Telangana | సంక్షేమానికి ఫుల్‌స్టాప్‌!

Telangana ఎదురుదాడినే నమ్ముకున్న అధికార, విపక్షాలు కాంగ్రెస్‌ గీసిన గిరిలో తిరుగుతున్న బీఆరెస్‌ మొన్న ధరణి నుంచి.. నేడు కరెంటు సమస్యదాకా ప్రతిపక్ష పార్టీ అజెండాలోకి అధికార పక్షం విధాత: రాష్ట్రంలో రాజకీయ పార్టీలు తమ రాజకీయ పంథాను మార్చుకున్నట్లు కనిపిస్తున్నది. ఇప్పటి వరకు తాము ఏమి చేశామో చెప్పాల్సిన అధికార పార్టీ, తాము అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో ప్రజలకు వివరించాల్సిన ప్రధాన ప్రతిపక్ష పార్టీ.. దానిని వదిలేసి ఒకరిపై ఒకరు ఎదురుదాడులు చేసుకుంటున్నాయి. ఇలా […]

  • Publish Date - July 18, 2023 / 12:36 AM IST

Telangana

  • ఎదురుదాడినే నమ్ముకున్న అధికార, విపక్షాలు
  • కాంగ్రెస్‌ గీసిన గిరిలో తిరుగుతున్న బీఆరెస్‌
  • మొన్న ధరణి నుంచి.. నేడు కరెంటు సమస్యదాకా
  • ప్రతిపక్ష పార్టీ అజెండాలోకి అధికార పక్షం

విధాత: రాష్ట్రంలో రాజకీయ పార్టీలు తమ రాజకీయ పంథాను మార్చుకున్నట్లు కనిపిస్తున్నది. ఇప్పటి వరకు తాము ఏమి చేశామో చెప్పాల్సిన అధికార పార్టీ, తాము అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో ప్రజలకు వివరించాల్సిన ప్రధాన ప్రతిపక్ష పార్టీ.. దానిని వదిలేసి ఒకరిపై ఒకరు ఎదురుదాడులు చేసుకుంటున్నాయి. ఇలా అధికార, విపక్ష పార్టీలు సంక్షేమానికి ఫుల్‌ స్టాప్‌ పెట్టి, ఎదురు దాడికి నమ్ముకున్నట్లు కనిపిస్తున్నదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

కాంగ్రెస్‌ డిమాండ్ల చుట్టూ బీఆరెస్‌

రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రస్‌ పార్టీ చేస్తున్న డిమాండ్ల చుట్టూ అధికార పక్షం గిర గిరా తిరుగుతున్నదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది. నిర్దిష్ట ఎజెండా కాకుండా గాలి వాటంగా వీరి ప్రధాన నినాదాలుంటున్నాయని అంటున్నారు. అధికార బీఆరెస్‌.. కాంగ్రెస్‌ వేసిన స్కెచ్‌లో ఇరుక్కుందా? అన్న చర్చ కూడా జరుగుతున్నది. కాంగ్రెస్‌ పార్టీ మొన్నటి వరకు ధరణి సమస్యను ముందుకు తీసుకువచ్చింది.

ఇందులో ఉన్న లోపాలను ఎత్తి చూపింది. ధరణి వల్ల ఏ విధంగా భూ యజమానులు నష్టపోతున్నారో తెలిపింది. ఈ మేరకు వరుసగా ధరణి ఫైల్స్‌ విడుదల చేస్తానని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ధరణిలో జరిగిన అవినీతిపై కాంగ్రెస్‌ తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై విమర్శలు ఎక్కు పెట్టింది. తాము అధికారంలోకి రాగానే ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని ప్రకటించింది. దీనిని ప్రధాన ఎజెండాగా కాంగ్రెస్‌ ముందుకు తెచ్చింది.

దీంతో ఏమి చేయాలో అర్థం కాని బీఆరెస్‌.. ధరణి బహ్మాండంగా ఉందని, మళ్లీ దళారుల రాజ్యం తీసుకురావడానికే కాంగ్రెస్‌ ధరణిని రద్దు చేస్తానంటున్నదని ఎదురుదాడికి దిగింది. ధరణి ఎజెండాగా ఎన్నికలకు వెళతామని ఏకంగా సీఎం కేసీఆర్‌ ప్రకటించారు కూడా. ఇలా కాంగ్రెస్‌ తెచ్చిన ధరణి అంశం నిన్న మొన్నటి వరకు ప్రధాన ఎజెండాగా నిలిచింది.

