BJP
- మరో తొమ్మిది నెలల్లో లోక్‌సభ ఎన్నికలు
- ఆ లోపే నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు
- ఐక్యత దిశగా అడుగులేస్తున్న విపక్షాలు
- మరోవైపు ప్రజా సమస్యలతో తలనొప్పి
- అదుపులో లేని పెట్రోల్, డీజిల్ ధరలు
- కొండెక్కిన వంట గ్యాస్ సిలిండర్ ధర
- చాలా రాష్ట్రాల్లో చరిష్మాలేని స్థానిక నేతలు
- మొన్నటిదాకా ప్రధాని మోదీపైనే ఆశలు
- కర్ణాటక, హిమాచల్‌లో కనిపించని హవా
న్యూఢిల్లీ: ఈ సంవత్సరం చివరిలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసం బీజేపీ, కాంగ్రెస్ సహా ఇతర ప్రాంతీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. కర్ణాటక గెలుపుతో జోరు మీదున్న కాంగ్రెస్ విజయగర్వంతో ఎన్నికల బరిలోకి దూకుతుండగా.. పరాజయంతో కాస్త డీలా పడిన బీజేపీ ప్రత్యామ్నాయాలను ఆలోచిస్తున్నది.
ఈ డిసెంబర్‌లో రాజస్థాన్, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరంలలో ఎన్నికలు జరగనుండగా.. బీజేపీ, కాంగ్రెస్ చెరో రెండు రాష్ట్రాల్లో, మరో రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మంచి గెలుపును రుచి చూసిన పార్టీ 2024లో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో విజయఢంకా మోగించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఎదుర్కొంటున్న అతి పెద్ద ఐదు సమస్యలను ఓ సారి పరిశీలించాలి.
పూర్తిగా నరేంద్రమోదీ చరిష్మా మీదే ఆధారపడి గెలవలేమని కమలనాథులకు కర్ణాటక ఎన్నికలు గుణపాఠం చెప్పాయి. ఎన్నికల ముందు ముఖ్యమంత్రుల మార్పు, హిందూత్వ అంశాలే గెలుపునకు సరిపడా సీట్లను తెచ్చిపెట్టకపోవడంతో బీజేపీ తలపట్టుకుంటున్నది. ఈ ఎన్నికల్లో గనక ప్రతిపక్ష పార్టీలకు గెలుపును కట్టబెడితే.. ఉమ్మడి కూటమి ద్వారా లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమి మరింత సులభంగా మారిపోతుంది. అయితే.. బీజేపీని భయపెడుతున్నది ఇదొక్కటే కాదు.. చాలా అంశాలు కాషాయ పార్టీ నేతలను కలవరానికి గురి చేస్తున్నాయి.
ఉచిత పథకాలు
బీజేపీ, దాని ప్రతిపక్షాలకు ఈ ఫ్రీబీ లేదా ఉచిత పథకాల్లో తేడా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. బీజేపీ సంక్షేమ పథకాలు ప్రతిపక్షాల ఉచితాల హామీల ముందు తేలిపోతున్నాయి. బీజేపీ నాయకులు ఎప్పటికప్పుడు ఈ ఉచితాలపై విమర్శలు గుప్పిస్తుండటంతో వీరు అధికారంలోకి వస్తే తమకు వచ్చే ఈ ఉచిత పథకాలు ఆగిపోతాయేమోనని కొన్ని వర్గాలు భయపడుతున్నాయి.
ఇటీవలే కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ బీజేపీ ఎప్పుడూ సంక్షేమ కార్యక్రమాలకే ప్రాధాన్యం ఇస్తుందని, ఉచితాలకు తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. అయితే ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత ప్రయాణాలు, ఉచిత బియ్యం మొదలైనవి కొన్ని వర్గాలకు అక్కరకు వస్తున్నాయనేది కొట్టి పారేయలేని అంశం. ఏతవాతా బీజేపీ ఈ ఉచితాల మార్గాన్నైనా ఎంచుకోవాలి లేదా ఈ అంశంలో ప్రతిపక్షాలను ఏదైనా మాయ అయినా చేయగలగాలి.
