Site icon vidhaatha

Minister Srinivas Goud। శ్రీనివాస్‌గౌడ్‌కు మంత్రి పదవి నేను పెట్టిన బిక్ష: మాజీ మంత్రి చంద్రశేఖర్

విధాత, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ ప్రతినిధి: పాలమూరు మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Minister Srinivas Goud) నేడు అనుభవిస్తున్న మంత్రి పదవి ఆనాడు తాను పెట్టిన భిక్ష అని బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పీ చంద్రశేఖర్ (P Chandrasekhar) అన్నారు.

శుక్రవారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘2014లో పాలమూరు ఎమ్మెల్యే స్థానం నేను త్యాగం చేశాను. దాని వల్ల ఈ రోజు గెలిచి మంత్రి పదవి పొంది, చేసిన మేలు మరిచి వ్యక్తిగత విమర్శలు చేయడం ఏంటి?’ అని ప్రశ్నించారు.

రాజకీయంలో సిద్ధాంతపరంగా, పార్టీ విధానాల పరంగా సంస్కారవంతంగా మాట్లాడటం మర్యాద అని, మర్యాదను అతిక్రమించి వ్యక్తిగతం మాట్లాడటం సంస్కారం కాదని దుయ్యబట్టారు. వంటగ్యాస్‌ సిలిండర్‌ ధరలు (LPG Price Hike) పెంచినందుకు ధర్నా చేయడం బాగానే ఉంది కానీ.. తెలంగాణ ప్రభుత్వం పెంచిన కరెంటు చార్జీలు, బస్సు చార్జీల సంగతేంటని ప్రశ్నించారు. రిజిస్ట్రేషన్‌ చార్జీలు పెంచి భూముల ధరలను పెంచి వాటిని పేదలు కొనకుండా చేసింది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాదా? అని నిలదీశారు.

ప్రజలకు సేవ చేసుకోవడానికి అవకాశం ఇస్తే అవినీతికి అక్రమాలకు పాల్పడి, ప్రజల మధ్య ధైర్యంగా తిరగలేకపోతున్నాడని శ్రీనివాస్‌గౌడ్‌ను ఉద్దేశించి చంద్రశేఖర్‌ వ్యాఖ్యానించారు. ఉన్న పదవి పోతుందనే అభద్రతా భావంలో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు.

మీడియా సమావేశంలో బీజేపీ నాయకుడు, ప్రముఖ న్యాయవాది ఎన్ పీ వెంకటేష్, జిల్లా ఉపాధ్యక్షుడు కృష్ణ వర్ధన్ రెడ్డి, పీ సత్యం, పీ శ్రీనివాస్ రెడ్డి, అచ్చిగట్ల అంజయ్య రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version