Site icon vidhaatha

Nalgonda: గొర్రెల పెంప‌కంతో ఆర్థికాభివృద్ధి సాధ్యం: మంత్రి జగదీష్ రెడ్డి

విధాత: సీఎం కేసీఆర్ గొల్ల కురుమల అభివృద్ధిని కాంక్షిస్తూ అమలు చేస్తున్న గొర్రెల పంపిణీ పథకం వారి ఆర్థికాభివృద్ధి సాధనకు ఉపయోగపడుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అభిప్రాయపడ్డారు. శుక్రవారం సాయంత్రం సూర్యపేట నియోజకవర్గంలో తుంగతుర్తి, భువనగిరి శాసనసభ్యులు గాధరి కిశోర్ కుమార్, పైళ్ల శేఖర్ రెడ్డిలతో కలిసి పర్యటిస్తున్న క్రమంలో చివ్వెంల మండలం ఐలాపురం వద్ద రోడ్డు దాటుతున్న గొర్రెల మందను చూసి మంత్రి తన కాన్వాయ్‌ని అపారు.

కారు దిగి గొర్రె పిల్లలను చేతిలోకి తీసుకుని గొర్రెల కాపరితో ముచ్చటించారు. అనుకోకుండా మంత్రి తారసపడి గొర్రెల పోషణ వివరాలను ఆరా తీయడంతో గొర్రెల కాపరి అవాక్కయ్యారు. మంత్రి జగదీష్ రెడ్డి గొర్రె పిల్లలను చేతిలోకి తీసుకొని గొర్రెలలో రకాలు, వాటి పెంపకం విధానం చెబుతుంటే అచ్చెరువొందడం సదరు గొర్రెల కాపరి వంతైంది.

వ్యవసాయమన్నా, ఆవులు, గేదెలు, గొర్రెల పెంపకమన్నా అమితంగా ఇష్టపడే మంత్రి జగదీష్‌రెడ్డి గొర్రెల పెంపకంలో మెళకువలు చెబుతుంటే గొర్రెల కాపరి అమితాసక్తితో వినడం ఈ సందర్భంగా హైలెట్‌గా నిలిచింది. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల నుండి దిగుమతి అవుతున్న మాంసం ఉత్పత్తులు నిలువరించడంతో పాటు రాష్ట్రంలోని గొర్రెల పెంపకందారుల ఆర్థిక పరిపుష్టి లక్ష్యంగా సీఎం కేసీఆర్ గొర్రెల పెంపకాన్ని ప్రోత్సాహిస్తున్నారన్నారు.

Exit mobile version