Site icon vidhaatha

బ్యాంక‌ర్లు ర‌జాకార్ల మాదిరి రైతుల‌ను వేధిస్తున్నారు.. హ‌రీశ్‌రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

హైద‌రాబాద్: రుణాలు చెల్లించ‌ని రైతుల ప‌ట్ల బ్యాంకు అధికారులు రజాకార్ల మాదిరిగా గ్రామాల మీద ప‌డి రైతుల‌ను వేధింపుల‌కు గురి చేస్తున్నార‌ని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు. రైతుల రుణ‌మాఫీపై కాంగ్రెస్ ప్ర‌భుత్వం త‌క్ష‌ణ‌మే ప్ర‌క‌ట‌న చేయాల‌ని హ‌రీశ్‌రావు డిమాండ్ చేశారు. తెలంగాణ భ‌వ‌న్‌లో హ‌రీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.


రైతుబంధు లేక‌, నీళ్లు, క‌రెంట్ స‌రిగ్గా లేక పంట‌లు ఎండిపోతుంటే.. మూలిగే న‌క్క‌పై తాటికాయ ప‌డ్డ‌ట్టు.. బ్యాంకు అధికారులు అప్పులు క‌ట్టాల‌ని రైతుల‌కు నోటీసులు జారీ చేస్తున్నారు. కోర్టుల్లో కేసులు పెడుతామ‌ని లీగ‌ల్ నోటీసులు జారీ చేశారు. ప్ర‌భుత్వ వైఫ‌ల్యం వ‌ల్ల రైతుబంధు, నీళ్లు, క‌రెంట్ రాక పంట‌లు ఎండిపోయి ఆందోళ‌న‌లో ఉన్నారు. మ‌రోవైపు పంట రుణాలు క‌ట్టాల‌ని బ్యాంకు అధికారులు గ్రామాల‌పై ప‌డుతున్నారు. ఇవాళ బ్యాంకు అధికారులు నోటీసులు ఇవ్వ‌డ‌మే కాదు.. రైతుల‌ను బెదిరిస్తున్నారు. బ‌కాయిలు క‌ట్ట‌క‌పోతే ఆస్తులు సీజ్ చేసి కోర్టుకు లాగుతాం అంటున్నారు. బ్యాంకు అధికారులు ర‌జాకార్ల మాదిరిగా గ్రామాల‌ మీద ప‌డి రైతుల‌ను వేధిస్తున్నారు అని హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు.


డిసెంబ‌ర్ 9న నా మొద‌టి సంత‌కం రైతు రుణ‌మాఫీపై చేస్తాన‌ని రేవంత్ రెడ్డి ఎన్నిక‌ల స‌మ‌యంలో చెప్పారు. ఏక‌కాలంలో రూ. 2 ల‌క్ష‌ల వ‌ర‌కు రుణాలు మాఫీ చేస్తామ‌ని న‌మ్మించే ప్ర‌య‌త్నం చేశారు. బ్యాంకుకు వెళ్లి అప్పులు తెచ్చుకోండి.. మేం క‌డుతాం అన్నారు. కానీ డిసెంబ‌ర్ 9 కంటే రెండు రోజుల ముందే ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. ప్ర‌మాణ‌స్వీకారం చేసి 100 రోజులు దాటింది. ఇప్ప‌టికీ రుణ‌మాఫీపై మీ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకోలేదు. బ్యాంకుల‌కు ఎలాంటి ఆదేశాలు ఇవ్వ‌లేదు. దీంతో రైతుల‌ను బ్యాంక‌ర్లు భ‌య‌భ్రాంతుల‌కు గురి చేస్తున్నారు అని హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు.


రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం రైతుల‌ను ద‌గా, మోసం చేసింది. మొండి చేయి చూపింది. రైతుల విష‌యంలోనే కాదు.. ఇత‌ర అంశాల్లో కూడా మోసం చేస్తోంది. మేనిఫెస్టోలో చెప్పిన ఏ ఒక్క అంశాన్ని కూడా అమ‌లు చేయ‌లేదు. మాట నిల‌బెట్టుకోలేదు. 100 రోజుల్లో 13 హామీలు అమ‌లు చేస్తామ‌ని చెప్పారు. రైతుల విష‌యంలో డిసెంబ‌ర్ 9న రుణ‌మాఫీ చేస్తామ‌న్నారు. కౌలు రైతుల‌కు ఎక‌రానికి రూ. 15 వేలు, వ్య‌వ‌సాయ‌ కూలీల‌కు రూ. 12 వేలు, వ‌రి పంట‌కు క్వింలాట‌ల్‌కు రూ. 500 బోన‌స్ ఇస్తామ‌న్నారు.


