విధాత : చెంగిచెర్లలో గిరిజన మహిళలపై ఓ వర్గం దాడికి పాల్పడిన ఘటనపై బాధితులను పరామర్శించేందుకు ఎంపీ బండి సంజయ్ చేపట్టిన కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. ఘటన జరిగి 24 గంటలైనా, కాంగ్రెస్ ప్రభుత్వం కనీస స్పందన లేకపోవడాన్ని నిరసిస్తూ బాధిత గిరిజన మహిళలకు మద్దతుగా బీజేపీ చలో చెంగిచర్లకు పిలుపునిచ్చింది. అయితే పోలీసులు ఎక్కడిక్కడే బారికేడ్లు పెట్టి అడ్డుకోగా వందలాదిగా తరలివచ్చిన బీజేపీ శ్రేణులు బండి నాయకత్వంలో బారికేడ్లను తోసుకుని ముందుకెళ్లారు.
ఈ సందర్భంగా పోలీసులకు, బీజేపీ శ్రేణులకు మధ్య తోపులాట సాగింది. అనంతరం బండి సంజయ్ దాడిలో గాయపడిన వారి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. బండి సంజయ్ మాట్లాడుతూ బాధితులను పరమార్శించడంమే నేరం లాగా ఉందని, తమను రాకుండా అడ్డుకునేందుకు ఇందిరమ్మ రాజ్యం పోలీసులు ప్రయత్నించారని ఆరోపించారు. కాలనీ వాసుల పై దాడులకు పాల్పడిన వారికి శిక్ష పడే వరకు తన పోరాటం ఆగదని బాధితులకు బండి హామీ ఇచ్చారు.