హెటిరోకు భూ కేటాయింపు నిలిపివేత

బీఆరెస్ ప్రభుత్వ భూ కేటాయింపులపై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది

  • Publish Date - January 30, 2024 / 06:12 PM IST

15.48 ఎకరాలను లీజుకిచ్చిన గత సర్కార్‌

అప్పట్లో మార్కెట్ ధర ఎకరాకు 33.7 కోట్లు

మొత్తం 505.5 కోట్ల విలువైన భూములు

ఏడాదికి 30 లక్షల లీజుతో భూసంతర్పణ

గత జీవో రద్దు చేస్తూ తాజా ఉత్తర్వులు

విధాత, హైదరాబాద్ : బీఆరెస్ ప్రభుత్వ భూ కేటాయింపులపై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాజ్యసభ సభ్యుడు పార్థసారధి రెడ్డికి చెందిన హెటిరో సంస్థలకు గత బీఆరెస్ ప్రభుత్వం కేటాయించిన 15.48 ఎకరాల భూ కేటాయింపు ఉత్తర్వు (జీవో 140)ను నిలిపివేసింది. హెటిరో సంస్థ అయిన సాయి సింధు ఫౌండేషన్‌ నిర్మించే క్యాన్సర్ ఆసుపత్రి కోసం హైటెక్ సిటీ సమీపంలో శేరిలింగంపల్లి మండలం ఖానామెట్‌లో వందల కోట్ల విలువైన 15.48 ఎకరాలను గత ప్రభుత్వం 30 ఏళ్ల కాలానికి లీజు ప్రాతిపదికన కేటాయించింది. అప్పట్లో శేరిలింగంపల్లి తాసిల్దార్‌, రాజేంద్రనగర్ ఆర్డీవో, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ ఆ భూమి మార్కెట్ ధర ఎకరాకు 33.7 కోట్ల చొప్పున 505.5 కోట్ల విలువ ఉంటుందని నోట్ ద్వారా తెలిపారు. అయినప్పటికీ కేసీఆర్ ప్రభుత్వం జీవో 571 (లీజు ఉత్తర్వు) మేరకు భూ కేటాయింపు చేయాలని నిర్ణయించింది. లీజు ఉత్తర్వును కూడా 2015లో సవరిస్తూ జీవో 218 విడుదల చేసింది. ఈ జీవో మేరకు సామాజిక, స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చే భూమి విలువలో 10శాతాన్ని ఏడాది లీజుగా చెల్లించాలనే నిబంధన పెట్టింది. అంటే ప్రభుత్వ భూమి విలువ 505.5 కోట్లకు అందులో 10 శాతం కింద 50 కోట్ల చొప్పున ఏడాదికి చెల్లించాలి. ఐదేళ్లకొకసారి 10 శాతం పెంచాలి. తన జీవోను తనే ఉల్లంఘిస్తూ 2018 మార్చి 22న జీవో 59ద్వారా ఏడాదికి ఎకరాకు 1.47 లక్షల చొప్పున లీజు చెల్లించేలా పార్థసారధిరెడ్డి ట్రస్టుకు బీఆరెస్ ప్రభుత్వం భూమి కేటాయింపు చేసింది. ఈ భూకేటాయింపును 2018లో డాక్టర్ ఊర్మిళ షింగ్లే ప్రభృతులు హైకోర్టులో సవాల్ చేశారు. 2023 జూన్ 5న జీవో 59ను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. భూకేటాయింపు పాలసీ-2018ని పునఃసమీక్షించి నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. ప్రజల ఆస్తులకు, వనరులకు ప్రభుత్వాలు ట్రస్టీగానే వ్యవహరించాలని, ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ ఆస్తులను కట్టబెట్టే నిర్ణయాలు తీసుకోవాలని వ్యాఖ్యానించింది.

కోర్టు తీర్పునూ పట్టించుకోలేదు

కోర్టు తీర్పును సైతం పట్టించుకోకుండా 2023 ఆగస్టు 11న లీజు నిబంధనను సవరిస్తూ ప్రభుత్వం జీవో 99 జారీ చేసింది. సామాజిక, స్వచ్ఛంద సంస్థలకు భూములను తక్కువ ధరకు కేటాయించే విచక్షణాధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని జీవోలో పేర్కొన్నది. ఇంతలోనే అసెంబ్లీ ఎన్నికల కోడ్ రావడంతో 2023 సెప్టెంబర్ 25న జీవో 140ద్వారా సాయి సింధు ఫౌండేషన్‌కు భూకేటాయింపు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాదికి 50 కోట్ల మేరకు లీజు చెల్లించాలని, ప్రతి ఐదేళ్లకొకసారి లీజు మొత్తాన్ని 10 శాతం పెంచాలన్న నిబంధనలు తుంగలో తొక్కి, ఏడాదికి ఎకరాకు 2లక్షల చొప్పున 15.4 ఎకరాలకు 30 లక్షల లీజుతో జీవో 140 ద్వారా భూసంతర్పణ చేసింది. ప్రభుత్వం మారడంతో ఈ భూ కేటాయింపు వ్యవహారం మళ్లీ రచ్చగా మారగా, సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టి భూ కేటాయింపు జీవోను నిలిపివేసింది. నిజానికి ప్రస్తుతం ఖానామెట్‌లో ఎకరా భూమి మార్కెట్‌ విలువ రూ.300 కోట్లుగా ఉన్నది. అంటే.. హెటిరో సంస్థకు గత ప్రభుత్వం 4వేల కోట్ల విలువైన భూములను ఏడాదికి 30లక్షల చొప్పున 60 ఏళ్లకు కట్టబెట్టిందన్నమాట.

బీఆరెస్ పార్టీ ఎక్సలెన్స్‌ సెంటర్‌దీ అదే కథ

బీఆరెస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ ఎక్సలెన్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ సెంటర్ కోసం కూడా 11 ఎకరాల స్థలాన్ని కోకాపేటలోని సర్వే నంబర్ 239, 240లో కేటాయించారు. ఈ భూమి మార్కెట్ విలువ ఎకరాకు 100 కోట్ల చొప్పున 1100 కోట్లు ఉండగా అప్పటి రంగారెడ్డి కలెక్టర్ ఒక్కో ఎకరానికి 3.42 కోట్ల చొప్పున 11ఎకరాలకు 37.53 కోట్లుగా ధర నిర్ణయించి ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై అడ్వకేట్ వెంకట్రామ్‌రెడ్డి పిల్ దాఖలు చేశారు. ఏసీబీ దర్యాప్తు చేపట్టేలా డీజీపీకి హైకోర్టు ఉత్తర్వులివ్వాలని కోరారు. ఇదే విషయమై గతంలో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పిటిషన్‌తో వెంకట్రామ్‌రెడ్డి పిటిషన్ జత చేసి రెండు పిటిషన్లను కలిపి విచారించాలని హైకోర్టు తాజాగా నిర్ణయించింది. ఈ పిల్‌లో కేసీఆర్‌ను కూడా ప్రతివాదిగా చేర్చడం గమనార్హం.

Latest News