Delhi CM Rekha Gupta: దేశ రాజధాని ఢిల్లీ(Delhi) సీఎం రేఖా గుప్తా (Delhi CM Rekha Gupta) పాలనలో తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆమె చేసిన పని అందర్ని అశ్చర్యపరిచింది. సీఎం వెళ్తున్న మార్గంలో ఓ వ్యక్తి రద్దీగా ఉన్న రోడ్డుపై తన కారులో నుంచి ఆవుకు ఆహారం(రొట్టె) విసిరేయడాన్ని చూశారు. దీంతో ఆమె వెంటనే కాన్వాయ్ ఆపి ఆ వ్యక్తి వద్దకు వెళ్లి మాట్లాడారు. తాను ఢిల్లీ సీఎం అని పరిచయం చేసుకున్న ఆమె.. ఇంకోసారి అలా ఆహారాన్ని రోడ్డుపై విసిరేయవద్ధని చేతులు జోడించి అభ్యర్థించారు. ఇలాంటి చర్యల వల్ల మూగజీవాలతో పాటు వాహనదారులకూ ప్రమాదమేనన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె తన ‘ఎక్స్’ ఖాతాలో షేర్ చేశారు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఢిల్లీలోని హైదర్‌పుర్ ఫ్లైఓవర్‌పై శనివారం ఈ ఘటన జరిగింది. దాదాపు 15 నిమిషాల పాటు సీఎం తన కాన్వాయ్‌ను నిలిపేసి వాహనదారుడితో మాట్లాడారు.
ఆవులకు..వాహనదారులకు ప్రమాదమే
‘‘ఈ రోజు ఢిల్లీ వీధుల్లో వెళ్తుండగా ఓ వ్యక్తి కారులో నుంచి ఆవుకు రొట్టె ముక్క విసరడం చూశా. వెంటనే కారు ఆపి ఆయన వద్దకు వెళ్లా. దయచేసి మరోసారి అలా చేయొద్దని అభ్యర్థించాను.. రొట్టె మనకు కేవలం ఆహారం మాత్రమే కాదు.. మన సంస్కృతికి, భక్తికి, గౌరవానికి, విశ్వాసాలకు ప్రతీక. ఇలా రద్దీగా ఉన్న రోడ్లపైకి రొట్టెను విసిరేయడం వల్ల వాటిని తినేందుకు ఆవులు, ఇతర జంతువులు అక్కడకు వస్తాయి. అప్పుడు మూగజీవాలకు ముప్పు వాటిల్లడమే కాకుండా వాహనదారులు, రోడ్లపై నడిచే వారికీ ప్రమాదమేనన్నారు. అంతేకాదు.. ఆహారాన్ని ఇలా అగౌరవపర్చకూడదు. మీరు జంతువులకు ఆహారం పెట్టాలనుకుంటే.. గోశాలల వంటి ప్రాంతాలకు వెళ్లండి. అదే మన విలువలు, బాధ్యతలను చాటిచెబుతుంది. ఢిల్లీ వాసులందరికీ నా అభ్యర్థన ఒక్కటే. రోడ్లపై ఆహారాన్ని విసరకండి. మూగజీవులను ప్రేమతో, బాధ్యతతో ఆహారం ఇవ్వండి..మన సంస్కృతిని గౌరవించండి.. రహదారి భద్రతను పాటించండి’’ అని సీఎం రేఖా గుప్తా ఎక్స్ లో రాసుకొచ్చారు.
https://x.com/gupta_rekha/status/1910953253073793377