Rangareddy |
విధాత: మూడు నెలల పసికందుకు ఉరేసి.. అనంతరం దంపతులిద్దరూ కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం (Chevella Mandal)లోని దేవరపల్లిలో మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. దేవరపల్లికి చెందిన అశోక్ (30)కు ఆలూరు గ్రామానికి చెందిన అంకిత (20)తో ఏడాదిన్నర క్రితం పెళ్లి అయింది. మూడు నెలల క్రితమే అంకిత పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
అశోక్ సోదరి నిశ్చితార్థం నిమిత్తం అంకిత తన బిడ్డను తీసుకొని దేవరపల్లికి గురువారం వచ్చింది. ఇక అశోక్ తన తమ్ముడితో కలిసి సోమవారం రాత్రి ఆటో తీసుకొని కూరగాయలకు వెళ్లాడు. మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు ఇంటికి చేరుకున్నారు.
ఇంట్లోకి వెళ్లిన అశోక్.. టీవీ సౌండ్ బాగా పెంచి, తన బిడ్డకు ఉరేశాడు. అనంతరం దంపతులిద్దరూ కూడా ఇంట్లోనే ఉరేసుకున్నారు. టీవీ సౌండ్ ఎంతసేపటికి తగ్గించకపోవడంతో స్థానికులకు మెలకువ వచ్చింది. డోర్ కొట్టగా అశోక్ తలుపులు తెరవలేదు. దీంతో స్థానికులు తలుపులు విరగ్గొట్టి లోపలికి వెళ్లి చూడగా ముగ్గురు చనిపోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.