Site icon vidhaatha

Medak: శాంతి సామరస్యాలతో పండుగలు జరుపుకోవాలి: DSP సైదులు

విధాత, మెదక్ బ్యూరో: హనుమాన్ జయంతి, రంజాన్ పండుగలను ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో శాంతి సామరస్యాలతో జరుపుకోవాలని మెదక్ డీఎస్పీ సైదులు పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో పట్టణ సీఐ సంజయ్ అధ్యక్షతన హిందూ, ముస్లిం మతాలకు చెందిన పలువురు పెద్దలతో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

హనుమాన్ జయంతి, రంజాన్ మాసం సందర్భంగా ప్రజలు పట్టణంలో కలిసిమెలిసి సంతోషంగా పండుగలు జరుపుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరు ముందుగా సమయపాలన పాటించాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరూ బాధ్యత వహించాలని కోరారు. ఎల్లుండి జరిగే శ్రీ హనుమంతుని శోభాయాత్ర సమయంలో ప్రజలు పోలీసులకు పూర్తి సహకారం అందించాలన్నారు. శాంతి యుతంగా జరుపుకోవాలని సూచించారు. పండుగలు ప్రశాంత వాతావరణంలో కలిసిమెలిసి జరుపుకోవాలని, శాంతి సంఘ సమావేశానికి సహకరించిన మత పెద్దలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

కార్యక్రమంలో ఇరు వర్గాల పెద్దలు మాట్లాడుతూ.. శాంతి సామరస్య మార్గంలో అందరూ ముందుకు సాగాలని పలువురు అభిప్రాయపడ్డారు. ఏ దేవుడైనా ఒక్కడేనని అందరూ కలిసికట్టుగా ఐకమత్యంగా ఉన్నప్పుడే ఆధ్యాత్మికతకు విలువ ఉంటుందని అన్నారు. మెదక్ పట్టణంలోఅన్ని పండుగలు ఎంతో కలిసికట్టుగా ఐకమత్యంతో జరుపుకుంటారని ఎలాంటి వివాదాలు ఉండవని పెద్దలు హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో హిందూ, మైనార్టీ నాయకులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

Exit mobile version