Site icon vidhaatha

Chiranjeevi | రాజకీయాల్లోకి చిరంజీవి రీఎంట్రీ..?

Chiranjeevi |

చిరంజీవి రాజకీయాల్లోకి వస్తున్నారా..? చిరంజీవి కామెంట్లు వెనుకున్న కోణం చూస్తుంటే ఇలాగే అనిపిస్తోందనేది కొందరి అనుమానం. 2014 తర్వాత చిరంజీవి రాజకీయాలకు రామ్ రామ్‌ చెప్పేశారు. సినిమాల్లో బిజీ అయ్యారు. తమ్ముడు రాజకీయాల్లో యాక్టీవ్‌గా ఉన్నా.. తమ్ముడు రాజకీయంతో తనకేం సంబంధం లేదన్నట్టుగానే చిరంజీవి వ్యవహరించారు.

ఇక 2019 తర్వాత పవన్‌ను జగన్‌.. వైసీపీ నేతలు ఎన్నెన్ని మాటలు అంటున్నా సైలెంటుగానే ఉన్నారు చిరు. అంతే కాకుండా.. జగన్‌కు అత్యంత ఆప్తునిగా మెలిగారు కూడా. ఒకానోక దశలో సినీ ఇండస్ట్రీకి.. జగన్‌ ప్రభుత్వానికి ఉన్న గ్యాప్‌ తగ్గించే బాధ్యతలను కూడా చిరంజీవి తన భుజ స్కంధాల మీద వేసుకున్నారు. అన్న మంచొడు.. తమ్ముడు దుర్మార్గుడు అనే రీతిలో వైసీపీ నేతలు ఎన్ని కామెంట్లు చేసినా చిరంజీవి సైలెంటుగానే ఉన్నారు.

అలాంటిది ఇప్పుడెందుకో చిరంజీవికి కోపం వచ్చింది. ఈ కోపం తన తమ్ముడిని అంటున్నందుకా..? లేక పవన్‌ కళ్యాణ్‌ను అడ్డం పెట్టుకుని అంబటి రాంబాబు మొత్తంగా ఇండస్ట్రీకే వార్నింగ్‌ ఇచ్చినందుకా..? అనేది క్లారిటీ రావడం లేదు. అయితే చిరంజీవి తిరిగి రాజకీయ అరంగేట్రం చేయడానికి గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేసుకుంటున్నారనే అభిప్రాయం కలగడానికి కారణం లేకపోలేదు.

తన చిన్న అన్న పార్టీలో చేరినట్టే.. పెద్దన్న చిరంజీవిని కూడా పార్టీలోకి ఆహ్వానిస్తానని పవన్‌ ఎవరి దగ్గరో ప్రస్తావించారనేది ఇటీవల కాలంలో ప్రచారంలోకి వచ్చింది. గతంలో జరిగిన పరిణామాలన్నీ బేరీజు వేసుకుని.. ఇది జరిగేది కాదులే అనుకున్నా. అయితే భోళా శంకర్‌ సినిమా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌.. ఆ తర్వాత జరిగిన వాల్తేరు వీరయ్య 200 రోజుల సెలబ్రేషన్స్‌లో జరిగిన పరిణామాలను విశ్లేషిస్తే ఎందుకో చిరంజీవి అడుగులు రాజకీయం వైపు పడుతున్నాయా..? అనే అనుమానాలు మొలకెత్తుతున్నాయి.

భోళాశంకర్‌ ప్రి రిలీజ్‌ ఫంక్షన్‌లో హైపర్‌ ఆది కామెంట్లను మామూలుగా తీసుకోవడానికి లేదనే చెప్పాలేమో? తమ్ముడిని విమర్శిస్తే అన్నకు బాధ ఉండదా..? అంటూ హైపర్‌ ఆది చేసిన ప్రసంగానికి వీర లెవల్లో అప్రిసియేషన్‌ వచ్చింది. ఇది డైరెక్టుగా కాకున్నా.. హైపర్‌ ఆది పరోక్షంగా రాజకీయ ప్రస్తావన తెచ్చినట్టే. ఆ తర్వాత చిరంజీవి ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి సంచలన కామెంట్లు చేశారు.

ఈ రెండింటిని లింకెట్టి చూస్తే చిరంజీవి మరోసారి పొలిటికల్‌ స్క్రీన్‌ మీదకు రాబోతున్నారేమోనని గట్టిగానే అనిపిస్తోంది. భోళా శంకర్‌ ప్రి రీలిజ్‌ ఫంక్షన్‌లో హైపర్‌ ఆది ఏదో ఆషామాషీ గానో.. ఆవేశంతోనే ఆ కామెంట్లు చేశాడనుకోవడానికి లేదు. చిరంజీవి, పవన్‌ సూచనల మేరకు పక్కా స్క్రిప్ట్‌ ప్రకారం.. ప్రీ-ప్లాన్డుగానే ఆది భోళా శంకర్‌ వేదికను వాడుకున్నారేమోననిపిస్తోంది.

దీనికి కంటిన్యూగా చిరంజీవి కామెంట్లు చేశారు. అది కూడా ఎలాంటి కామెంట్లంటే.. రాష్ట్రంలో ఉన్న హాట్‌ టాపిక్స్‌ అన్నింటినీ రెండు మూడు లైన్లల్లో ప్రస్తావించేశారు. ప్రత్యేక హోదా అన్నారు.. ప్రాజెక్టులు అన్నారు.. ఉద్యోగాలివ్వాలన్నారు.. సంక్షేమం చేయాలన్నారు.. ఇలా చాలా అంశాలను లైట్‌గా టచ్‌ చేసేశారు.

ముందుగా అనుకోకపోతే ఈ స్థాయిలో పండించ లేరనే చెప్పొచ్చు. ఈ రెండు ఫంక్షన్‌లను లింక్‌ చేసి చూస్తే.. చిరంజీవి పొలిటికల్‌ జంక్షన్‌లోకి వస్తున్నారని అనిపిస్తోంది. ఇదే జరిగితే.. ఏపీలో మరిన్ని ఆశ్చర్యకరమైన పొలిటికల్‌ డెవలప్మెంట్స్‌ జరిగే అవకాశాలు ఉంటాయి. ఇది నిజమా..? లేదా..? అనేది కాలమే చెప్పాలి.

Exit mobile version