‘పదిహేను ఈఫిల్ టవర్ల నిర్మాణానికి సరిపడా ఉక్కు.. గిజా ఫిరమిడ్ కంటే ఆరు రేట్లు ఎక్కువగా మట్టి తవ్వకాలు.. బుర్జు ఖలీఫాలకు సరిపడేంత కాంక్రీట్.. 72 గంటల్లో 25.580 క్యూబిక్ మీటర్ల సిమెంట్ కాంక్రీట్..ఇదో ప్రపంచ రికార్డు.. ఇది నిన్నటి దాకా మేడిగడ్డ బరాజ్ చరిత్ర.. రాష్ట్ర ప్రభుత్వం, నీటి పారుదల శాఖ మొన్నటి దాకా ఇదే ప్రచారాన్ని హోరెత్తించాయి. ప్రస్తుతం ఇదంతా తిరగబడింది. అక్టోబర్ 21న మేడిగడ్డ 7వ బ్లాక్ లోని 20వ ఫిల్లర్ కుంగిపోయింది. నేటి వరకు ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీ నేతలు, ప్రాజెక్టును సందర్శించిన పాపాన పోలేదు. కనీసం ఆ ప్రస్తావన తీయడానికే భయపడిపోతున్నారు. మేడిగడ్డ కుంగిపోయిన మూడు రోజులకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఫిల్లర్ల కుంగుబాటు వెనక విచారణకు కమిటీని ఏర్పాటు చేసింది. అక్టోబర్ 24న మేడిగడ్డను సందర్శించిన కేంద్ర బృందం 25న నీటి పారుదల శాఖ ముఖ్య అధికారులతో సమావేశమై తమ దర్యాప్తుకు అవసరమైన 20 అంశాలకు సంబంధించి సమాచారం అందివ్వాలని ఆదేశించింది.
అయితే కేంద్ర బృందం కోరిన 20 అంశాల్లో కేవలం 11 అంశాలకు సంబందించిన సమాచారాన్నే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బృందానికి అందించి చేతులు దులుపుకుంది. ఇన్స్ట్రుమెంటేషన్, వర్షాకాలానికి ముందు, తరువాత తనిఖీల వివరాలు, నాణ్యతా ప్రమాణాల నివేదికలు, థర్డ్ పార్టీ మానిటరింగ్ రిపోర్ట్, కంప్లిషన్ రిపోర్టులు, భౌగోళిక సమాచారం, వర్షాకాలం ముందు, తరువాత నది కొలతలను చూపించే ముఖ్యమైన స్ట్రక్చరల్ డ్రాయింగ్ కు సంబంధించిన సమాచారాన్ని రాష్ట్రం కేంద్ర బృందానికి అందించలేకపోయింది. దీంతో వీటికి అవసరమైన పరీక్షలు, అధ్యయనాలు రాష్ట్రం నిర్వహించలేకపోయిందని కేంద్ర బృందం నిర్ధారించింది. రాష్ట్ర ప్రభుత్వం తమ వద్ద ఉన్న సమాచారాన్ని ఇవ్వని పక్షంలో డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021 ప్రకారం చట్టపరమైన చర్యలకు పూనుకోవాల్సి వస్తుందని కేంద్ర బృందం రాష్ట్రాన్ని హెచ్చరించింది.
అన్నీ లోపాలే.. :
మేడిగడ్డ బరాజ్ కుంగిపోవడానికి ప్లానింగ్, డిజైనింగ్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ మెయింటనెన్స్ ప్రధాన వైఫల్యాలుగా కేంద్ర బృందం నిర్ధారించింది. బ్యారేజీ పునాది కింద ఉన్న ఇసుక కొట్టుకుపోవడం వల్ల ఫిల్లర్ల సపోర్ట్ బలహీనపడిందని, ఫౌండేషన్ మెటీరియల్ పటిష్టత సామర్ధ్యం తక్కువగా ఉందని, బ్యారేజీ లోడ్ వల్ల ఎగువన ఉన్న కాంక్రీట్ వైఫల్యాలు ఫిల్లర్లు కుంగిపోవడానికి కారణాలని కేంద్ర బృందం నిగ్గుతేల్చింది. ప్రణాళిక, రూపకల్పన సరిగా లేకపోవడం బ్యారేజీ వైఫల్యాలను స్పష్టం చేస్తోందని కేంద్ర బృందం తమ నివేదికలో పేర్కొంది.
