- రేవంత్‌పై మనీలాండరింగ్ కేసు పెట్టాలి
- బావమరిది కంపెనీతో ఆయనకు లింకులు
- గతంలో ఆయన వాడిన కారూ ఆ కంపెనీదే
- అదే కంపెనీకి భారీగా కాంట్రాక్టుల అప్పగింత
- టర్నోవర్ లేని కంపెనీకి ఎలా ఇస్తారు?
- ఈడీకి బీఆరెస్ నేత మన్నె క్రిశాంక్ ఫిర్యాదు
న్యూఢిల్లీ, ఆగస్ట్ 29 (విధాత): తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బావమరిదికి చెందిన శోధ కన్‌స్ట్రక్షన్స్‌పై బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఏడు లక్షల ఆర్థిక లావాదేవీలు ఉన్న శోధ కన్‌స్ట్రక్షన్స్‌కు అమృత్ టెండర్లు, సింగరేణి మైనింగ్ కాంట్రాక్టు, డిండి ఇరిగేషన్ కాంట్రాక్టు ఇవ్వడంపై విచారించాలని ఫిర్యాదులో కోరారు. గతంలో రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఏ కంపెనీ పేరుపై ఉన్న కారు వాడారో ఇప్పుడు అదే కేఎల్ఎస్ఆర్ ఇన్‌ఫ్రాటెక్ కంపెనీకి కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 650 కోట్ల విలువ గల మూడు కాంట్రాక్టులు ఇవ్వడం చట్ట వ్యతిరేకమని పేర్కొన్నారు. దానిపైనా విచారణ జరపాలని కోరారు. ఇటీవలే ఒక సంచలన కేసులో ఒత్తిడి పెడుతున్నారని తప్పుకొన్న జడ్జి విషయంలో కేఎల్ఎస్ఆర్ ఇన్‌ఫ్రాటెక్, సీఎం రేవంత్ సంబంధంపై విచారణ జరపాలని కూడా ఫిర్యాదులో కోరినట్టు క్రిశాంక్ తెలిపారు. వీటన్నింటిపై పూర్తి ఆధారాలను ఈడీకి సమర్పించానని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడి, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన సంస్థలకు కాంట్రాక్టులు అప్పగించారని ఫిర్యాదులో క్రిశాంక్ ఆరోపించారు. కోట్ల విలువైన ప్రభుత్వ కాంట్రాక్టులను ఇచ్చిన రేవంత్‌రెడ్డి మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని పేర్కొన్నారు.
శోధా కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ 2022 ఆర్థిక సంవత్సర ఆదాయం 7,13,113 కోట్లు మాత్రమేనని క్రిశాంక్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అతితక్కువ టర్నోవర్ ఉన్నప్పటికీ, కంపెనీకి 2024లో 1,137 కోట్ల రూపాయల విలువైన అమృత్ టెండర్ లభించిందని తెలిపారు. తరువాత 115 కోట్ల విలువైన సింగరేణి మైనింగ్ కాంట్రాక్ట్, 365 కోట్ల విలువైన డిండి లిఫ్ట్ ఇరిగేషన్ కాంట్రాక్ట్ లభించిందని పేర్కొన్నారు. కంపెనీ ఆర్థిక నేపథ్యంతో పోలిస్తే ఈ కాంట్రాక్టులు మోసపూరితమని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినట్టేనని పేర్కొన్నారు. మరో కంపెనీ కేఎల్‌ఎస్‌ఆర్ ఇన్‌ఫ్రాటెక్‌కు ప్రయోజనం చేకూర్చేలా 2018లో ఒప్పందాలు జరిగాయని లేఖలో ప్రస్తావించారు. రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు ఉపయోగించిన కారు కేఎల్‌ఎస్‌ఆర్ ఇన్‌ఫ్రాటెక్ పేరు మీద రిజిస్టర్ అయ్యిందని, దీనిని బట్టి ఆయనకు ఆ కంపెనీతో సంబంధాలు ఉన్నట్టు స్పష్టమైందని లేఖలో ప్రస్తావించారు. ప్రస్తుత ప్రభుత్వంలో, కేఎల్‌ఎస్‌ఆర్ ఇన్‌ఫ్రాటెక్ పెద్ద ఎత్తున కాంట్రాక్టులను పొందిందని పిర్యాదు చేశారు పాలేర్ రిజర్వాయర్‌లో 191 కోట్ల లిఫ్ట్ ఇరిగేషన్ ఒప్పందం, 319 కోట్ల రాజీవ్ గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఒప్పందం వంటివి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే కుదిరాయని తెలిపారు. కచ్చితంగా దీని వెనుక ఆర్థిక ప్రయోజనాలు, మనీలాంటింగ్ జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు.