Site icon vidhaatha

ISRO-INSAT-3DS | ఇన్‌శాట్‌ 3డీఎస్‌ ప్రయోగం సక్సెస్‌

ISRO-INSAT-3DS | ఇస్రో శనివారం ఇన్‌శాట్‌ 3డీఎస్‌ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్14 రాకెట్‌ శాటిలైట్‌ను విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. శ్రీహరికోట నుంచి సాయంత్రం 5.35 గంటలకు జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌14 రాకెట్‌ను ఇస్రో నింగిలోకి పంపింది. ఇన్‌శాట్‌ 3డీఎస్‌ ఉపగ్రహం ద్వారా భూమి, సముద్ర ఉపరితల వాతావరణం ఇస్రో అధ్యయనం చేయనున్నది. పదేళ్ల పాటు ఇన్‌శాట్‌ 3డీఎస్‌ శాటిలైట్‌ సేవలు అందించనున్నది.


ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్‌ సోమ్‌నాథ్‌ మాట్లాడుతూ ప్రయోగం విజయవంతమైనందని ప్రకటించారు. శాస్త్రవేత్తల బృందానికి అభినందనలు చెప్పారు. అనుకున్న విధంగానే ఇన్‌శాట్‌ 3డీఎస్‌ ఉపగ్రహాన్ని రాకెట్‌ విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టిందని తెలిపారు. ఇన్‌శాట్‌ ప్రయోగం విజయవంతమైన ప్రకటిస్తున్నందుకు సంతోషిస్తున్నానన్న ఆయన.. ముందుంగా నిర్దేశించి విధంగానే రాకెట్‌ కక్ష్యలో ప్రవేశించిందని పేర్కొన్నారు.


ప్రక్రియ అంతా సాఫీగా సాగిందని.. ఇన్‌శాట్‌ 3డీఎస్‌తో భూ, సముద్ర వాతావరణంపై ఖచితత్వంతో సమాచారం అందుతుందన్నారు. కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌ సైతం ప్రయోగం విజయవంతం కావడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇన్‌శాట్‌ 3డీఎస్‌ ఉపగ్రహాన్ని విజయవంతంగా నింగిలోకి పంపిన ఇస్రో శాస్త్రవేత్తల బృందానికి ఆయన అభినందనలు తెలిపారు. అంతరిక్షరంగంలో అనేక విషయాలు సాధించామన్న ఆయన.. మోదీ ప్రోత్సాహంతో ఇస్రో వరుస విజయాలు సాధిస్తుందని తెలిపారు.

Exit mobile version