కాళేశ్వరం ప్రాజెక్టులో బ్యారేజీని తేలియాడే నిర్మాణంగా రూపొందించారని కానీ స్థిరమైన నిర్మాణంగా నిర్మించారని, బ్యారేజీ ఎగువ, దిగువ రెండు వైపులా కింద ఉన్న రాక్ చేరుకోవడానికి కాంక్రీట్ గోడలు ఉపయోగించారని, దీనిని పరిశీలిస్తే ప్లానింగ్ ప్రకారం డిజైన్ జరగకపోవడం, డిజైన్ చేసిన విధంగా నిర్మాణం జరగకపోవడాన్ని కేంద్ర బృందం గుర్తించింది. 2019లో బ్యారేజీ ప్రారంభించినప్పటి నుండి ప్రాజెక్ట్ ఇంజనీర్లు సిమెంట్ కాంక్రీట్ దిమ్మెలను, లాంచింగ్ అఫ్రాన్ లను సరిగా పరిశీలించలేదని, నిర్వాహణలో వైఫల్యం చెందారని ఫలితంగానే బ్యారేజీ క్రమంగా బలహీనపడి ప్రస్తుత పరిస్థితి ఏర్పడిందని నివేదికలో పేర్కొన్నారు.
పట్టించుకోలేదు.. :
వర్షాకాలానికి ముందు ఆ తరువాత ఏవైనా అసాధారణ సమస్యలు కనిపిస్తే తనిఖీలు నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర డ్యాం సేఫ్టీ ఆర్గనైజషన్ కు పలుమార్లు సూచించామని, అయితే రాష్ట్ర డ్యాం సేఫ్టీ ఆర్గనైజషన్ పరిగణలోకి తీసుకోలేదని తమ పరిశీలనలో స్పష్టమైందని కేంద్ర బృందం పేర్కొంది. ఇది చాలా తప్పిదమని, డ్యాం సేఫ్టీ యాక్ట్ 2021 నిబంధనలకు విరుద్ధంగా ఉందని స్పష్టం చేసింది. దీనికి గాను చాప్టర్ X లోని 41 ‘B’ సెక్షన్ కింద తీసుకునే చర్యలకు డ్యాం నిర్వాహకులు బాధ్యులు కావాల్సి ఉంటుందని పేర్కొంది. బ్యారేజ్ వైఫల్యం ప్రజల జీవితాలకు ఆర్థిక వ్యవస్థకు తీవ్రమైన ప్రమాదాన్ని కలిగించే అవకాశం ఉన్నా రాష్ట్ర డ్యాం సేఫ్టీ అథారిటీ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. మేడిగడ్డ బ్యారేజీ ఒక బ్లాక్ లో ఉత్పన్నమైన ఈ సమస్య కారణంగా మొత్తం బ్యారేజీ సక్రమంగా పని చేయని పరిస్థితి ఏర్పడిందని, సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మొత్తం బ్యారేజీని ఉపయోగించే అవకాశం లేకుండా పోయిందని కేంద్ర బృందం తేల్చి చెప్పింది. బ్లాక్ నెంబర్ 7 లో ఏర్పడిన సమస్యను మరమ్మత్తు చేయడానికి వీలుగా లేదని, మొత్తం బ్లాకు పునాదుల నుండి తొలగించి తిరిగి పునర్నిర్మించాలని, నిర్మాణ సారూప్యతలు పరిగణలోకి తీసుకుంటే మేడిగడ్డ బ్యారేజీలోని ఇతర బ్లాకులు కూడా ఇదే రీతిలో వైఫల్యం చెందే పరిస్థితి ఉందని, ఒకవేళ ఇదే జరిగితే మొత్తం బ్యారేజీ పునర్నిర్మించాల్సిన అవసరం వస్తుందని కేంద్ర బృందం నిర్ధారించింది.
అన్నారం, సుందిళ్లలోనూ ఇదే పరిస్థితి.. :
కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా మేడిగడ్డ ఎగువన నిర్మించిన అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కూడా ఇలాంటి డిజైన్ నిర్మాణ పద్ధతుల్లోనే నిర్మాణం జరిగినందున అవి కూడా మేడిగడ్డ లాంటి పరిస్థితులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయని, ఇప్పటికే అన్నారం బ్యారేజీ దిగువన బాయిలింగ్ సమస్యకు సంబంధించి సంకేతాలు కనిపిస్తున్నాయని, వీటిని గుర్తించటానికి మేడిగడ్డతో పాటు వీటి వద్ద యుద్ధప్రాతిపదికన తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఉందని కేంద్ర బృందం రాష్ట్రానికి సూచించింది.