- 50 మంది బందీలను విడిచిపెట్టనున్న హమాస్
- ప్రతిగా జైలు నుంచి విడుదల కానున్న 150 మంది పాలస్తీనియన్లు
విధాత: ఇజ్రాయెల్ – హమాస్ సంక్షోభం (Israel Hamas Conflict) లో కీలక పరిణామం చోటు చేసుకుంది. హమాస్ ఉగ్రవాదుల వద్ద బందీలుగా ఉన్న 50 మందిని విడుదల చేయడానికి హమాస్ ఉగ్రవాదులు ఒప్పుకొన్నారు. దీనికి బదులుగా ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న 150 మంది పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ విడుదల చేయాల్సి ఉంటుంది. దీనికి అనుగుణంగా ప్రస్తుతం ఇరు వర్గాల మధ్య స్వల్ప కాల కాల్పుల విరామం కొనసాగుతోంది.
అయితే ఈ ఒప్పందం ఇజ్రాయెల్ సంకీర్ణ ప్రభుత్వాన్ని బీటలు వార్చే ప్రమాదముంది. పూర్తి జాతీయవాదాన్ని అవలంబించే పార్టీలు ఈ ఒప్పందాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. పాలస్తీనియన్లను విడుదల చేయాలంటే కేబినెట్ ఓటింగ్ కీలకం కావడంతో దానిని సాధించడం నెతన్యాహుకు కత్తి మీద సాములా మారే ప్రమాదముంది. ఈ నిర్ణయానికి ఓటు వేసేదే లేదని జాతీయ భద్రతా మంత్రి ఇతామర్ బెన్ గ్విర్ స్పష్టం చేశారు.
ఈ ఒప్పందం ఇజ్రాయెల్ సైనికుల త్యాగాన్ని వమ్ము చేయడమేనని అభిప్రాయపడ్డారు. మరోవైపు ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని వివిధ దేశాలు ఆహ్వానించాయి. ఒప్పందానికి వచ్చినందుకు హమాస్, ఇజ్రాయెల్‌లను అభినందించిన అమెరికా అధ్యక్షుడు బైడెన్… ఇందులో కీలక పాత్ర పోషించిన ఖతార్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. బందీలు విడుదలకు తాను, తన భార్య జిల్ బైడెన్ ఎంతగానో ప్రార్థించామని.. ఇప్పుడు అది నెరవేరుతుందని నమ్మకం కలిగిందని పేర్కొన్నారు.
అక్టోబరు 7 తర్వాత తొలిసారి రెడ్ క్రాస్ సంస్థ గాజాలో తన కార్యకలాపాలు నిర్వహిస్తోందని.. ఇందుకు సంతోషంగా ఉన్నానని యూఎస్ సెనేట్ నాయకుడు చక్ షూమర్ పేర్కొన్నారు. రష్యా, ఫ్రాన్స్ దేశాలు సైతం ఈ ఒప్పందాన్ని ఆహ్వానించాయి. మరోవైపు గత నెల రోజులుగా సాగుతున్న దాడుల వల్ల గాజా, ఇజ్రాయెల్‌లో భారీ ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించిన విషయం తెలిసిందే. ఆసుపత్రులు కిక్కిరిసిపోయి ఉండటంతో వైద్యం ఆలస్యమవుతోంది. ఈ నేపథ్యంలో ఎక్స్ ద్వారా వచ్చే ప్రకటనలు, సబ్‌స్క్రిప్షన్‌ల ద్వారా వచ్చే లాభాలను గాజా, ఇజ్రాయెల్‌లో ఉన్న ఆసుపత్రులకు విరాళంగా ఇస్తానని ఎలాన్ మస్క్ ప్రకటించారు.