- శోభాయాత్రలో మరోసారి భగ్గుమన్న విభేదాలు
- ఫ్లెక్సీలు చించి, డీజే వాహనాల సీజ్ చేశారంటూ పిల్లి వర్గీయుల ఆందోళన
- ప్లకార్డులతో ఎస్పీ ఆఫీస్ ఎదుట బైఠాయింపు
విధాత, ఉమ్మడి నల్గొండ జిల్లా బ్యూరో: నల్గొండ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతల్లో మొదలైన లొల్లి వివిధ రూపాలుగా రంగులు మార్చుకుంటోంది. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, పిల్లి రామరాజు ఢీ అంటే ఢీ అంటున్నారు. ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడిగా ఎదిగిన పిల్లి… ఆ తర్వాత విభేదించి సొంత పార్టీలోనే వేరు కుంపటి పెట్టాడు. నియోజకవర్గ వ్యాప్తంగా తన వర్గీయులతో సేవా కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు.
ఈ క్రమంలోనే స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడంటూ పిల్లి రామరాజు ఆరోపిస్తున్నారు. వినాయక విగ్రహాల పంపిణీలోనూ అడ్డంకిగా మారినట్లు గోడు వెళ్లబోసుకున్నాడు. ఐనా పిల్లి వెనక్కు తగ్గలేదు.
నల్గొండలోని వివిధ వార్డులతో పాటు నల్గొండ మండలం తిప్పర్తి, కనగల్ మండలాల్లో వినాయక విగ్రహాలు బహూకరించారు. ఆయా విగ్రహాల వద్ద పూజలు నిర్వహించేందుకు పిల్లి రామరాజు వెళుతున్న క్రమంలో, అనేకసార్లు పోలీసులతో ఎమ్మెల్యే తనను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నాడంటూ మూడు రోజుల క్రితమే నల్గొండ డీఎస్పీ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.
తాజాగా సోమవారం రాత్రి పట్టణంలో పలుచోట్ల పిల్లి రామరాజు నిమజ్జన శోభాయాత్ర కు సంబంధించిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వాటిని ఎమ్మెల్యే అనుచరులు, ఎమ్మెల్యే ప్రోద్బలంతో మున్సిపల్ సిబ్బంది తొలగిస్తున్నారంటూ మంగళవారం పిల్లి రామరాజు ఆందోళనకు దిగారు.
అనుచరులతో నల్గొండ ఎస్పీ కార్యాలయానికి పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరారు. ఎమ్మెల్యే కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ప్లకార్డులు ప్రదర్శించారు. ఫ్లెక్సీలుచించి, శోభాయాత్రకు తీసుకువచ్చిన డీజే వాహనాలను పోలీసులు సీజ్ చేశారంటూ ఆరోపించారు. కనగల్ ఎస్ఐ తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ, దుర్భాషలాడుతున్నాడని, పోలీసుల అండతో అరాచకాలు చేస్తే సహించేది లేదని భీష్మించారు.
పోలీసులు తనకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. నల్గొండ నియోజకవర్గంలో బహుజన వాదాన్ని లేపినందుకే ఎమ్మెల్యే కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అనంతరం ఎస్పీ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.