విధాత: ఉత్తరప్రదేశ్‌లోని షాహరన్‌పూర్‌లో అండర్ -17 స్టేట్ లెవల్ కబడ్డీ టోర్నమెంట్ జరుగుతుంది. అయితే ఈ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన కబడ్డీ క్రీడాకారులకు టాయిలెట్ గదుల్లో ఆహారం తయారు చేసి, వడ్డించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
టాయిలెట్ గదుల్లోనే ఆహారం తయారు చేశారు. తెరిచి ఉంచిన ఆహారాన్ని ప్లేయర్లు తమకు తాము వడ్డించుకొని వెళ్తున్నారు. అయితే ఈ వీడియోలు వైరల్ కావడంతో.. ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించారు. షాహరన్‌పూర్ స్పోర్ట్స్ ఆఫీసర్ అనిమేశ్ సక్సేనాను సస్పెండ్ చేశారు.
ఈ సందర్భంగా అనిమేశ్ సక్సేనా మాట్లాడుతూ.. కబడ్డీ పోటీలు జరుగుతున్న స్టేడియంలో స్థలం కొరత ఉందన్నారు. వంటలను వాష్‌రూమ్‌లో వండలేదని, వర్షం పడటంతో అక్కడకు తీసుకెళ్లామని తెలిపారు. స్విమ్మింగ్ పూల్‌కు సమీపంలో వంటలు వండినట్లు పేర్కొన్నారు. ఇక స్టేడియంలో నిర్మాణ పనులు జరుగుతున్నందున స్థలం కొరత ఏర్పడినట్లు చెప్పారు.
ఈ ఘటనపై స్పందించిన టీఆర్ఎస్ నాయకుడు వై సతీశ్ రెడ్డి ట్విట్టర్ వేదికగా యూపీ బీజేపీ ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. టాయిలెట్లలో ఉంచిన ఆహారాన్ని కబడ్డీ ప్లేయర్లకు సర్వ్ చేయడం దారుణమన్నారు. ప్లేయర్లకు బీజేపీ ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా? అని ప్రశ్నించారు. ఇది సిగ్గుచేటు అని సతీశ్ రెడ్డి పేర్కొన్నారు.