Bhola Shankar Review | భోళా శంకర్ సినిమా రివ్యూ.. ఆచార్య’ను మించెన్‌! ప్రేక్షకులను ముంచెన్‌

Bhola Shankar Review | మూవీ పేరు: ‘భోళా శంకర్’ విడుదల తేదీ: 11 ఆగస్ట్ 2023 నటీనటులు: చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్, తరుణ్ అరోరా, రవిశంకర్, శ్రీముఖి, రష్మీ , హైపర్ ఆది  సినిమాటోగ్రఫీ: డడ్లీ ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్ సంగీతం: మహతి స్వర సాగర్ నిర్మాత: రామబ్రహ్మం సుంకర, కె.ఎస్. రామారావు స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: మెహర్ రమేష్ మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు స్వస్తి చెప్పి.. మళ్లీ నటనపై దృష్టి పెట్టినప్పటి […]

  • Publish Date - August 11, 2023 / 03:10 PM IST

Bhola Shankar Review |

మూవీ పేరు: ‘భోళా శంకర్’
విడుదల తేదీ: 11 ఆగస్ట్ 2023
నటీనటులు: చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్, తరుణ్ అరోరా, రవిశంకర్, శ్రీముఖి, రష్మీ , హైపర్ ఆది
సినిమాటోగ్రఫీ: డడ్లీ
ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్
సంగీతం: మహతి స్వర సాగర్
నిర్మాత: రామబ్రహ్మం సుంకర, కె.ఎస్. రామారావు
స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: మెహర్ రమేష్

మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు స్వస్తి చెప్పి.. మళ్లీ నటనపై దృష్టి పెట్టినప్పటి నుంచి.. ఎప్పుడూ బిజీ బిజీగా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కుర్ర హీరోల మాదిరిగా షూటింగ్స్‌ చేస్తూ.. ఏడాదికి రెండు సినిమాలు విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. నిజంగా ఆ ఏజ్‌లో అలాంటి దూకుడుకి హ్యాట్సాఫ్ చెప్పొచ్చు. కాకపోతే.. ఆయన ఎన్నుకునే చిత్రాలే మరీ నాసిరకంగా, రొటీన్‌గా ఉంటూ వస్తున్నాయి.

ఒక సినిమా హిట్టయితే.. రెండు సినిమాలు యావరేజ్ అన్నట్లుగా చిరు రీ ఎంట్రీ నడుస్తోంది. కానీ ప్రతి సినిమాకు ఆయన పడే కష్టంలో మాత్రం మార్పు లేదు. సంక్రాంతికి వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’తో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుని.. తనలోని సత్తాని మరోసారి చాటిన మెగాస్టార్.. మళ్లీ 7 నెలల లోపే మరో సినిమాతో బాక్సాఫీస్‌ని పలకరించారు. ఆయన హీరోగా, స్టైలిష్ మేకర్ అని పేరున్న మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘భోళా శంకర్’.

ఎన్టీఆర్, వెంకీ వంటి వారితో సినిమాలు చేసిన మెహర్ రమేష్ గత 10 సంవత్సరాలుగా డైరెక్షన్‌కి దూరంగా ఉన్నారు. సరైన హిట్ లేని మెహర్ రమేష్‌కి అవకాశాలేవీ లేని సమయంలో చిరంజీవి పిలిచి మరీ ఈ అవకాశం ఇవ్వడం, అదీ కూడా రీమేక్ కావడంతో.. అంతా ఆశ్చర్యపోయారు. మెహర్ రమేష్‌ రీమేక్స్‌తో కన్నడలో మంచి హిట్స్ కొట్టాడు. తెలుగులో ఆయన ‘బిల్లా’ తప్పితే చెప్పుకోవడానికి సినిమా లేదు. అదీ కూడా రీమేకే. ఇప్పుడు అజిత్ కుమార్ హీరోగా చేసిన తమిళ చిత్రం ‘వేదాళం’ రీమేక్ మెహర్ రమేష్ చేతిలో పెట్టడంతో.. మెగా ఫ్యాన్స్ అందరూ.. రీమేక్ కాబట్టి.. హిట్టు పక్కా అని అనుకున్నారు.