గుదిబండగా మారిన గ్యాస్‌బండ
ఒకప్పుడు రూ.500లకే లభించిన ఎల్పీజీ సిలెండర్ ధర ఇప్పుడు రూ.1000 దాటింది. రాయితీ చట్రంలో ఉన్న చాలా మందిని కేంద్ర ప్రభుత్వం లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించడమే దీనికి కారణం. దినసరి కూలీలు, దిగువ మధ్యతరగతి కుటుంబాలపై అదనపు భారం పడుతుండటంతో కేంద్రంలో ఉన్న బీజేపీపై ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
కొవిడ్ ముందు పరిస్థితి ఎలా ఉన్నా.. కొవిడ్ వల్ల చాలా కుటుంబాల పొదుపు సొమ్ము తరిగిపోవడంతో ఆర్థికంగా కష్టాల్లో ఉన్నాయి. దీంతో వెయ్యి రూపాయల గ్యాస్‌బండ వారికి గుదిబండగా మారింది. ఇది బీజేపీ ఓటమిలో ప్రధాన పాత్ర పోషించినా ఆశ్చర్యపోవక్కర్లేదు.
పెట్రోల్, పాల రేట్లు
2014లో బీజేపీ అధికారంలోకి వచ్చాక భారీగా రేట్లు పెరిగిన వస్తువుల్లో పెట్రోల్ ఒకటి. అప్పుడు లీటరు సుమారు రూ.70గా ఉన్న పెట్రోల్ ధర ఇప్పడు సుమారు 110 రూపాయలు ఉన్నది. ఫుల్ క్రీం పాల ప్యాకెట్ ధర లీటరుకు రూ.46 ఉండగా ఇప్పుడు రూ.20 పెరిగి రూ.66కి చేరింది. ఇది మధ్యతరగతి ప్రజలకు భారంగా మారింది.
పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగడం వల్ల రవాణా ఖర్చులు పెరిగి వస్తు సేవల ధరలూ పెరిగిపోయాయి. పాల ధరలపై ప్రభుత్వానికి నేరుగా నియంత్రణ లేకపోయినప్పటికీ పెట్రోలు ధరల పెరుగుదలపై మాత్రం బీజేపీ దోషిలా నిలబడింది.
నెలవారీ ప్రోత్సాహకాలు
నెల నెలా ఉచితంగా డబ్బులు పంచడం ఇప్పుడు పలు ప్రాంతీయ పార్టీలు ప్రకటిస్తున్న ఉచిత తాయిలాలలో ప్రముఖమైనది. ఈ హామీతోనే కర్ణాటక మహిళలను, నిరుద్యోగులను కాంగ్రెస్ పార్టీ ఆకర్షించింది. నిరుద్యోగిత భారత ఎన్నికల్లో ఎప్పుడూ ప్రధానాంశం కాకపోయినప్పటికీ వారికి నగదు సాయం చేస్తామన్న హామీ మాత్రం ఎన్నికల్లో ఓట్లను కొల్లగొడుతోంది. ఈ డబ్బు గ్యాస్ సిలెండర్లు, పాల ఖర్చులకు సరిపోతాయని మహిళా ఓటర్లు భావిస్తున్నారు. బీజేపీ ఇప్పటి వరకు ఇలాంటి హామీలకు దూరంగా ఉంటూ వస్తోంది.
స్థానిక నాయకత్వం
బీజేపీ బలంగా ఉన్నట్టు కనిపిస్తున్నా.. నిజానికి బలమైన నాయకత్వం అంతటా లేదు. దానికి తోడు నరేంద్రమోదీ హవా మీదే పూర్తిగా బీజేపీ ఆధారపడిపోయింది. మోదీ వస్తే ఓట్లు వస్తాయన్న భ్రమల్లో తేలియాడింది. అయితే.. కర్ణాటక, అంతకు ముందు హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో ఆ బుడగ పేలిపోయింది. మరోవైపు స్థానికంగా నేతలు గట్టి ఓట్ పుల్లర్లగా తయారుకాలేదు.
దేవేంద్ర ఫడణవీస్, యోగి ఆదిత్యనాథ్, హిమంతబిశ్వ శర్మ, శివరాజ్‌సింగ్ చౌహాన్ లు ఉన్న ఆయా రాష్ట్రాల్లో బీజేపీ ఎంత బలంగా ఉందో తెలిసిందే. మిగతా రాష్ట్రాల్లో సైతం బీజేపీ స్థానిక నాయకులను తయారుచేయకపోతే ఇప్పుడు కాంగ్రెస్‌కు పట్టిన గతే బీజేపీకి భవిష్యత్తులో పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.