Dharani Portal | విదేశీ కంపెనీల చేతిలో ధరణి!

Dharani Portal పోర్ట‌ల్‌ను నిర్వహణ టెర్రాసిస్ టెక్నాల‌జీస్ టెర్రాసిస్‌ను టేకోవ‌ర్ చేసిన ఫిలిప్పిన్ కంపెనీ తెలంగాణ డాటా విదేశీ కంపెనీల చేతుల్లోకి భూ యజమానుల్లో తీవ్ర ఆందోళనలు విధాత‌: తెలంగాణ‌లో భూ రికార్డుల స‌మీకృత‌ నిర్వ‌హ‌ణ కోసం రూపొందించిందే ధ‌ర‌ణి పోర్ట‌ల్ నిర్వ‌హ‌ణ విదేశీ కంపెనీల చేతుల్లోకి వెళ్ల‌డంపై ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఇప్ప‌టికే ఈ విష‌యంపై బీజేపీ, కాంగ్రెస్ నేత‌లు అనుమానాలు లేవ‌నెత్తారు. తెలంగాణ ప్ర‌భుత్వం రెవెన్యూ శాఖ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ధ‌ర‌ణి పోర్ట‌ల్‌ను ప్ర‌స్తుతం టెర్రాసిస్ టెక్నాలజీస్ […]

  • Publish Date - July 8, 2023 / 01:25 AM IST

Dharani Portal

  • పోర్ట‌ల్‌ను నిర్వహణ టెర్రాసిస్ టెక్నాల‌జీస్
  • టెర్రాసిస్‌ను టేకోవ‌ర్ చేసిన ఫిలిప్పిన్ కంపెనీ
  • తెలంగాణ డాటా విదేశీ కంపెనీల చేతుల్లోకి
  • భూ యజమానుల్లో తీవ్ర ఆందోళనలు

విధాత‌: తెలంగాణ‌లో భూ రికార్డుల స‌మీకృత‌ నిర్వ‌హ‌ణ కోసం రూపొందించిందే ధ‌ర‌ణి పోర్ట‌ల్ నిర్వ‌హ‌ణ విదేశీ కంపెనీల చేతుల్లోకి వెళ్ల‌డంపై ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఇప్ప‌టికే ఈ విష‌యంపై బీజేపీ, కాంగ్రెస్ నేత‌లు అనుమానాలు లేవ‌నెత్తారు. తెలంగాణ ప్ర‌భుత్వం రెవెన్యూ శాఖ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ధ‌ర‌ణి పోర్ట‌ల్‌ను ప్ర‌స్తుతం టెర్రాసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్ (టెర్రాసిస్) అనే కంపెనీ చూస్తోంది. కానీ ఇటీవ‌ల కాలంలో ధ‌ర‌ణి నిర్వ‌హ‌ణ‌, లోపాల‌పై పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ధ‌ర‌ణి పోర్టల్‌ను నిర్వహిస్తున్న తీరుపై అనేక ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ పోర్ట‌ల్ ద్వారా తెలంగాణ‌లో భూముల అమ్మ‌కాలు, కొనుగోళ్లు పేరుతో వేల కోట్ల‌ రూపాయ‌ల లావాదేవీలు జ‌రుగుతున్నాయి.

కానీ ఈ పోర్ట‌ల్ ద్వారా జ‌రిగే రిజిస్ట్రేష‌న్ల స‌మ‌యంలో న‌గ‌దు చెల్లింపులలో జాప్యాలు, ట్రాన్జాక్షన్‌ ఫెయిల్ అయితే తిరిగి ఖాతాదారునికి న‌గ‌దు జ‌మ చేయ‌డంలో మితిమీరిన కాల‌యాప‌న జ‌రుగుతోంద‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. కొన్నిసార్లు అస‌లు తిరిగి చెల్లింపే జ‌ర‌గ‌డం లేద‌నీ అంటున్నారు. ధ‌ర‌ణి పోర్ట‌ల్‌ను విదేశీ సంస్థ నిర్వ‌హిస్తుండ‌టంతో దాని పార‌ద‌ర్శ‌క‌త‌పై ప‌లు అనుమానాలు రేకెత్తుతున్నాయి. తెలంగాణ ప్ర‌జ‌ల సున్నిత‌మైన డాటాను విదేశీ కంపెనీ నియంత్ర‌ణ‌లోని టెర్రాసిస్ చేతిలో పెట్ట‌డంపై ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

