Site icon vidhaatha

ఐపీఎల్‌కు కొత్త స్పాన్సర్‌..! టెండర్లు పిలిచిన బీసీసీఐ..!

IPL Title Sponsor | భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డ్‌ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL) వచ్చే సీజన్‌కు సంబంధించి టైటిల్‌ స్పాన్సర్‌ షిప్‌ కోసం టెండర్లను ఆహ్వానించింది. 2024 నుంచి 2028 సీజన్‌ వరకు కొత్త స్పాన్సర్‌ కోసం బీసీసీఐ బిడ్‌లను ఆహ్వానిస్తున్నది. టెండర్‌ వేయదలచుకున్న కంపెనీలు రూ.5లక్షలు దరఖాస్తు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.


అయితే, ఫీజు తిరిగి చెల్లించబడదని పేర్కొంది. నిర్ణీత ఫీజు రూ.5లక్షలు (దీనికి జీఎస్టీ అదనం) చెల్లించి దరఖాస్తులు పొందేందుకు జనవరి 8 వరకు గడువు ఇచ్చింది. దరఖాస్తును ఇన్విటేషన్ టు టెండర్ (ITT) డాక్యుమెంట్‌గా బీసీసీఐ పేర్కొంది. ఐటీటీ డాక్యుమెంట్‌లోనే నియమ నిబంధనలు, టెండరు ప్రక్రియ వివరాలు, అర్హత నియమావళి, బిడ్డింగ్ దాఖలు, హక్కులు, ఇతర వివరాలు అన్నీ ఉంటాయని బీసీసీఐ తెలిపింది.


కాగా, బిడ్డింగ్ ప్రక్రియను ఏ దశలోనైనా నిలుపుదల చేసేందుకు, సవరణలు చేసేందుకు తమకు పూర్తి హక్కులు ఉంటాయని బీసీసీఐ స్పష్టం చేసింది. గత సీజన్‌ వరకు ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌గా టాటా వ్యవహరించింది. ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌ ద్వారా టాటా గ్రూప్‌ నుంచి రూ.350 కోట్ల నుంచి రూ.400 కోట్ల వరకు ఆదాయం పొందినట్లు తెలుస్తున్నది. 2008లో ప్రారంభించిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ బీసీసీఐకి కాసులు కురిపిస్తున్నాయి.


అటు టైటిల్‌ స్పార్సర్‌షిప్‌తో పాటు ప్రసార హక్కులు, ఫ్రాంచైజీల నుంచి దండిగానే ఆదాయం వస్తున్నది. ఐపీఎల్‌ తొలి స్పార్సర్‌గా డీఎల్‌ఎఫ్‌ వ్యవహరించింది. 2008-2012 వరకు డీఎల్‌ఎఫ్‌ కొనసాగింది. ఆ తర్వాత 2013-15 పెప్సీ, 2016-17, 2018-19 వరకు వీవో, 2020లో డ్రీమ్‌-11, 2021 వీవో, 2022-23 వరకు టాటా గ్రూప్స్‌ టైటిల్‌ స్పాన్సర్‌గా వ్యవహరించాయి.

Exit mobile version