Site icon vidhaatha

TSPSC Paper Leakage: విద్యార్థుల నిరసనతో భ‌గ్గుమ‌న్న కాకతీయ.. VC భ‌వ‌నం ముట్ట‌డికి యత్నం

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతనిధి: టీఎస్‌పీఎస్సీ పేప‌ర్ లీకేజీ విష‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం తీరుపై విద్యార్థి నిరుద్యోగులు భ‌గ్గుమ‌న్నారు. కేయూ విద్యార్థి సంఘాల ఆధ్వ‌ర్యంలో వంద‌లాదిగా త‌ర‌లివ‌చ్చిన విద్యార్థుల‌తో కేయూ లైబ్ర‌రీ నుంచి రెండో గేట్ వ‌ర‌కు భారీ ర్యాలీ నిర్వ‌హించారు. అనంత‌రం వీసీ భ‌వ‌నం వ‌ర‌కు చేర‌కుని సుమారు గంట‌పాటు ధ‌ర్నా చేశారు. వీసీ బ‌య‌ట‌కు రావాలంటూ నినాదాలు చేశారు.

ఎంత‌సేప‌టికీ వీసీ స్పందించ‌క‌ పోవ‌డంతో విద్యార్థులు భ‌వ‌నం లోప‌లికి చొచ్చుకు పోయేందుకు య‌త్నించారు. విద్యార్థులు ఆగ్ర‌హంతో భ‌వ‌నం కిటికీ అద్దాలు, పూల కుండీల‌ను ధ్వంసం చేశారు. ఇద్ద‌రు విద్యార్థులు భ‌వ‌నంపైకి ఎక్కి నినాదాలు చేశారు. ఈ స‌మ‌యంలో పోలీసులు భారీ సంఖ్య‌లో అక్క‌డికి చేరుకుని విద్యార్థుల‌ను నిల‌వ‌రించే క్ర‌మంలో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. విద్యార్థుల‌ను బ‌ల‌వంతంగా అరెస్టు చేసి ధ‌ర్మ‌సాగ‌ర్ పోలీస్‌స్టేష‌న్‌కు త‌ర‌లించారు.

స‌భ‌కు అనుమ‌తివ్వ‌క‌పోవ‌డంతో ధర్నా

విద్యార్థి నిరుద్యోగుల భ‌రోసాకై బుధ‌వారం కేయూలో మ‌హాధ‌ర్నా నిర్వ‌హించారు. మొద‌ట మార్చి 24న కేయూలో విద్యార్థి ఉద్య‌మ‌కారుల సంఘ‌ర్ష‌ణ స‌భ నిర్వ‌హించాల‌ని జేఏసీ నిర్ణ‌యించింది. అయితే, కొన్ని అనివార్య కార‌ణాల వ‌ల్ల ఆ స‌భ‌ను మార్చి 29న‌ నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. ఈ స‌భ‌కు కేయూ వీసీ అనుమ‌తి ఇవ్వ‌క‌పోవ‌డంతో తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దీంతో బుధ‌వారం జేఏసీ ఆధ్వ‌ర్యంలో కేయూలో మ‌హాధ‌ర్నా నిర్వ‌హించారు. అనంతరం వీసీ భవనం ముట్టడికి యత్నించారు.

వీసీ తీరుపై తీవ్ర ఆగ్ర‌హం

స‌భ‌కు అనుమ‌తి ఇవ్వ‌క‌పోవ‌డంపై కేయూ విద్యార్థి సంఘాల జేఏసీ మండిప‌డింది. వీసీ తాటికొండ ర‌మేష్ తీరును నాయ‌కులు తీవ్రంగా ఖండించారు. శాంతియుతంగా ధర్నా చేస్తే నిర్బంధానికి గురిచేయ‌డం దుర్మార్గ‌మ‌ని నాయ‌కులు అన్నారు.

టీఎస్‌పీఎస్సీ క‌మిటీని రద్దు చేసి, చైర్మన్ ని సభ్యులను భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జిచే విచారణ చేప‌ట్టాల‌ని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు ఉచిత మెటీరియల్, శిక్షణ, భోజన వసతి కల్పించాలన్నారు. 30లక్షల నిరుద్యోగులకు ఒక్కో నిరుద్యోగికి 50వేల రూపాయలు అందిచాలన్నారు.

హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయం

ప్రభుత్వం, యూనివర్సిటీ అధికారులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, హైకోర్టును ఆశ్రయించి సభ నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కేయూ జేఏసీ చైర్మ‌న్ ఇట్టబోయిన తిరుపతి యాదవ్, పీడీఎస్‌యూ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఇడంపాక విజయ్ ఖ‌న్నా, గిరిజన శక్తి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గుగులోత్ రాజు నాయక్, టీజీవీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడ రంజిత్ కుమార్, పీడీఎస్‌యూ రాష్ట్ర కోశాధికారి మొగిలి వెంకట్ రెడ్డి , బీఎస్ఎఫ్ ఉమ్మ‌డి వ‌రంగ‌ల్‌ జిల్లా అధ్య‌క్షుడు కాడపాక రాజేందర్,

ఏబీఎస్ఎఫ్ ఉమ్మ‌డి జిల్లా అధ్యక్షుడు మంద నరేష్, ఎన్ఎస్‌యూఐ నాయ‌కుడు అలువాల కార్తీక్‌, బీఎస్ఎఫ్ కేయూ ఇన్‌చార్జి బొట్ల మనోహర్, ఎన్ఎస్‌యూఐ నాయ‌కుడు రాకేష్ కృష్ణనన్, బీసీ విద్యార్థి సంఘం కె.యూ ఇంచార్జి అరెగంటి నాగరాజు, పీడీఎస్‌యూ కేయూ ఇన్‌చార్జి కామగోని శ్రవణ్ కుమార్, బీఎస్ఎఫ్ కేయూ ఇన్‌చార్జి కళ్లెపెళ్లి ప్రశాంత్, జాక్ నేతలు కాశీనాథ్‌, రాచకొండ రంజిత్, రమేష్, మహేష్, అభిరామ్, సంపత్, అర్జున్, భగత్, స్వప్న, సంధ్య, రమ, జ్యోష్ణ‌, ప్రవళిక త‌దిత‌రులు పాల్గొన్నారు.

Exit mobile version