టెర్రాసిస్ ఎలా విదేశీ కంపెనీ నియంత్ర‌ణ‌లోకి వెళ్లింది…

టెర్రాసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్‌ని గతంలో ఐఎల్ అండ్ ఎఫ్ ఎస్ (IL&FS) టెక్నాలజీస్ లిమిటెడ్‌గా పిలిచేవారు. కానీ ఇది దివాలా తీయ‌డంతో ఎస్‌జి ఫాల్క‌న్ హోల్డింగ్స్ అనే ఫిలిప్పీన్స్‌ కంపెనీ టేకోవ‌ర్ చేసింది. ప్ర‌స్తుతం ఈ ఎస్‌జీ హోల్డింగ్స్‌కు టెర్రాసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్‌లో దాదాపు 99 శాతం వాటా ఉంది. ఫాల్కన్ ఎస్‌జీ హోల్డింగ్స్ సింగపూర్‌లో ఉన్న ఫాల్కన్ ఇన్వెస్ట్‌మెంట్స్ పీటీఈ అనే కంపెనీ యాజ‌మాన్యంలోనిది. సింగపూర్‌ అకౌంటింగ్, కార్పొరేట్ రెగ్యులేటరీ అథారిటీ (ACRA) సమాచారం ప్రకారం, ఫాల్కన్ ఇన్వెస్ట్‌మెంట్స్ పీటీఈ మ‌రో ఐదు విదేశీ సంస్థ‌ల నియంత్ర‌ణ‌లో ఉంది.

అంటే టెర్రాసిస్ టెక్నాల‌జీస్ లిమిడెట్ చేతిలో ఉన్న తెలంగాణ డాటా…. స్పారో ఇన్వెస్ట్‌మెంట్స్ పీటీఈ లిమిటెడ్‌, సింగపూర్ (గుర్తింపు సంఖ్య: 201804988W), జీడ‌బ్ల్యూ ఎస్‌కేవై పీటీఈ లిమిటెడ్‌ (GW SKY PTE. LTD), సింగపూర్ (గుర్తింపు సంఖ్య: 201906424C), హిల్ బ్రూక్స్ ఇన్వెస్ట్‌మెంట్ లిమిటెడ్, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ (గుర్తింపు సంఖ్య: T19UF6985B), పారాడిజియం( PARADIGM ) ఇన్నోవేషన్స్ ఎల్ఎల్‌సీ యూఎస్ఏ (గుర్తింపు సంఖ్య: T15UF6591F), క్వెంటెల్లా ఐఎన్‌సీ (Quentela INC), యూఎస్ఏ (గుర్తింపు సంఖ్య: T21UF7688D) కంపెనీల చేతుల్లోకి వెళ్లింది.

పై ఐదు కంపెనీల‌ను పూర్తిగా విదేశీయులే నిర్వ‌హిస్తున్నారు. స్పారో ఇన్వెస్టిమెంట్స్ కంపెనీ టెర్రాసిస్‌కు గేట్‌వే కంపెనీ అయితే, స్పారోకు, జీ డ‌బ్ల్యూ ఎస్‌కే వై కంపెనీకి కూడా కేమాన్ ఐలాండ్స్, (గుర్తింపు సంఖ్య T20UF4830D) అనే కంపెనీ భాగ‌స్వామిగా ఉంది.

హిల్ బ్రూక్స్ ఇన్వెస్ట్‌మెంట్ లిమిటెడ్ కంపెనీ బ్రిటీష్ వర్జిన్ ఐలాండ్స్‌కు చెందిన‌ది. కానీ పారాడిజియం, క్వెంటెల్లా ఐఎన్‌సీ కంపెనీల‌ను ఎవ‌రు నియంత్రిస్తున్నారో అన్న స‌మాచారం ఎక్క‌డా దొర‌క‌డం లేదు. ఇక్క‌డే ప‌లువురికి ధ‌రిణి డాటా భ‌ద్ర‌త‌పై బ‌ల‌మైన అనుమానాలు, ఆందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ధ‌ర‌ణి పోర్ట‌ల్ భాగస్వామ్య కంపెనీల చ‌రిత్ర‌ ఇది…!