మరోవైపు చిత్ర ప్రమోషనల్ కంటెంట్ టీజర్, పాటలు, ట్రైలర్ కూడా సినిమాపై కాస్త క్రేజ్ పెంచాయి. అందులో సూపర్ స్టార్ రజనీకాంత్ బరిలో ఉన్నా కూడా.. మరో ఆలోచన చేయకుండా థియేటర్లలో దిగిపోవడానికి సిద్ధమవడంతో.. సినిమాలో మ్యాటర్ ఉండే ఉంటుందని అంతా అంచనాలు పెంచే సుకున్నారు. మరి ఆ అంచనాలను ఈ సినిమా అందుకుందా? అసలు ‘భోళా’లో మ్యాటర్ ఉందా?.. ఉంటే దానిని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారనేది మన రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

ఇది ఆల్రెడీ తమిళంలో వచ్చిన ‘వేదాళం’ సినిమానే కాబట్టి.. కొన్ని కొన్ని ఛేంజెస్ చేసి అదే కథని ఇక్కడ మెహర్ రమేష్ తెరకెక్కించారు. ఇంకా చెప్పాలంటే.. రజనీకాంత్ హీరోగా వచ్చిన ‘పెద్దన్న’ చిత్ర కథలానే ఈ సినిమా కథ ఉంటుంది. శంకర్ (చిరంజీవి)కి ఓ చెల్లెలు మహాలక్ష్మి (కీర్తి సురేష్) ఉంటుంది. చదువు నిమిత్తం ఇద్దరూ కలకత్తాలో ఉండాల్సి వస్తుంది. చెల్లెలిని కాలేజీకి పంపించి.. కలకత్తాలో తనొక ట్యాక్సీ డ్రైవర్‌గా వర్క్ చేస్తుంటాడు శంకర్.

అయితే ఈ క్రమంలో అక్కడ హ్యుమన్ ట్రాఫికింగ్ (మానవ అక్రమ రవాణా)ని ఓ గ్యాంగ్ యధేచ్చగా చేస్తుంటుంది. ట్యాక్సీ డ్రైవర్‌గా ఉన్న శంకర్‌కి ఈ విషయం తెలిసి.. పోలీసులకు సమాచారం ఇస్తాడు. కొంత మంది అమ్మాయిలను కూడా రక్షిస్తాడు. అయితే పోలీసులకు ఈ సమాచారం ఇచ్చింది శంకర్ అని తెలుసుకున్న అలెక్స్ అలియాస్ అలెగ్జాండర్ (తరుణ్ అరోరా) శంకర్‌ని, అతని చెల్లెలిని టార్గెట్ చేస్తాడు. శంకర్ కూడా అలెగ్జాండర్ (తరుణ్ అరోరా) టీమ్‌లోని విలన్ గ్యాంగ్‌ని చంపుతూ వస్తుంటాడు.

మరో వైపు మహాలక్ష్మీ‌ని శ్రీకర్ (సుశాంత్) ఇష్టపడుతుంటాడు. శ్రీకర్ సోదరైన లాస్య (తమన్నా) ఓ క్రిమినల్ లాయర్. ఒకానొక సందర్భంలో శంకర్ ఓ విలన్‌ని చంపుతుండగా లాస్య చూస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? హైదరాబాద్‌లో భోళా భాయ్.. కలకత్తాలో శంకర్‌గా ఎందుకు పేరు మార్చుకుని అలా ట్యాక్సీ డ్రైవర్‌గా చేరాడు? ‘భోళా’ ఫ్లాష్ బ్లాక్ ఏమిటి? గతం తెలిసిన తర్వాత శంకర్ సోదరితో లాస్య సోదరుడి పెళ్లి జరిగిందా? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే.. థియేటర్లలో ఈ సినిమా చూడాల్సిందే.

నటీనటుల, సాంకేతిక నిపుణుల పనితీరు:

మెగాస్టార్ చిరంజీవి అనగానే అంతా ఆయన నుంచి 100 శాతం ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకుంటారు. ఏజ్ ఎంత పెరిగినా.. తనని మెగాస్టార్‌ని చేసిన ప్రేక్షకుల కోసం 100 శాతం న్యాయం చేసేందుకు.. చిరు కూడా ప్రయత్నిస్తున్నారు. ఆయన ప్రయత్నంలో లోపం లేదు కానీ.. దర్శకుడు మెహర్ కథ ముందు చిరంజీవి ఏం చేసినా కూడా.. ఈసారి వర్కవుట్ కాలేదనే చెప్పుకోవాలి. కామెడీ, యాక్షన్, స్ఫూఫ్ సన్నివేశాలలో తన వంతు న్యాయం చేసేందుకు చిరు చిరుప్రయత్నం చేశారు.

