Karnataka | కర్ణాటకలోని హుబ్లీలో ఘోర ప్రమాదం తప్పింది. మంగళవారం మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో రద్దీగా ఉన్న రహదారిపై ఇనుప పిల్లర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదు.
వివరాల్లోకి వెళ్తే.. హుబ్లీలోని రైల్వే బ్రిడ్జి కింద నుంచి వాహనాలు వేగంగా ముందుకు కదులుతున్నాయి. ఓ ట్యాంకర్ వెళ్లిన కాసేపటికే.. దాని వెనుకాల బస్సు వచ్చింది. అదే సమయంలో బస్సు ముందు నుంచి ఓ ద్విచక్ర వాహనదారుడు వెళ్తున్నాడు. అయితే రైల్వే బ్రిడ్జికి సపోర్టుగా ఉంచిన ఓ ఇనుప పిల్లర్ క్షణాల్లోనే కుప్ప కూలి పోయింది.
ఇనుప పిల్లర్ కూలడాన్ని గమనించిన ద్విచక్ర వాహనదారుడు ముందుకు వెళ్లలేదు. అప్పటికే ట్యాంకర్ వెళ్లిపోయింది. బస్సు ఆగింది. దీంతో ఘోర ప్రమాదం నుంచి అందరూ తృటిలో తప్పించుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, ఇనుప పిల్లర్‌ను రోడ్డుపై నుంచి పక్కకు నెట్టేశారు.