Site icon vidhaatha

Patnam Narender Reddy | BRS ఎమ్మెల్యే ప‌ట్నం న‌రేందర్ రెడ్డిపై కేసు న‌మోదు

Patnam Narender Reddy | బీఆర్ఎస్ కొడంగ‌ల్ ఎమ్మెల్యే ప‌ట్నం న‌రేంద‌ర్ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీసు స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది. సామ ఇంద్ర‌పాల్ రెడ్డి ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేశారు.

2018లో రాజేంద్ర న‌గ‌ర్ ప‌రిధిలోని ఉప్ప‌ర్‌ప‌ల్లిలో ఓ స్థ‌లాన్ని కొనేందుకు ఇంద్ర‌పాల్ రెడ్డి ప్ర‌య‌త్నించారు. అయితే ఆ స్థ‌లం కొనుగోలు విష‌యంలో మ‌ధ్య‌వ‌ర్తులుగా ఉన్న ప‌ట్నం న‌రేంద‌ర్ రెడ్డి, రాకేశ్ రెడ్డి.. ఇంద్ర‌పాల్ రెడ్డికి ప‌రిచ‌య‌మ‌య్యారు.

ఇదే స‌మ‌యంలో శ్రీరామ్ రెడ్డి అనే మ‌రో వ్య‌క్తిని ఇంద్రపాల్ రెడ్డికి న‌రేంద‌ర్, రాకేశ్ క‌లిసి ప‌రిచ‌యం చేశారు. అయితే స్థ‌లం, క‌మీష‌న్‌తో క‌లిసి మొత్తం రూ. 3.65 కోట్ల‌కు భూమి అమ్ముతున్న‌ట్లు తెలిపారు. ఈ విష‌యంలో క‌మీష‌న్ ఇచ్చేందుకు కూడా ఇంద్ర‌పాల్ అంగీక‌రించాడు.

వారు అమ్ముతున్న స్థ‌లానికి 2018, మే 24న రూ. 90 ల‌క్ష‌లు చెల్లించాడు. త‌ర్వాత విడ‌త‌ల వారీగా రూ. 3.05 కోట్లు చెల్లించాడు. ఇంకా రూ. 60 ల‌క్ష‌ల బ్యాలెన్స్ మిగిలి ఉంది. ఇది చెల్లించేందుకు లోన్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్నాన‌ని, అది రాగానే రూ. 60 ల‌క్ష‌లు చెల్లిస్తాన‌ని ఇంద్ర‌పాల్ చెప్పాడు.

న‌గ‌దు చెల్లించ‌డంలో ఆల‌స్యం అవుతున్న నేప‌థ్యంలో ఎమ్మెల్యే న‌రేంద‌ర్ రెడ్డి మ‌న‌షులు ఇంద్ర‌పాల్ ను బెదిరింపుల‌కు గురి చేశారు. అంతేకాకుండా త‌న‌ను ఓ గ‌దిలో నిర్బంధించి చిత్ర హింస‌ల‌కు గురి చేసిన‌ట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఎమ్మెల్యే అనుచ‌రుల నుంచి త‌ప్పించుకున్న ఇంద్ర‌పాల్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

అయితే పోలీసులు కేసు న‌మోదు చేయ‌క‌పోవ‌డంతో కోర్టును ఆశ్ర‌యించాడు. కోర్టు ఆదేశాల మేర‌కు బంజారాహిల్స్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఈ ఘ‌ట‌న ఫిల్మ్ న‌గ‌ర్‌లో ప‌రిధిలో జ‌రిగిన దృష్ట్యా అనంత‌రం కేసును ఫిల్మ్ న‌గ‌ర్ పోలీసుల‌కు బ‌దిలీ చేశారు. పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version