రొటీన్ కథకి.. ఆయన ఏం చేసినా.. అది రొటీన్ గానే కనిపించింది. కొన్ని సీన్ల విషయంలో చిరంజీవి కూడా ఏం చేయలేని పరిస్థితిని మెహర్ రమేష్ కల్పించాడు. కీర్తి సురేష్ చెల్లెలిగా చక్కగా కనిపించింది. కానీ ఆమె చెల్లెలిగా చేస్తే కలిసి రావడం లేదో ఏమో.. అప్పుడు పెద్దన్న.. ఇప్పుడు భోళా.. అలా ఉంది ఆమె పాత్ర. కొన్ని ఎమోషనల్ సీన్స్‌లో కీర్తి కాసేపు మెప్పించింది. తమన్నా పాటలకి, కొన్ని కామెడీ సన్నివేశాలకే అన్నట్లుగా ఆమె పాత్రని డిజైన్ చేశారు. కొత్తగా ఏదో తమన్నా చేశానని అనుకుంటుంది కానీ.. అక్కడేం లేదు. అరిగిన టేప్ రికార్డర్‌లా.. నవ్వు తెప్పించని కొన్ని కామెడీ డైలాగ్స్ ఆమెతో చెప్పించారు అంతే.

సుశాంత్‌కు రెండు మంచి సీన్లు పడ్డాయి. అతను ఆ పాత్రకి సరిపోయాడు. తరుణ్ అరోరా ఎప్పటిలానే ఈ సినిమాలో కూడా కనిపించాడు తప్ప.. అతని పాత్రకి కొత్తదనం అంటూ ఏమీ లేదు. ఇంకో ఇద్దరు ముగ్గురు విలన్లకు పాత్రలైతే దక్కాయి అని చెప్పుకోవాలి. ఇక మురళీ శర్మ, బ్రహ్మాజీ, రఘుబాబు, వెన్నెల కిశోర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను, లోబో, హర్ష ఇలా స్ర్కీన్‌పై కలర్‌ఫుల్‌గా కనిపించినా.. కామెడీ మాత్రం పండలేదు. పైగా వెగటు పుడుతుంది.

శ్రీముఖిని ఖుషి స్ఫూఫ్ కోసం వాడినా, రష్మీని సరదాగా కాసేపు చిరు పక్కన పెట్టుకున్నా.. వారి వల్ల సినిమాకి రూపాయి కూడా ఉపయోగం లేదని చెప్పుకోవాలి. అయితే ఒక్కటి మాత్రం ఇక్కడ చెప్పుకోవాలి.. చిరంజీవితో నటించడం అనేది ఒక డ్రీమ్ అని కొందరు నటీనటులు అనుకుంటూ ఉంటారు. అలా చూస్తే.. ఈ సినిమాతో చాలా మంది డ్రీమ్ అయితే తీరింది కానీ.. ప్రేక్షకులకే తీట తీరింది. ఇంకా ఇతర పాత్రలలో నటించిన వారంతా కూడా దర్శకుడు చెప్పింది చేసుకుపోయారు.

టెక్నికల్ విషయానికి వస్తే.. నిర్మాణ విలువలు బాగున్నాయి. అలాగే కెమెరా పనితనం బాగుంది. చిరంజీవినే కాదు.. సినిమాలో నటించిన అందరినీ కెమెరామ్యాన్ అందంగా చూపించారు. సీన్స్ కూడా ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ బాగా క్యాప్చర్ చేశారు. ఎడిటింగ్ పరంగా.. మార్తాండ్ కె వెంకటేష్ ఏం చేయడానికి లేకుండా చేశారని అనిపిస్తుంది. దర్శకుడు చెప్పింది చేశాననే ఫీలింగ్‌లో ఆయన ఉండి ఉండవచ్చు. లేదంటే ఫస్టాఫ్ మొత్తం తీసేయవచ్చు.

ఇక ఈ మధ్య కాలంలో చిన్న, పెద్ద సినిమా అనే తేడా లేకుండా.. ఏ సినిమాకైనా సంగీతం ప్రధాన పాత్ర వహిస్తూ.. మెప్పించడంలో టాప్ స్థానాన్ని కైవసం చేసుకుంటుంది. కానీ ఈ సినిమాకు మాత్రం మ్యూజిక్ అంతగా మ్యాజిక్ చేయలేదనే చెప్పుకోవాలి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇవ్వడంలో దిట్ట అయిన మణిశర్మ కొడుకు.. నాకు వచ్చింది ఇంతే అన్నట్లుగా ఏదో చేసుకుంటూ వెళ్లిపోయాడంతే. బహుశా దర్శకుడు అతనికి అంత స్పేస్ ఇవ్వలేదేమో.

