Site icon vidhaatha

తమిళ్‌కు నో.. తెలుగుకు సై? జాన్వి ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన బోనీకపూర్!

విధాత‌: అతిలోక సుందరి శ్రీదేవి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆమె నట వారసురాలిగా జాన్వి కపూర్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ధడక్ సినిమాతో తెరంగేట్రం చేసింది. ఆ తరువాత పలు చిత్రాలలో నటించింది. శ్రీదేవి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుంది. ప్రస్తుతం పలు చిత్రాలలో నటిస్తోంది. అవన్నీ బాలీవుడ్ చిత్రాలే కావడం విశేషం.

దక్షిణాదిలో ఈమె చేత ఓ చిత్రంలో న‌టింప‌జేయాల‌ని ఎప్ప‌టి నుంచో ఎంద‌రో ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. చిరంజీవి-శ్రీ‌దేవి న‌టించిన జ‌గ‌దేక‌వీరుడు అతిలోక సుంద‌రి చిత్రాన్ని రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్ల‌తో క‌లిపి రీమేక్ చేయాల‌నే ప్ర‌య‌త్నాలు కూడా జ‌రిగాయి.

కానీ జాన్వీ ద‌క్షిణాది చిత్రాల‌లో న‌టించ‌డానికి ఆస‌క్తి చూప‌క‌పోవ‌డంతో అది వ‌ర్కౌట్ కాలేదు. ఇక లైగ‌ర్ చిత్రంలో కూడా జాన్వీని తీసుకోవాల‌ని పూరీ జ‌గ‌న్నాథ్ భావించారు. క‌ర‌ణ్ జోహార్ సాయం కోరాడు. కానీ అది కూడా వ‌ర్కౌట్ కాలేదు.

మొత్తానికి శ్రీ‌దేవి కూతురిని ద‌క్షిణాదికి ప‌రిచ‌యం చేసిన ఘ‌న‌త సొంతం చేసుకోవాల‌ని, జాన్వీతో నటింప జేసి శ్రీదేవి ఇమేజ్‌ని క్యాష్ చేసుకోవాలని చాలా మంది ప్రయత్నించారు. కానీ వారికి అది సాధ్య పడలేదు. ఇక కొర‌టాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించ‌నున్న 30వ ప్రాజెక్టు కోసం జాన్వీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

మ‌రోవైపు ఆర్య హీరోగా న‌టిస్తున్న ఆవారా సీక్వెల్‌లో న‌టిస్తోంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. తాజాగా జాన్వీ ఎంట్రీ పై ఆమె తండ్రి బోనీకపూర్ స్పందించారు. ఆయ‌న ప్ర‌త్యేకంగా ఈ చిత్రం విష‌య‌మై స్పందిస్తూ ప్రియమైన మీడియా మిత్రులకు తెలియజేసేది ఏమనగా జాన్వీ ప్రస్తుతం ఎలాంటి తమిళ సినిమాను అంగీకరించ లేదు. దయచేసి ఇలాంటి పుకార్ల‌ను ప్రచారం చేయకండి అంటూ జాన్వి తమిళ్ ఎంట్రీపై బోనీకపూర్ క్లారిటీ ఇచ్చారు. కానీ ఎన్టీఆర్ 30లో జాన్వీ నటించే వార్తలని మాత్రం ఆయన ఖండించక పోవడం గమనార్హం.

Exit mobile version