కరెంటు వ్యాఖ్యలతో కొత్త పోరాటం

పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనలో కరెంటుపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో బీఆరెస్‌, కాంగ్రెస్‌ మధ్య కొత్త పోరాటాన్ని ముందుకు తెచ్చాయి. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీఆరెస్‌, బీఆరెస్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్‌.. రాష్ట్రంలో ధర్నాలు, దిష్టిబొమ్మల దహనం లాంటి ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాయి.

తాజాగా రేవంత్‌రెడ్డి ఉచిత విద్యుత్తు సరఫరా, కొనుగోళ్లలో అవినీతిపై విద్యుత్తు ఫైల్స్‌ విడుదల చేస్తామని సవాల్‌ చేశారు. బహిరంగ చర్చకు రావాలన్నారు. దీంతో మంత్రి కేటీఆర్‌ ఏకంగా విద్యుత్తు అంశంపైనే ఎన్నికలకు వెళతామని ప్రకటించారు. మంత్రి జగదీశ్‌రెడ్డి విద్యుత్తు ఫైల్స్‌పై చర్చకు తాను సిద్ధమని అన్నారు.

ధరణి, విద్యుత్తు సమస్యలపై కాంగ్రెస్‌ చేసిన సవాళ్లతో అధికార బీఆరెస్‌ వీటి చుట్టే తిరుగుతున్నదన్న అభిప్రాయం రాజకీయ వర్గాలలో వ్యక్తం అవుతున్నది. తాము ప్రజలకు ఏమి చేశాము? ఏమి చేస్తామో చెప్పే అవకాశం లేకుండా కాంగ్రెస్‌ వదిలిన ధరణి, విద్యుత్తు అస్త్రాల చుట్టే తిరుగుతోందని అంటున్నారు.

కాంగ్రెస్‌ వదిలిన అస్త్రాలతో నిత్యం రాజకీయ ఎజెండాలో కాంగ్రెస్‌ ఉంటే.. కాంగ్రెస్‌ వేసిన ప్రశ్నలకు కౌంటర్‌ లేదా వివరణలు ఇచ్చుకునే పనిలో అధికార పార్టీ ఉందని అంటున్నారు. తమ ఉచ్చులో కాంగ్రెస్‌ ఇరుక్కుంటుందని అధికార పార్టీ అనుకుంటే.. కాంగ్రెస్‌ గీసిన గీతలోనే అధికార బీఆరెస్‌ తిరుగుతున్నదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

ప్రాజెక్టు యాత్రలతో మరో ఎజెండా

తాజాగా కాంగ్రెస్‌ మరో అస్త్రాన్ని సిద్ధం చేస్తున్నది. ప్రాజెక్ట్‌ల యాత్ర చేస్తానని సీఎల్‌పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. ఇందులో ప్రధానంగా ప్రాజెక్ట్‌ల నిర్మాణాలలో అవినీతి, కృష్ణా నదిపై ప్రాజెక్ట్‌ల నిర్మాణంలో నిర్లక్ష్యం, ఎస్‌ఎల్‌బీసీ సొరంగ నిర్మాణంలో నిర్లక్ష్యం తదితర అంశాలపై కాంగ్రెస్‌.. అధికార పక్షాన్ని నిలదీసేందుకు సిద్ధమైంది.

ఇలా ఒక్కో సమస్యను ముందుకు తీసుకొని అధికార బీఆరెస్‌ను ఉచ్చులోకి లాగుతున్న కాంగ్రెస్‌.. వరుస డిక్లరేషన్‌లతో మరింత ఇరుకున పెడుతున్నది. దీంతో ఇంత కాలం బీఆరెస్‌ పార్టీ ప్రధాన ప్రచారాస్త్రంగా పెట్టుకున్న సంక్షేమ పథకాల ప్రచారాన్ని పక్కన పడేసి, కాంగ్రెస్‌పై ఎదురు దాడి రాజకీయాలనే అశ్రయిస్తుండడం ఆ పార్టీ ఆత్మరక్షణలో పడిందా? అన్న సందేహాలు రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.

Latest News