ఇక కెప్టెన్ ఆఫ్ ది ‘భోళా’ విషయానికి వస్తే.. మెహర్ రమేష్ ఈ సినిమాతో అస్సలు కొత్తదనం ఏంటో తెలియని విధంగా చేసుకుంటూ వెళ్లిపోయాడు. వింటేజ్ వింటేజ్ అంటూ.. అప్పటి కాలంలోకి వెళ్లి పోయాడా? అని అనిపిస్తుంది. అతనిక డైరెక్షన్ పక్కనెట్టి.. ఏదైనా చారిటీ సంస్థను నడుపుకుంటే బెటర్. ఇది ఈ సినిమాని చూసిన ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటికి వచ్చిన తర్వాత అనుకుంటున్న మాట. అలా డిజప్పాయింట్ చేశారు మెహర్ రమేష్.

విశ్లేషణ:

‘భోళా శంకర్’ని కాసేపు పక్కన పెడితే.. అమితాబ్, రజనీకాంత్, కమల్ హాసన్, మోహన్ లాల్, చిరంజీవి వీళ్లంతా దాదాపు ఒకే టైమ్‌లో హీరోయిజాన్ని చూపించిన వారు. అమితాబ్ కాస్త పెద్ద అనుకున్నా.. మిగతా అంతా సమకాలీకులు. వాళ్లకి కూడా వరుసగా హిట్స్ ఏం పడటం లేదు కానీ.. అంతగా వారిపై ట్రోలింగ్ మాత్రం జరగదు. అందుకు కారణం.. వారు సెలక్ట్ చేసుకునే సబ్జెక్ట్స్. అయితే ఎన్ని ఫ్లాప్స్ ఉన్నా.. కమల్‌కి ‘విక్రమ్’, రజనీకి ‘జైలర్’ వాటన్నింటినీ మరిచిపోయేలా చేశాయి. వాళ్లేం డ్యాన్స్‌లు చేయలేదు. నేల విడిచి సాము చేయలేదు. సింపుల్‌గా వాళ్ల ఏజ్‌కి తగ్గట్లుగా పాత్రలని చూజ్ చేసుకుంటున్నారు. హిట్, ఫ్లాప్ అనేవి పక్కన పెడితే.. వారు చేస్తున్న పాత్రలతో హుందాతనాన్ని చాటుతున్నారు.

మరి చిరంజీవికి ఏమైంది? కష్టపడుతున్నాడు కానీ.. అది కామెడీ కాకూడదు కదా. కూతురు వయసు ఉన్న వారితో కొంటె వేషాలు అవసరమా?. ‘భోళా’లో ఒక సీన్ ఉంటుంది.. చెల్లెలు నిద్రపోతూ ఉంటే.. అన్నయ్య తల నిమిరే సీన్.. ఆ సీన్ చూపించిన విధానం అయితే రోత పుడుతుంది. కాబట్టి.. చిరంజీవికి ఇదే సరైన సమయం.. మరీ ముఖ్యంగా రీమేక్స్ పక్కన పెట్టి.. కాస్త హుందాగా ఉండే పాత్రలతో సినిమాలు చేస్తే కచ్చితంగా ప్రేక్షకులు ఆదరిస్తారు. ఈ విషయంపై చిరంజీవి ఎంత త్వరగా మనసు పెడితే.. అంత త్వరగా ఆయన మళ్లీ హిట్ బాట పడతారు.

ఇక ‘భోళా శంకర్’ విషయానికి వస్తే.. ఏమయ్యా మెహరూ.. ఏంటయ్యా ఇది. ఇంతేనా సినిమా తీసేది. దాదాపు 10 సంవత్సరాల తర్వాత నీకు డైరెక్షన్ ఛాన్స్ వచ్చింది కదా.. కథ ఎలా ఉన్నా.. ప్రజంటేషన్ ఇవాళ ఇంపార్టెంట్ కదా.. పైగా నీకు స్టైలిష్ అనే పేరు కూడా ఉంది. చిరంజీవి గురించి, ఆయన నటన, గొప్పతనం, చారిటీ.. ఇవన్నీ నువ్వు పదే పదే చెప్పించడం ఏంటయ్యా?. వీటిపై పెట్టిన శ్రద్ధ సినిమాపై పెట్టి ఉంటే.. సినిమా ఇంకోలా ఉండేది.

