Hyderabad | హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్‌లో స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ముగ్గురు నిర్వాహకులు, 10 మంది యువతులను నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 10లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నేచురల్ హెల్త్ త్రూ ఆయుర్వేద పేరుతో కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. అయితే అక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు పక్కా సమాచారం అందింది.
ఆదివారం రాత్రి దాడులు నిర్వహించి.. నిర్వాహకులైన శృతి, రమణ, జహీద్ ఉల్ హక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన 10 మంది యువతులను అదుపులోకి తీసుకుని రెస్క్యూ హోంకు తరలించారు. ముగ్గురిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఎవరీ శృతి..?
ఈ వ్యభిచార దందాకు ప్రధాన కర్త శృతి అని పోలీసుల విచారణలో తేలింది. భద్రాచలం పట్టణానికి చెందిన శృతి.. డాక్టర్ కావాలనుకుంది. దీంతో ఉక్రెయిన్‌లో మెడిసిన్ సీటు సంపాదించింది. మొదటి సంవత్సరం పూర్తి చేసింది. రెండో ఏడాది ఫీజు చెల్లించలేక.. తిరిగి భద్రాచలం వచ్చింది. ఎయిర్ హోస్టేస్‌గా స్థిరపడాలనుకున్న ఆమె.. అమీర్‌పేటలోని ఓ కేంద్రంలో శిక్షణ కూడా తీసుకుంది.
అదే సమయంలో బంజారాహిల్స్‌లోని ఓ స్టార్ హోటల్‌లో రిసెప్షనిస్ట్‌గా చేరింది. డాక్టర్, ఎయిర్ హోస్టేస్ కావాలనుకున్న కలలు నెరవేరలేదు. డబ్బు కూడా సరిపోవడం లేదు. దీంతో ఎలాగైనా డబ్బు తేలికగా సంపాదించాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే గతంలో పంజాగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో ఓ మసాజ్ సెంటర్ ప్రారంభించింది.
అమ్మాయిలను రప్పించి క్రాస్ మసాజ్ వ్యభిచారం చేయిస్తూ డబ్బులు సంపాదించింది. శృతి వ్యభిచార దందా పంజాగుట్ట పోలీసులకు తెలియడంతో, దాడులు నిర్వహించి ఆమెను అరెస్టు చేశారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆమెలో మార్పు రాలేదు. మళ్లీ రోడ్డు నంబర్ 10లో స్పా సెంటర్ ముసుగులో వ్యభిచార దందాకు తెరలేపింది. దీంతో రెండోసారి పోలీసులకు దొరికిపోయిందామె. మళ్లీ ఆమెతో పాటు మరో ఇద్దరిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు.