High Court
- ప్రమాణం చేయించిన చీఫ్ జస్టిస్ అరాధే
హైదరాబాద్, విధాత: తెలంగాణ హైకోర్టు జడ్జిగా జస్టిస్ పీ సామ్ కోషి నియమితులయ్యారు. గురువారం ఉదయం ఫుల్‌కోర్టు సమక్షంలో హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే జస్టిస్ సామ్‌కోషి చేత ప్రమాణం చేయించారు. అనంతరం హైకోర్టు బార్ అసోషియేషన్ హాల్లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జస్టిస్ సామ్‌కోషి మాట్లాడారు.
మధ్యప్రదేశ్‌లో న్యాయవాది వృత్తిలో ఉన్నప్పుడు తమ సీనియర్ న్యాయవాదిగా జస్టిస్ అలోక్ అరాధే ఉన్నారని, ఇప్పుడు అదే అరేధే సీజేగా ఉన్న హైకోర్టుకు జడ్జిగా రావడం సంతోషంగా ఉన్నదని చెప్పారు. ఆ నాటి మధుర జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయన్నారు. తెలంగాణ హైకోర్టుకు మంచి పేరు ఉన్నదని, దాన్ని కాపాడేందుకు కృషి చేస్తానన్నారు.
ఎలాంటి రాగద్వేషాలకు తావివ్వకుండా విధులు నిర్వర్థిస్తానని తెలిపారు. అంతకుముందు సీజే అలోక్ అరాధే మాట్లాడుతూ.. తనతో కలిసి న్యాయవాదిగా పనిచేసిన సామ్‌కోషి ఇప్పుడు తెలంగాణ హైకోర్టుకు జడ్జిగా రావడం ఆనందంగా ఉన్నదన్నారు.
జస్టిస్ సామ్‌కోషి మరిన్ని ఉన్నత పదవులను పొందాలని ఆకాంక్షించారు. న్యాయవాది వృత్తి అంటేనే చాలా టెన్షన్లు ఉంటాయని, కానీ మీరందరూ నవ్వుతూ పెద్ద ఎత్తున ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటే చాలా సంతోషంగా ఉన్నదని న్యాయవాదులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
1991లో కెరీర్ మొదలు
జస్టిస్ సామ్ కోషి ఏప్రిల్ 30, 1967లో జన్మించారు. మార్చి 9, 1991లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. అనంతరం మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ హైకోర్టులో అక్టోబర్, 2000 వరకు, నవంబర్ 2000 నుంచి 2013 వరకు ఛత్తీస్‌గఢ్ హైకోర్టులో వివిధ ప్రభుత్వరంగ సంస్థలు, బ్యాంకులకు చెందిన కేసులను వాదించారు.
2002 నుంచి 2004వరకు ఛత్తీస్‌గఢ్ హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా ఉన్నారు. 2005 నుంచి 2006 వరకు డిప్యూటీ అడ్వకేట్ జనరల్‌గా కూడా ఉన్నారు. సెప్టెంబర్ 16, 2013న ఛత్తీస్‌గఢ్ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.