అసలు ఒరిజినల్‌ని యాజీటీజ్‌గా దించేసినా.. కాస్త బాగుండేది. అర్థం పర్థం లేని కామెడీ పెట్టి.. విసుగు తెప్పించావ్ కదయ్యా. కామెడీ కావాలంటే.. టికెట్ కొనుక్కుని థియేటర్స్‌కి రావాల్సిన అవసరం లేదు. బుల్లితెరపై చాలా ప్రోగ్రామ్స్ ఆ పని చేస్తున్నాయి. ఈ మధ్య రాజకీయ నాయకులు కూడా ఫుల్‌గా ఎంటర్‌ టైన్ చేస్తున్నారు. నిర్మాత భారీ లాస్‌లో ఉన్నాడు. ఎందుకు అంతమంది? మంది ఎక్కువైతే మజ్జిగ పల్చన అంటారు కదా.. అలా అయింది నీ ‘భోళా’. అంతేలే 10 ఏళ్ల గ్యాప్‌ వచ్చింది. ఈ పదేళ్లలో ఏ సినిమాకూ వర్క్ చేసిన దాఖలాలు కూడా లేవు. అలాంటి నీ నుంచి ఇంతకంటే జనం ఆశించడం కూడా తప్పే అవుతుంది.

అయినా.. నిన్ను కాకపోయినా.. ఎవరెస్ట్ లాంటి చిరంజీవిని చూసైనా జనాలు టికెట్ కొంటారని అస్సలు అనుకోలేదా? నిజంగా ఆయనకు నువ్వు అభిమాని అయితే.. ‘వాల్తేరు వీరయ్య’, ‘గబ్బర్ సింగ్’ వంటి చిత్రాలతో నిరూపించుకోవాలి కానీ.. మరీ ఏందయ్యా.. ‘వేదాళం’ కంటే వెనక్కి తీసుకెళ్లావ్. ఇప్పుడే ట్రెండ్ నడుస్తుందో కూడా తెలియనంత సోయలో ఉన్నావా? లేదంటే ఏం చేసినా చిరంజీవి చూసుకుంటాడులే అనుకున్నావా? నాలుగు యాక్షన్ ఎపిసోడ్స్ పెట్టి.. తలకాయలు లేపితే సినిమాలు ఆడే రోజులు పోయాయని తెలుసుకోకుండా.. అదే రొట్ట కొట్టుడు, రొటీన్ సినిమాలు అందిస్తే.. నీకేం నువ్వు బాగానే సైడ్ అయిపోయి నీ ట్రస్ట్ చూసుకుంటావ్.

మెగాస్టార్ పరిస్థితి ఏంటో ఊహించావా? అసలా కామెడీ ట్రాక్స్ ఏంటి? వీటి గురించి విడుదలకు ముందు నువ్వు చెప్పిన స్టోరీలేంటి? సెకండాఫ్‌లో ఫైట్ మాస్టర్స్ పడిన కష్టం లేకపోతే.. ఇది జబర్ధస్త్‌లో వచ్చే ఓ స్కిట్‌గా మారిపోయేది. మొత్తంగా అయితే మాత్రం మెగాస్టార్ సినిమా ఎలా ఉండకూడదో అలా ఉందీ సినిమా. అక్కడక్కడా మెప్పించే కొన్ని సీన్లు, సెకండాఫ్‌లో వచ్చే కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్, చిరు డ్యాన్స్ కోసం అయితే ఏమైనా ఒకసారి సాహసించవచ్చు. ఇక మెగా ఫ్యాన్స్‌కి తప్పదు కాబట్టి.. ఓసారి వేసుకోవ చ్చు.. అంతే. ఓవరాల్‌గా అయితే ‘భోళా’ని ‘జైలర్’ ఆక్రమించేయడం ఖాయం. చిరు ఖాతాలో ఈ ‘భోళా’ ఊహించని సినిమాగా మిగిలిపోవడం తధ్యం. ఇంకా చెప్పాలంటే ‘ఆచార్య’ను మించిన సినిమా ఇది. కొరటాల పండగ చేసుకోవచ్చు.

ట్యాగ్‌లైన్: బైబై శంకర్.. కొరటాల పార్టీ చేసుకోవచ్చు
రేటింగ్: 2/5

Latest News