దేశానికి ప్రమాదకరంగా ఫాసిజం

మోడీ పాలనలో దేశానికి ప్రమాదకరంగా మారుతున్న మతోన్మాద ఫాసిజానికి వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ సి.హెచ్. దినేష్ కుమార్ పిలుపునిచ్చారు

  • Publish Date - April 14, 2024 / 09:00 PM IST

జార్జిరెడ్డి వర్ధంతిలో కేయూ రిటైర్డ్ ప్రొఫెసర్ దినేష్ కుమార్
– పిడిఎస్ యు ఆధ్వర్యంలో 52వ వర్ధంతి
– కేయూ లో మార్నింగ్ వాక్ “నివాళి”

విధాత, వరంగల్ ప్రతినిధి: మోడీ పాలనలో దేశానికి ప్రమాదకరంగా మారుతున్న మతోన్మాద ఫాసిజానికి వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ సి.హెచ్. దినేష్ కుమార్ పిలుపునిచ్చారు. విద్యార్థులతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఉద్యమించి, కులం, మతం, దోపిడీ ,పీడన ,అణిచివేత లేని సమానత్వ సమాజాన్ని స్థాపించుకోవాలని కోరారు. ఆదివారం కాకతీయ యూనివర్సిటీలో పి.డి.ఎస్.యు. వ్యవస్థాపకులు ఉస్మానియా అరుణతార కామ్రేడ్ జార్జిరెడ్డి 52వ వర్ధంతి సందర్భంగా కె.యు. మొదటి గేటు నుండి రెండవ గేటు వరకు మార్నింగ్ వాక్ నిర్వహించి అనంతరం జార్జిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ మార్నింగ్ వాక్ కార్యక్రమాన్ని దినేష్ కుమార్,ఎస్.డి.ఎల్.సి.ఇ. డైరెక్టర్ ఆచార్య వి. రామచంద్రం లు పి.డి.ఎస్.యు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రగతిశీల, విప్లవ,విద్యార్థి ఉద్యమాల స్ఫూర్తి ప్రధాత జార్జి రెడ్డి అని, 52 ఏళ్ల క్రితం తన మరణంతో నూతన చరిత్రను సృష్టించుకున్న పోరాట యోధుడని తెలిపారు. సమసమాజ స్థాపన, శాస్త్రీయ విద్యా సాధన కోసం జరుగుతున్న పోరాటాల్లో నిత్య స్పూర్తి ప్రధాతగా వెలుగొందుతున్నాడని గుర్తు చేశారు.

మోడీ ప్రభుత్వం దేశంలోని విద్యారంగాన్ని పూర్తిగా కాషాయీకరించే కుట్రలో భాగంగానే విద్యా నిపుణులను, మేధావులను సంప్రదించకుండ, చర్చించకుండా నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకువచ్చిందని అన్నారు. పాఠ్యపుస్తకాల్లో డార్విన్ పరిణామ సిద్ధాంతంతో పాటు సోషలిస్ట్, లౌకిక ,ప్రజాస్వామ్య అంశాలను తొలగిస్తూ విద్యార్థుల మెదళ్లను ఆశాస్త్రీయ భావాలతో నింపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది భవిష్యత్తులో భారత ప్రజల ఐక్యతకు ప్రమాదకరంగా మారే అవకాశం ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు ,కార్పొరేట్ పెట్టుబడిదారులకు అప్పజెప్పడం వలన దేశంలోని విద్యార్థి, యువతకు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతున్నాయని అన్నారు. విద్యార్థులు దేశంలో జరుగుతున్న పరిణామాలను, సామాజిక ఆర్థిక రాజకీయ రంగంలో వస్తున్న మార్పులను గుడ్డిగా విశ్వసించకుండా శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించాలని, ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.

దేశంలో ప్రజాస్వామ్య లక్షణాలు కలిగిన శాస్త్రీయ విద్యా విధానాన్ని సాధించుకోవడానికి జార్జి రెడ్డి స్ఫూర్తితో విద్యార్థి లోకం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్. యు. పూర్వ విద్యార్థులైన వరంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు తీగల జీవన్ కుమార్, టిపిటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కడారి భోగేశ్వర్, రాష్ట్ర నాయకులు అజయ్, మాజీ రాష్ట్ర కార్యదర్శి బండి కోటేశ్వరరావు, రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు నున్నా అప్పారావు, కేయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సాదు రాజేష్, డాక్టర్ ఎన్. వెంకటరమణ తోపాటు పి. డి.ఎస్.యు. ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి బి.నరసింహరావు, పి.డి.ఎస్.యు.ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి మొగిలి వెంకట్ రెడ్డి, పి.డి.ఎస్.యు. ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి భాష బోయిన వేణు రాజ్, నగర కార్యదర్శి రంజిత్, శివ, రవి, ప్రవీణ్,
కేయూ నాయకులు అభిరామ్ రమేష్, కాశినాథ్, మహేష్, గణేష్, అనూష,నవీన్, రాము ,వంశీ ,టింఫు ముషారఫ్ , పృథ్వి రాజ్, తదితరులు పాల్గొన్నారు.

Latest News