విధాత, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కాళేశ్వరం ప్రాజెక్టు కన్నెపల్లి పంప్‌హౌస్ లక్ష్మీ పంప్ మోటర్లు ఆన్ చేసి నీళ్లు ఇవ్వాలని..లేకపోతే కేసీఆర్ నాయకత్వంలో లక్షలాది మంది రైతులతో కలిసి మేమే మోటార్లు ఆన్ చేస్తామని ఈ ప్రభుత్వాన్ని విడిచిపెట్టం.. ప్రజాశక్తిలో ఉన్న బలం ఏంటో చూపిస్తాం అని బీఆర్ఎస్ మాజీ మంత్రి టి.హరీష్ రావు హెచ్చరించారు. ఆదివారం తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. మేడిగడ్డలో ప్రస్తుతం 73,600 క్యూసెక్కుల నీళ్లు ప్రవహిస్తున్నాయని..కన్నెపల్లి పంప్‌మౌస్ ఎంఎండీఎల్ 93.5 మీటర్లైతే.. ఇప్పుడా లెవెల్ 96 మీటర్లుగా ఉందని..ఇక్కడ స్పష్టంగా నీళ్లు తీసుకునే అవకాశం ఉన్నా.. ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రభుత్వాన్ని హరీశ్ రావు ప్రశ్నించారు. మోటార్లు ఆన్ చేస్తే 15 జిల్లాలకు సాగునీరు అందుతుందన్నారు. ఎస్సారెస్పీ కింద పంటలు వేయాలా.. వద్దా? అని రైతులు ఆలోచిస్తున్నారని..మా పార్టీపై కోపాన్ని రైతులపై ప్రభుత్వం చూపిస్తూ వారిని ఇబ్బందుల పాలు చేస్తుందని హరీష్ రావు ఆరోపించారు. నీళ్ల విలువ తెలిసిన నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటే ఆ నీళ్లను మలుపుకునే ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటారని..నీళ్ల విలువ తెలియని నాయకులు పాలకులుగా ఉండటం వల్ల తెలంగాణ ఇబ్బందులను ఎదుర్కొంటున్నదన్నారు. మేడిగడ్డ బ్యారేజీ మొత్తం గేట్లు తెరచి ఉన్నా కన్నెపల్లి పంప్‌హౌస్ మోటర్లు ఆన్ చేసి నీళ్లు తీసుకునే అవకాశం ఉందని గుర్తు చేశారు. రోజుకు రెండు టీఎంసీల నీళ్లను కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి తెచ్చుకునే అవకాశం ఉందన్నారు. ఈరోజు కాళేశ్వరం మోటర్లు ప్రారంభిస్తే 15 జిల్లాలకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉందన్నారు.
రేవంత్ పాలనలో తగ్గిన కృష్ణా నీళ్ల వినియోగం
ముఖ్యమంత్రి పదేపదే పాలమూరు బిడ్డ అని పెద్ద మాటలు మాట్లాడుతున్నాడని..కానీ పాలమూరు రైతుల కడుపు కొడుతున్నాడని విమర్శించారు. శ్రీశైలంలో వరద మే 30వ తారీఖున వచ్చింది.. ఈరోజుకు 36 రోజులైనా ఇప్పటివరకు కల్వకుర్తి మోటర్లు ఆన్ చేయలేదని హరీష్ రావు తప్పుబట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక కృష్ణాలో అతి తక్కువ నీళ్లు వాడుతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వమేనని ఆరోపించారు. చంద్రబాబు కోసం 65 టీఎంసీలను రేవంత్ రెడ్డి ధారాదత్తం చేశారని విమర్శించారు. కృష్ణా నీళ్లను ఆంధ్రకు వదిలిపెట్టడమే ఈ ప్రభుత్వ లక్ష్యంగా ఉందన్నారు. చంద్రబాబుతో నీకున్న చీకటి ఒప్పందం ఏంటి రేవంత్ రెడ్డి? అని హరీష్ రావు ప్రశ్నించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో క్రాప్ హాలిడే ప్రకటించి ఆంధ్రలో మూడో పంటకు నీళ్లు వదిలారని విమర్శించారు. ఈసారి కూడా ఆంధ్రకు నీళ్ళొదిలే ప్రయత్నం చేస్తున్నారని..మహబూబ్‌నగర్ జిల్లాలో కల్వకుర్తి ప్రాజెక్టు మోటర్లు ప్రారంభించకపోతే వేలాదిమంది రైతులతో ప్రాజెక్టు వద్దకి వెళ్లి మోటర్లు ఆన్ చేసే పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నామన్నారు.