాంగ్రెస్‌లో డజన్‌కుపైగానే ముఖ్యమంత్రి అభ్యర్థులు కనిపిస్తున్నారు. రేవంత్‌రెడ్డితోపాటు.. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, దామోదరం రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తూర్పు జగ్గారెడ్డి, డీ శ్రీధర్‌బాబు, టీ జీవన్‌రెడ్డి, సీతక్క వంటి వారి పేర్లు ముందు నుంచీ ప్రచారంలో ఉన్నాయి. వీరంతా రేవంత్‌రెడ్డికి అవకాశం ఇవ్వకుండా తమ ప్రయత్నాలు తాము చేసే అవకాశం ఉన్నదని అంటున్నారు. రేవంత్‌పై ఓటు నోటు కేసు, ఆయన ఆరెస్సెస్‌ బ్యాక్‌గ్రౌండ్‌ ముందుకు తెస్తారని సమాచారం.


రేవంత్‌కు అడ్డుగా దళిత సీఎం


సీఎం పీఠంపై కన్నేసిన సీనియర్లు పార్టీ అధిష్ఠానం తమకు అవకాశం ఇవ్వకపోయినా.. రేవంత్‌కు దక్కకూడదన్న వ్యూహంతో ఉన్నారని తెలుస్తున్నది. ఇందులో భాగంగా సీఎల్పీ నేత భట్టిని ముందుపెట్టి ఇప్పటికే దళిత సీఎం నినాదాన్ని తెరపైకి తెచ్చారు. భట్టి సైతం రాహుల్ జోడో యాత్రకు మద్దతుగా రేవంత్ నిర్వహించిన పాదయాత్రకు పోటీగా పీపుల్స్‌మార్చ్ పేరుతో ఇందిరమ్మ రాజ్యం అంటూ పాదయాత్రలో రేసులో ముందుకొచ్చారు.


కౌంటర్‌గా రేవంత్ తన వర్గీయురాలైన సీతక్క ఆదివాసీ మహిళగా సీఎం కావచ్చంటూ అమెరికాలో వ్యాఖ్యానించారు. ఇక పిట్ట పోరు పిట్టపోరు పిల్లి తీర్చేనన్నట్లుగా అందరివాడైన తనను సీఎం చేస్తారని జానారెడ్డి ఆశలు పెట్టుకున్నారు. కాంగ్రెస్‌కు మెజార్టీ రావడంలో ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాలు కీలకమైతే మాత్రం ఆ జిల్లా నాయకులు సీఎం రేసులో గట్టిగానే పోరాడేందుకు సిద్ధమవుతారని అంటున్నారు.


జడ్సన్ సీనియర్లు వేసిన పాచికేనా…


ఫలితాలు కూడా వెలువడకముందే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై సీనియర్ కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ తీవ్ర ఆరోపణలు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. శుక్రవారం హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రేవంత్‌పై వివాదాస్పద, సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోరుతూ తాను ఇంతకాలం రేవంత్‌పై ఆరోపణలు చేయలేదని, పోలింగ్ ముగిసిపోయి, ప్రజాతీర్పు వెలువడేందుకు సిద్ధమైన నేపథ్యంలో రేవంత్ నిజస్వరూపాన్ని తెలంగాణ సమాజం ముందుంచుతున్నానని ఆయన చెప్పారు.


సీఎం కేసీఆర్ కుటుంబంతో రేవంత్‌కు 2010నుంచి ఉన్న వ్యాపార సంబంధాలు, లోపాయికారి సహకారాల ఘట్టాలను ఆయన ఈ సందర్భంగా వివరించారు. ఎవరి సహకారం, ప్రోద్బలం లేకుండా జడ్సన్‌ ఇలా మీడియా ముందుకు రారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాబోయే అసమ్మతికి ఇది తొలి సంకేతమని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Latest News