పైన చెప్పుకొన్న విదేశీ కంపెనీలు పన్నుల‌కు స్వర్గధామంగా పిలువబడే అధికార పరిధిలో ఉన్నాయి. దీని బ‌ట్టి ధ‌ర‌ణి పోర్ట‌ల్ వాస్త‌వ నిర్వ‌హ‌ణ విదేశీ సంస్థకు చెందినట్లు అనుమానాలు వ‌స్తున్నాయి. ధ‌ర‌ణి పోర్ట‌ల్ నిర్వ‌హ‌ణ‌కు ఇంత భారీ మొత్తంలో డబ్బును అందుకుంటున్న సంస్థను విదేశీ సంస్థ నియంత్రించ‌డం ఏమిటో అనే ప్ర‌శ్న తలెత్తుతోంది. ఈ కంపెనీల్లో క్రాస్ ఫండింగ్, క్రాస్ ట్రాన్సాక్షన్స్ మొదలైనవి ఉన్నాయని షేర్ హోల్డింగ్ విధానంలో అర్థ‌మ‌వుతుంది.దీని కారణంగా ఈ కంపెనీలను లేయరింగ్, ప్రొజెక్టింగ్ ఫండ్స్‌కు ఎంటిటీలుగా ఉపయోగించవచ్చనే అనుమానం మేధావుల్లో సైతం వ్య‌క్త‌మ‌వుతోంది.

ఇటీవ‌ల‌కాలంలో ధ‌ర‌ణి ట్రాన్జాక్షన్‌లకు సంబంధించి రిఫండ్‌లు మొదలైనవాటిలో జాప్యం ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ పోర్ట‌ల్‌లో ఒక‌సారి ట్రాన్జాక్షన్‌ ఫీజు క‌ట్టి, లావాదేవీ పూర్త‌య్యే లోపు అది ఫెయిలైతే, మ‌ళ్లీ యూజ‌ర్ చార్జీలు చెల్లించాల్సి వస్తున్నది. ఇలా ఆ కంపెనీల‌కు ప్రజలు అప్ప‌నంగా సొమ్ము జ‌మ‌చేస్తున్న‌ట్లు ఆర్థిక నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ట్రాన్జాక్షన్‌ ఫెయిలైతే న‌గ‌దును తిరిగి ఇవ్వ‌డానికి చాలా రోజుల స‌మ‌యం ప‌డుతోంది. ఇలా వేల కోట్ల రూపాయ‌లు ఆ సంస్థ‌ల‌కు వ‌డ్డీరూపంలో మిగులుతోంది. ఇలా ఆ కంపెనీలు రెండు చేతులా సంపాదించుకుంటున్నాయ‌ని, ఈ అన్యాయంపై నియంత్రణ సంస్థల లోతైన విచారణ చేయాల్సిన అవసరం ఉంద‌నే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

ఇలాంటి కంపెనీల చేతుల్లో తెలంగాణ పౌరుల‌కు సంబంధించిన భూమి వివ‌రాల‌తో పాటు, వివిధ వ్యక్తిగత వివరాలకు రిపోజిటరీగా ఉన్నందున, విదేశీ నియంత్రణ సంస్థలు ఆ డాటాను ఏ ఉద్దేశాలకు వాడుకుంటున్నాయో అన్న దానిపై స‌మ‌గ్ర ద‌ర్యాప్తు చేయాల‌న్న డిమాండ్ సైతం రాజ‌కీయ పార్టీల నుంచి వ‌స్తోంది.

టెర్రాసిస్ డైర‌క్ట‌ర్‌గా శ్రీ‌ధ‌ర్‌రాజుపై రేవంత్‌రెడ్డి ఆరోప‌ణ‌లు

ధరణి పోర్టల్‌ను నడుపుతున్న టెర్రాసిస్ టెక్నాల‌జీస్‌కు గాదె శ్రీధర్ రాజు, కార్తీక్ కృష్ణన్, ఆశిష్ శుక్లా, వీయాంగ్ మార్క్ లిమ్, మెయి మెయి మిచెల్ లీలు బోర్డు డైర‌క్ట‌ర్లుగా నియ‌మితుల‌య్యారు. గాదె శ్రీ‌ధ‌ర్ రాజు కేటీఆర్ స్నేహితుడ‌ని, ఆయ‌న ఆధ్వ‌ర్యంలో ధ‌ర‌ణి పోర్ట‌ల్‌ను కొన్ని ప్రాంతాల్లో రాత్రిపూట మాత్ర‌మే ఓపెన్ అయ్యేలా చేసి రిజిస్ట్రేష‌న్లు చేయించుకుంటున్నార‌ని టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ‌లో ధ‌ర‌ణి స‌మ‌స్య రాజ‌కీయ ఎజెండాగ మారిన నేప‌థ్యంలో దీని నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌ల‌ను విదేశీ కంపెనీల‌కు ఇవ్వ‌డంపై కూడా రాజ‌కీయ ర‌చ్చకు దారితీస్తోంది.

ధ‌ర‌ణిపై ఆదినుంచి వివాదాలే…

ఎంతో ప‌కడ్బందీగా రూపొందించిన‌ట్లు చెప్పుకున్న ధ‌ర‌ణి పోర్ట‌ల్ ఆది నుంచీ వివాదాస్ప‌దంగా మారింది. తాము అధికారంలోకి వ‌స్తే ధ‌ర‌ణిని ర‌ద్దు చేస్తామ‌ని బీజేపీ నేత‌లు చెబుతుంటే, కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు ధ‌ర‌ణి ని ర‌ద్దు చేసి, ప్ర‌భుత్వ పూర్తి నిర్వ‌హ‌ణ‌లో ఉండే విధంగా, ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండే విధంగా నూత‌న సాఫ్ట్‌వేర్ తీసుకువ‌స్తామ‌ని అంటున్నారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ధ‌ర‌ణి పోర్ట‌ల్ ఒక రాజ‌కీయ అజెండా అయిపోయింది. తెలంగాణ ధరణి పోర్టల్ మూడు సంవత్సరాల ప‌నితీరును దీని రూప‌క‌ల్ప‌న‌లో ప్ర‌ధాన భూమిక పోషించిన నాటి ప్ర‌భుత్వ‌ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఎంతో మెచ్చుకుంటున్నారు. ఆయ‌న వివరాల ప్రకారం, ధరణి వెబ్ పోర్టల్ 5.14 కోట్ల హిట్‌లు న‌మోదు చేసుకోవ‌డ‌మేకాదు, ఏడాదిలోనే 10 లక్షల లావాదేవీలను విజ‌య‌వంతంగా పూర్తి చేసింద‌ని చెప్పారు.

“ధరణికి అనేక సమస్యలు ఉన్నాయి. ప్రజల భూమిని గుర్తించడానికి గ్రామ మ్యాప్‌ల వంటి అనేక సమయ పరీక్షా పద్ధతులను ప్రభుత్వం క్రమపద్ధతిలో రద్దు చేసింది. ధరణి పోర్టల్‌లో 24 లక్షల ఎకరాల అసైన్డ్ భూమికి ఎంట్రీలు లేవు, ఇదంతా పేద ప్రజలకు ఇచ్చిన భూమి.

ఈ పోర్టల్‌ను నడుపుతున్న కంపెనీ విదేశీ చేతుల్లోకి వెళ్లడంతో, పేదలు కష్టపడి సంపాదించిన భూమిని కోల్పోయే ప్రమాదం ఉంది” అని అప్ప‌ట్లో ప‌లువురు ఆందోళ‌న‌లు కూడా వ్య‌క్తం చేశారు. విదేశీయులు నిర్వహిస్తున్న ధరణి పోర్టల్‌ను కొంత‌మంది త‌మ స్వార్థం కోసం ఉప‌యోగించుకుని బినామీలకు, ప్రైవేట్ కంపెనీలకు భూములపై హ‌క్కును క‌ల్పించార‌నే ఆరోప‌ణ‌లు కూడా వినిపించాయి.

Latest News