ఇవి అమ‌లు చేయ‌లేదు. రైతుల‌ను న‌ట్టేట ముంచింది కాంగ్రెస్ ప్ర‌భుత్వం. ఏ ముఖం పెట్టుకుని పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో ఓట్లు అడుగుతారు..? బాండు పేప‌ర్ల సాక్షిగా రైతుల‌ను మోసం చేశామ‌ని ఓట్లు అడుగుతారా..? ప‌దేండ్ల‌లో ఎన్న‌డూ లేని విధంగా 20 ల‌క్ష‌ల ఎక‌రాల్లో పంట ఎండ‌బెట్టామ‌ని ఓట్లు అడుగుతారా..? నీటి నిర్వ‌హ‌ణ‌, క‌రెంట్ సరిగా ఇవ్వ‌లేద‌ని ఓట్లు వేయ‌మ‌ని అడ‌గ‌డానికి గ్రామాల్లోకి వ‌స్తారా..? అని హ‌రీశ్‌రావు నిల‌దీశారు.


ల‌క్ష‌లాది రైతుల‌తో స‌చివాల‌యాన్ని ముట్ట‌డిస్తాం..


ఇచ్చిన మాట ప్ర‌కారం రైతు రుణ‌మాఫీ ప్ర‌క‌టించాలి. లేదంటే రైతులు పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీకి క‌ర్రుకాల్చి వాత పెట్ట‌డం ఖాయం. ఈ సంద‌ర్భ‌గా రైతుల‌కు విజ్ఞ‌ప్తి చేస్తున్నాం. అప్పులు క‌ట్టొద్దు.. రైతుల‌కు బీఆర్ఎస్ అండ‌గా ఉంటుంది. అధికారులు వేధిస్తే.. మా దృష్టికి తీసుకొస్తే మీకు అండంగా ఉంటాం. రుణ‌మాఫీ కోసం కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై బీఆర్ఎస్ పార్టీ పోరాడుతోంది. ఈ ప్ర‌భుత్వం దిగిరాక‌పోతే రాష్ట్రంలోని ల‌క్ష‌లాది రైతుల‌తో సెక్ర‌టేరియ‌ట్‌ను ముట్టడించ‌డానికి బీఆర్ఎస్ పార్టీ వెనుకాడ‌ద‌ని హెచ్చ‌రిస్తున్నాం. రాష్ట్రంలో ఆందోళ‌నలో ఉన్న రైతాంగానికి భ‌రోసా క‌ల్పించాలి అని హ‌రీశ్‌రావు సూచించారు.


వ్య‌వ‌సాయానికి స‌రిగ్గా నీళ్లు ఇవ్వ‌క‌, స‌రిప‌డ క‌రెంట్ స‌ర‌ఫ‌రా చేయ‌క‌, ఇటీవ‌ల కురిసిన అకాల వ‌ర్షాల కార‌ణంగా రాష్ట్రంలో 20 ల‌క్ష‌ల ఎక‌రాల్లో పంట ఎండిపోయింద‌ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన 100 రోజుల్లో 180 మంది రైతులు ఆత్మ‌హ‌త్య చేసుకున్నార‌ని ఆయ‌న తెలిపారు. రాష్ట్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికైనా క‌ళ్లు తెర‌వాలి. త‌క్ష‌ణ‌మే రెవెన్యూ, వ్య‌వ‌సాయ‌ శాఖ అధికారుల‌కు ఆదేశాలిచ్చి నీటి నిర్వ‌హ‌ణ లోపం వ‌ల్ల గానీ, వ‌డ‌గండ్ల వాన వ‌ల్ల కానీ, క‌రెంట్‌ స‌ర‌ఫ‌రా లోపం వ‌ల్ల గానీ న‌ష్ట‌పోయిన రైతుల వివ‌రాలు సేక‌రించి ఎక‌రానికి రూ. 25 వేలు ఇచ్చి రైతుల‌ను ఆదుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నాం.


యాసంగి వ‌డ్ల‌కు రూ. 500 బోన‌స్ ఇచ్చి కొనాల‌ని డిమాండ్ చేస్తున్నాం. వ‌డ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి, మ‌ద్ద‌తు ధ‌ర క‌ల్పించాలి. రూ. 500 బోన‌స్ ఇచ్చేదాకా కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని వ‌దిలిపెట్టం. క‌లెక్ట‌ర్లు, రెవెన్యూ ఆఫీసుల ముందు ధ‌ర్నా చేస్తాం. ప్ర‌కృతి వైప‌రీత్యాల‌కు, స‌హాయ చ‌ర్య‌ల‌కు ఎన్నికల కోడ్ అడ్డురాదు. త‌క్ష‌ణ‌మే నిర్ణ‌యం తీసుకోవాల‌ని హ‌రీశ్‌రావు డిమాండ్ చేశారు.

Exit mobile version