టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆయన డిస్ట్రిబ్యూటర్‌గా సినీ రంగంలోకి అడుగుపెట్టి ఇప్పుడు టాలీవుడ్ బడా నిర్మాతగా ఎదిగారు. ఆయన ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్నాడు. అయితే తాజాగా దిల్ రాజు కూతురు హర్షిత రెడ్డి భర్త అర్చిత్ రెడ్డి కారు చోరీకి గురి కావడం హాట్ టాపిక్‌గా మారింది. కోటిన్నర విలువ చేసే ఈ కారు దొంగతనానికి గురి కావడంతో అర్చిత్ రెడ్డి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గంటల వ్యవధిలోనే కారును దొంగలించిన వ్యక్తిని పట్టుకున్నారు. అర్చిత్ రెడ్డి కారు పోర్షే కారు కాగా,దీని ధర సుమారు 1.7 కోట్లు ఉంటుందని తెలుస్తుంది.
వివరాలలోకి వెళితే శుక్రవారం ఉదయం అర్చిత్ రెడ్డి హైదరాబాద్ లోని దసపల్లా హోటల్‌కు వెళ్లారు. అక్కడ ఆయన తన కారును బయటనే పార్కింగ్ చేసి అరగంట తర్వాత బయటకు వచ్చారు. తన కారు కోసం చూడగా, ఎక్కడ కనిపించలేదు. వెంటనే ఆయన జూబ్లిహిల్స్ పోలీసులని ఆశ్రయించారు. వారు ట్రాఫిక్ పోలీసులని అలెర్ట్ చేసి సీసీ కెమెరాల ఆధారంగా కనిపెట్టారు. కారు దొంగిలిచిన వ్యక్తి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర సిగ్నల్ దాటడంతో వెంటనే కేబీఆర్ పార్క్ సిగ్నల్ దగ్గర ఉన్న పోలీసులను అలర్ట్ చేయడంతో వారు దొంగని పట్టుకున్నారు. దొంగతనం చేసిన వ్యక్తి మన్సూరాబాద్ ప్రాంతానికి చెందిన మల్లెల సాయికిరణ్‌గా గుర్తించారు పోలీసులు.
దొంగతనం చేసిన వ్యక్తిని విచారించగా, అతను చెప్పిన కారణం విని పోలీసులతో పాటు అందరు షాక్ అవుతున్నారు. తనను మంత్రి కేటీఆర్ ఈ కారు తీసుకురమ్మన్నారు అని అందుకే తీసుకు వెళ్తున్నా అని ఆయన చెప్పడం అందరిని ఆశ్చర్యపరచింది. తాను ఆకాష్ అంబానీకి సహాయకుడిని అని చెప్పిన అతను అర్జెంట్ గా హృతిక్ రోషన్ ను కలవాలి నేను వెళ్ళాలి వదిలేయండి అంటూ పోలీసులకు చెప్పడంతో వారు షాక్ అయ్యారు. అయితే వ్యక్తి ప్రవర్తన చూసి పోలీసులు అతని కుటుంబ సభ్యులకు ఫోన్ చేయగా అతడికి మతిస్థిమితం సరిగ్గా లేదని.. చికిత్స తీసుకుంటున్నాడని చెప్పుకొచ్చారు. అతడికి బ్రైట్ లైఫ్ ఫౌండేషన్ సంస్థలో చికిత్స చేయించినట్లుగా కూడా తెలపడంతో, విచారణలో అది నిజమే అని తేలడంతో పోలీసులు కారు స్వాధీనం చేసుకొని వదిలేసినట్టు తెలుస్తుంది.