విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: బండి సంజయ్ బెయిల్,కస్టడీ పిటిషన్‌పై హనుమకొండ కోర్టులో గురువారం వాదనలు ముగిశాయి. ఇరువర్గాల వాదనలు విన్న మెజిస్ట్రేట్ బెయిల్ పిటిషన్‌పై తన నిర్ణయాన్ని రాత్రి 9 గంటల వరకు ఇంకా ప్రకటించలేదు. జడ్జి తీర్పు కోసం బిజెపి వర్గాలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాయి.
బండి సంజయ్ తరఫున బిజెపి లీగల్ టీం ప్రతినిధులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గురువారం తీర్పు ప్రకటించకుంటే కేసును డిస్మిస్ చేయాలని కోరినట్లు బిజెపి లీగల్ టీం వర్గాలు చెబుతున్నాయి. తీర్పు పెండింగ్లో ఉంటే హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేసుకునే అవకాశం లేకుండా పోతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జడ్జి గురువారం రాత్రి తీర్పు ప్రకటిస్తారా లేదా వేచి చూడాల్సిందే.
– నిన్న బెయిల్ పిటిషన్ దాఖలు నేడు విచారణ
మంగళవారం అర్ధరాత్రి బండి సంజయ్ ని కరీంనగర్లో అరెస్టు చేయగా బుధవారం రాత్రి హనుమకొండ కోర్టులో హాజరు పరిచారు. ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించగా, ఆయన తరపు లాయర్లు నిన్ననే కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. బుధవారం దీనిపై వాయిదా వేశారు. దీంతో బండి సంజయ్ తో పాటు నిందితులను కరీంనగర్ జైలుకు భారీ పోలీసు బందోబస్తు మధ్య తరలించారు.
ఇదిలా ఉండగా నిన్న దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై మెజిస్ట్రేట్ గురువారం విచారించారు. ఇరువర్గాలు తమతమ వాదనలు వినిపించారు. కోర్టు తీర్పుపై ఉదయం నుంచి ఉత్కంఠతో ఎదురు చూశారు. రాత్రి 9 గంటల వరకు కూడా ఇంకా తీర్పు ప్రకటించ లేదు.
బండిని కస్టడీ కోరిన పోలీసులు
బండి సంజయ్ బెయిల్ పిటిషన్ పై నిర్ణయాన్ని సోమవారానికి వాయిదా వేయాలని ప్రాసిక్యూషన్ విజ్ఞప్తి చేసింది. కాగా, బండి సంజయ్‌ను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. పిటిషన్ పై విచారణను సోమవారానికి వాయిదా వేసినట్లు చెబుతున్నారు. రాష్ట్రంలో టెన్త్ పరీక్షలు కొనసాగుతున్నాయని, బండి సంజయ్ కాల్ డేటా పూర్తిగా తీసుకోవాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు.
కొంతమంది నిందితులు పరారీలో ఉన్నారని, నిజాలు రాబట్టడానికి సాక్ష్యులను విచారించాల్సి ఉందన్నారు. సంజయ్‌కు బెయిల్ ఇస్తే లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తాయని పోలీసుల తరుపు ప్రాసిక్యూషన్ వాదనలు వినిపించింది. ఇరు వర్గాల వాదోపవాదాలు విన్న జడ్జి తన తీర్పును ప్రకటించారు.
బండి సంజయ్ తరఫున వాదనలు
బండి సంజయ్ తరుపున లాయర్లు వరంగల్ సిపి మాట మార్చారని నాలుగో తేదీ, ఐదో తేదీకి సంబంధించిన ఆయన ప్రెస్ మీట్ వీడియోలు జడ్జి ముందు ప్రదర్శించినట్లు సమాచారం. సంజయ్ పై కేసు పెట్టడంలో కుట్ర కోణం దాగి ఉందని ఆయన లాయర్లు వాదించారు. సంజయ్ ను మానసికంగా, శారీరకంగా పోలీసులు వేధించారని, ఆయన ఎంపీగా కూడా ఉన్నారనే విషయాన్నీ ఈ సందర్భంగా వివరించారు. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై సిబిఐ చేత విచారణ జరిపించాలని కోరారు.
రేపు తన అత్త దశదినకర్మ ఉందని, ఎల్లుండి రాష్ట్రంలో ప్రధాని పర్యటన ఉందని ఈ కారణంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ కి బెయిలు మంజూరి చేయాలని ఆయన తరపు లాయర్లు వాదించారు. అవసరమైతే కండిషన్ బెయిలు ఇచ్చిన దానికి తాము సిద్ధమంటూ సంసిద్ధత వ్యక్తం చేశారు. ఇవన్నీ విన్న జడ్జి తుది తీర్పును రాత్రి 9 గంటల వరకు ప్రకటించలేదు. రాత్రి పొద్దుపోయిన తర్వాత తీర్పు వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు.