బీఆర్ఎస్‌కు భారీ షాక్‌.. కాంగ్రెస్ పార్టీలో చేర‌నున్న మ‌రో ఎమ్మెల్యే..!

బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ త‌గిలింది. తాజాగా మ‌రో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధ‌మ‌య్యారు

  • Publish Date - April 19, 2024 / 02:18 PM IST

కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎంపీ రవీంద్రనాయక్‌

విధాత, హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ త‌గిలింది. తాజాగా మ‌రో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధ‌మ‌య్యారు. బీజేపీ నేత, మాజీ ఎంపీ డి. రవీంద్రనాయక్ శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్‌రెడ్డి నివాసంలో జరిగిన కార్యక్రమంలో రవీంద్రనాయక్ కాంగ్రెస్‌లో చేరారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 1978, 1983లో దేవరకొండ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రవీంద్రనాయక్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. 2004లో బీఆరెస్‌లో చేరి వరంగల్ ఎంపీగా గెలిచారు. ఆ తర్వాతా కాంగ్రెస్‌లో తిరిగి చేరాక టీపీసీసీ అధికార ప్రతినిధిగా పనిచేశారు. 2019లో బీజేపీలో చేరారు. 2023అసెంబ్లీ ఎన్నికల్లో ఇల్లందు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.

మరోవైపు బీఆరెస్ రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి. ప్రకాశ్‌గౌడ్ సీఎం రేవంత్‌రెడ్డిని మరోసారి కలిశారు. ఈ సందర్భంగా ప్రకాశ్‌గౌడ్ తాను రేపు శనివారం ముఖ్య అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లుగా రేవంత్‌రెడ్డికి తెలిపారు. గత కొన్ని రోజులుగా రేవంత్‌రెడ్డితో టచ్‌లో ఉన్న ప్రకాశ్‌గౌడ్ కాంగ్రెస్‌లో చేరుతారన్న ప్రచారం వినిపించింది. బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తనతో 20మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారంటూ 24గంటలు గడవకముందే బీఆరెస్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ కారు దిగి హస్తం గూటికి చేరడం విశేషం.

కారు దిగిన మాజీ ఎమ్మెల్యే రాములునాయక్‌

పార్లమెంటు ఎన్నికల ముందు బీఆరెస్‌కు ఆ పార్టీ నేతలు వరుస వలసలతో షాక్ ఇస్తున్నారు. వైరా మాజీ ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ బీఆరెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా లావుడ్యా నాయక్ శుక్రవారం పార్టీ అధినేత. మాజీ సీఎం కేసీఆర్‌కు రాజీనామా లేఖ రాశారు. పార్టీలో తనకు గుర్తింపు లేదంటూ కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న రాములు నాయక్‌ను తాజాగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఖమ్మం బీఆరెస్ అభ్యర్థి నామా నాగేశ్వర్‌రావు, ఎమ్మెల్సీ తాత మధులు బుజ్జగించినప్పటికి వెనక్కి తగ్గకుండా పార్టీకి గుడ్ బై కొట్టారు.

రాములునాయక్ కాంగ్రెస్ నుంచి 2014, 2018ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఆశించినప్పటికి పొత్తులో భాగంగా టికెట్ దక్కలేదు. 2018 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీఆరెస్‌ అభ్యర్థి బానోతు మదన్ లాల్ పై 2013 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2018 డిసెంబర్ 15న బీఆరెస్ పార్టీలో చేరారు. అయితే 2023అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనను కాదని కేసీఆర్ మదన్‌లాల్‌కు టికెట్ ఇవ్వగా కాంగ్రెస్ అభ్యర్థి రాందాసు మాలోత్ చేతిలో ఓడిపోయారు. అనంతరం జరిగిన పరిణామాల్లో అసంతృప్తితో ఉన్న రాములునాయక్ బీఆరెస్‌ను వీడి తిరిగి కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లుగా తెలుస్తుంది

Latest News