Site icon vidhaatha

న‌ల్ల‌గొండ‌: కరెంటు కోతలు.. సబ్‌స్టేషన్‌లో రైతు ఆత్మహత్యాయత్నం

విధాత: వారం రోజులుగా విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో వేసిన పంటలు ఎండి పోతున్నాయన్న ఆందోళనతో నల్గొండ జిల్లా నేరేడు కొమ్ము మండలం బుగ్గ తండాకు చెందిన జటావత్ చందు అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన కలకలం రేపింది.

బుగ్గ తండాకు చెందిన చందు తనకున్న రెండు ఎకరాలలో వరి పొలం, కౌలుకు తీసుకున్న మరో నాలుగు ఎకరాలలో వేరుశనగ పంటను సాగు చేస్తున్నాడు. గత వారం రోజులుగా కరెంటు సరఫరా సక్రమంగా లేకపోవడంతో పంట ఎండిపోయే స్థితికి చేరుకుంది.

కరెంటును సక్రమంగా సరఫరా చేయండని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో ఆందోళన చెందిన రైతు చందు గురువారం సబ్ స్టేషన్ వద్దకు పురుగుల మందు చేత పట్టుకొని వచ్చి సబ్ స్టేషన్‌లో పురుగుల మందుల తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.

గమనించిన సిబ్బంది వెంటనే పెద్ద మునిగల్ గ్రామంలోని ఓ ఆర్ఎంపీ వైద్యుడి వద్దకు తీసుకెళ్లి వైద్యం అందించడంతో రైతు చందు కోలుకున్నాడు. ఈ సంఘటన గ్రామాల్లో కొనసాగుతున్న అప్రకటిత విద్యుత్ కోతలకు నిదర్శనంగా నిలిచింది.

Exit mobile version